అదుపులో అంతర్ రాష్ట్ర దొంగలు
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:04 PM
ఆదోని పట్టణంలోని తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద శనివారం అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

ఇద్దరు అరెస్టు, పరారీలో మరో ఇద్దరు
రూ.1.76 లక్షల నగదు, 20 గ్రాముల బంగారు అభరణాలు
ఆదోని, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఆదోని పట్టణంలోని తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద శనివారం అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వన టౌన పోలీస్ స్టేషనలో డీఎస్సీ సోమన్నతో పాటు సీఐ శ్రీరామ్ విలేకరుల వివరాలను వెల్లడించారు. ఆలూరు పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన గోవిందరాజులు, నంద్యాల జిల్లా డోన పట్టణంలోని చిరుమాన పేటకు చెందిన ఎరుకలి బండిచిన్న అనే వ్యక్తులు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవారు. ఈ ఇద్దరు మరో ఇద్దరిని కలుపుకుని దొంగతనాలు చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డారు. అందులో భాగంగానే ఆదోని టూ టౌన పోలీస్ స్టేషనలో రెండు కేసులు, ఆదోని వన టౌన పోలీస్ స్టేషనలో ఒక కేసు, కర్నూల్‌లో ఒక కేసు వీరిపై నమోదు అయ్యాయని తెలిపారు. ఈ కేసులలో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఇటీవల ఎస్పీ బిందు మాధవ్ రికవరీ విషయాల్లో చాలా వెనకబడ్డారని, ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకుని పురోగతి సాధించాలని సూచించారు. దీంతో డీఎస్పీ సోమన్న తనదైన శైలిలో వనటౌన సీఐ శ్రీరామ్‌తోపాటు సిబ్బందిని ఒక టీముగా ఏర్పాటు చేసి రికవరీపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఆలూరు చెందిన గొవిందరాజులతోపాటు డోన పట్టణంలోని చిరుమాన పేటకు చెందిన ఎరుకలి బండి చిన్నాలను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 80 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, రూ.1.76 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదోని పట్టణంలోని మూడు కేసులు, కర్నూల్‌లోని ఒక కేసుకు సంబంధించిన నగదుతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగానే ఆదోని వన టౌన పోలీస్ స్టేషనకు సంబంధించిన రూ.1.24 లక్షలు, ఆదోని టూ టౌన పోలీస్ స్టేషన పరిధిలోని 45 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.50వేల నగదును, కర్నూలులోని నాలుగో పట్టణ పరిధిలోని 40గ్రాముల బంగారం ఆభరణాలును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.6.24లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు రూ.1.76లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిలో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న ప్రత్యేక టీం అయిన శ్రీరామ్‌తో పాటు హెడ్ కానిస్టేబుల్ సత్తార్ వలి, పోలీసులు లక్ష్మన్న, అశోక్ కుమార్, మునిస్వామి, రామచంద్రలను డీఎస్పీ సోమన్న ప్రత్యేకంగా అభినందించారు. వీరికి నగదు బహుమతి అందించేందుకు ఎస్పీకి సిపారసు చేసినట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు.