భాషల ప్రాచీనతకు శాసనాలే పునాదులు
ABN , Publish Date - Aug 30 , 2024 | 04:09 AM
భాషల ప్రాచీనతకు శాసనాలే పునాదులని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
మాతృభాష గొప్పతనం అందరికీ తెలియాలి
ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే సాగాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
తొలి తెలుగు శాసనం లభించిన కలమల్లలో తెలుగుభాషా దినోత్సవం
ఎర్రగుంట్ల, ఆగస్టు 29: భాషల ప్రాచీనతకు శాసనాలే పునాదులని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని తొలి తెలుగు శాసనాలు లభించిన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల చెన్నకేశవ, సిద్ధేశ్వరస్వామి ఆలయ ప్రాంగణలో గురువారం ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుభాష, తెలుగు కవులు, సాహితీవేత్తలు, ఇతిహాసాల గురించి ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన తిలకించారు. అనంతరం తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు కలెక్టర్ లోతేటి శివశంకర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇచ్‌చార్జి సి.భూపేశ్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ‘ఇంట్లో, వీధిలో, బడిలో, గుడిలో అమ్మ ఒడిలో, నారుమడిలో మాతృభాషనే మాట్లాడాలి. తెలుగు ఔన్నత్యాన్ని కాపాడేందుకు అందరం ప్రతిజ్ఞ చేయాలి. మన భాష సంస్కృతికి చుక్కాని లాంటిది. అది మనతో ఆగిపోరాదు. శాసనాల సంరక్షణకు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని భాషను ప్రోత్సహించాలి. ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగుభాషలోనే సాగాలి. శాసనాల పరిశోధనలను కొనసాగించాలి. తెలుగుభాషను ప్రాచీన భాషగా గుర్తించారు. విజ్ఞానం అందరికి అందాలనే సంకల్పంతో వ్యవహారిక భాషా ఉద్యమానికి గిడుగు రామ్మూర్తి శ్రీకారం చుట్టారు. ఆయన పుట్టిన రోజును తెలుగుభాషా దినోత్సవంగా చేసుకోవడం సంతోషకరం. వికసిత్ కడప, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్‌కు జరిగే ప్రయాణంలో అందరి భాగస్వామ్యం కావాలి ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన ప్రధాని మోదీ, పూర్వ రాష్ట్రపతులు కూడా మాతృభాషలో చదివి అంతటి గొప్పవారయ్యారన్నారు, కలమల్ల శాసనాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలి’ అని అన్నారు.