Share News

ఆన్‌లైన్‌లో ఇంటర్‌ మూల్యాంకనం!

ABN , Publish Date - May 26 , 2024 | 02:07 AM

ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ఇకపై ఆన్‌లైన్‌లో జరగనుంది. ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఈ నూతన విధానం ప్రారంభం కానుంది.

ఆన్‌లైన్‌లో ఇంటర్‌ మూల్యాంకనం!

ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షల నుంచే ప్రారంభం

మద్దిలపాలెం(విశాఖపట్నం), మే 25: ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ఇకపై ఆన్‌లైన్‌లో జరగనుంది. ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఈ నూతన విధానం ప్రారంభం కానుంది. దీంతో అధ్యాపకులు సెంటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని జవాబుపత్రాలు దిద్దే వెసులుబాటు కలుగుతుంది. ఈ ఆన్‌లైన్‌ మూల్యాంకనం కోసం కర్నూలు, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నంలలో ఆరు రీజియన్‌ స్కానింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు డివిజన్‌ను విశాఖ రీజియన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ రీజియన్‌కు సంబంధించి విశాఖలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో స్కానింగ్‌ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడ 52 కంప్యూటర్‌ స్కానింగ్‌ మిషన్లతో పాటు అవసరమైన సామగ్రి సిద్ధం చేశారు. దీని పరిధిలోని జిల్లాల ఇంటర్‌ పరీక్షల జవాబుపత్రాలు ఈ సెంటర్‌కు వస్తాయి. 24 పేజీలు కలిగిన బుక్‌లెట్‌ను స్కానింగ్‌ చేసి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. మూల్యాంకనం చేయబోయే అధ్యాపకులకు యూనిక్‌ కోడ్‌, పాస్‌వర్డ్‌ అందిస్తారు. వాటితో వారు లాగిన్‌ అయ్యి జవాబుపత్రాలను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేయాలి. అధ్యాపకుడు తనకు నచ్చిన సమయంలో నచ్చినచోటి నుంచి జవాబుపత్రాలు దిద్దుకోవచ్చు. ఒక్కొక్కరు రోజుకు 30 పేపర్ల వరకు మూల్యాంకనం చేయాలి. దిద్దిన ప్రతి పేపర్‌కు రూ.23.69 చొప్పున చెల్లిస్తారు.

Updated Date - May 26 , 2024 | 02:07 AM