ఇన్‌పుట్ సబ్సిడీ కొందరికే!
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:05 AM
రాష్ట్రంలో నిరుడు తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి లక్షలాది మంది రైతులు నష్టపోయారు. అదేసమయంలో మిచౌంగ్ తుఫాన్‌తో అకాల వర్షాలు కురిసి వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

నేడు నిధులు విడుదల చేయనున్న సీఎం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో నిరుడు తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి లక్షలాది మంది రైతులు నష్టపోయారు. అదేసమయంలో మిచౌంగ్ తుఫాన్‌తో అకాల వర్షాలు కురిసి వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కరువు, తుఫాన్ వల్ల నష్టపోయిన 11.59 లక్షల మందికి రూ.1,294 కోట్లను ఇన్‌పుట్ సబ్సిడీ కింద సీఎం జగన్ బుధవారం విడుదల చేయనున్నారు. పంట నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ అరకొర సాయంతో సరిపుచ్చుతోందని రైతులు రగిలిపోతున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 33ుపైన పంట నష్టాలకే ప్రభుత్వం పరిహారం రూపంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తోంది. కరువు, తుఫాన్ వల్ల 10ుపైన నష్టం జరిగినా.. రైతులకు పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో కరువు, చంద్రబాబు కవల పిల్లలని హేళన చేసిన జగన్.. తన హయాంలోనూ కరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 448 మండలాల్లో తీవ్ర వర్షాభావం ఏర్పడగా, సర్కార్ కేవలం 103 కరువు మండలాలనే ప్రకటించింది. తీవ్ర వర్షాభావం వల్ల ఖరీ్‌ఫలో 27 లక్షల ఎకరాల్లో విత్తనమే పడలేదు. వేసిన పంటలకు సాగునీరు అందక దిగుబడులు తగ్గి, రైతులు నష్టపోయారు. కరువు ప్రాంతాల్లో 14.23 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని, 7 లక్షల మంది రైతులు నష్టపోయారని అధికారులు అంచనా వేశారు. గత డిసెంబరులో మిచౌంగ్ తుఫాన్‌తో 22 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి, 6.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. తుఫాన్ కారణంగా 4.61 లక్షల మంది రైతులు నష్టపోయారని లెక్క తేల్చారు. కరవు, తుఫాన్ కారణంగా దాదాపు 21 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని, 11.59 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. దీంతో ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.1,294 కోట్లను బాధిత రైతుల ఖాతాలకు జమ చేయనున్నట్లు చెబుతున్నారు. కాగా, ప్రకృతి విపత్తులకు నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు రూ.4వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తామన్న జగన్ సర్కార్ 57నెలల్లో పంట నష్టపోయిన రైతులకు వెచ్చించింది కేవలం రూ.3,262 కోట్లు మాత్రమే. ఏటా ఏదోక విపత్తుతో లక్షలాది రైతులు పంటల్ని కోల్పోయినా పూర్తి స్థాయి సాయం అందక నష్టాల పాలవుతూనే ఉన్నారు.