ఏపీకి పారిశ్రామిక మణిహారం
ABN , Publish Date - Aug 29 , 2024 | 05:16 AM
(స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ)ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కడప జిల్లాలోని కొప్పర్తి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నగరాలకు కేంద్రం ఓకే
మూడేళ్లలో శరవేగంగా పూర్తి
కొప్పర్తిలో 54 వేలు, ఓర్వకల్లులో
45 వేల మందికి ఉపాధి అవకాశాలు
పారిశ్రామిక పురోగతికి దోహదం
10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక నగరాలు
మారనున్న దేశ పారిశ్రామిక రంగం
కేంద్ర మంత్రులు పీయూష్, వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ఏపీలో పారిశ్రామిక స్మార్ట్ సిటీ
(స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ)ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కడప జిల్లాలోని కొప్పర్తి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అదేవిధంగా రాష్ట్రం పారిశ్రామికంగా మరింత అభివృద్ధిపథంలో దూసుకుపోనుంది. ఇక, తెలంగాణలోని జహీరాబాద్‌లోనూ పారిశ్రామిక స్మార్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాల్లో ఇదే తరహాలో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. ఆయా వివరాలను.. కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, అశ్వినీ వైష్ణవ్‌లు మీడియాకు వివరించారు. దేశంలో రూ.28,602 కోట్ల పెట్టుబడితో 12 కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీలను నెలకొల్పనున్నట్టు చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటికే భూసేకరణ పూర్తయిందని, పర్యావరణ అనుమతులు కూడా తీసుకున్నామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టులను శరవేగంతో పూర్తి చేస్తామన్నారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, ఆయన హయాంలో ఈ స్మార్ట్ సిటీలు వేగంగా అభివృద్ధి చెందుతాయని మంత్రులు తెలిపారు. విభజనతో ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఈ స్మార్ట్ సిటీలు వరంగా మారుతాయన్నారు. ముఖ్యంగా సీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివరించారు.
మరిన్ని వివరాలు..
ఉత్తరాది, దక్షిణాది, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల్లో నెలకొల్పే ఈ స్మార్ట్ సిటీలు దేశానికి మణిహారంగా ఉండనున్నాయి. జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్మించనున్నారు.
ఈ స్మార్ట్ సిటీలకోసం స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను ఏర్పాటు చేస్తారు. దీనిలో రాష్ట్రాల వాటా భూమి రూపంలో ఉంటుంది. మాచింగ్ నిధులు కేటాయించనవసరం లేదు.
కేంద్ర, రాష్ట్రాల వాటా పోగా అయ్యే అదనపు ఖర్చుకు తక్కువ వడ్డీకి దీర్ఘకాలం చెల్లింపు ప్రాతిపదికన రుణ సౌకర్యం కల్పిస్తారు. ఈ పారిశ్రామిక నగరాల వల్ల దేశవ్యాప్తంగా మొత్తం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 30 లక్షలమందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది.
చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఇప్పటికే కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం, తుముకూరు పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది.
దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ సిటీలతో పారిశ్రామిక రంగం స్వరూపం పూర్తిగా మారనుంది. ఉత్పాదక సామర్థ్యం పెరగడంతో పాటు నగరాలు, పారిశ్రామిక కేంద్రాలు కలగలిపి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రగతి జరుగుతుంది. ఇది ‘ఆత్మ నిర్భర్ భారత్’కు దోహదం చేయనుంది.
ఈ పారిశ్రామిక నగరాలు గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీలుగా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతాయి. పారిశ్రామిక వేత్తలు స్వేచ్ఛగా ప్రవేశించి వెంటనే ఉత్పత్తి ప్రారంభించేందుకు అనువుగా అన్ని రకాల ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
‘ప్రధానమంత్రి గతిశక్తి’ జాతీయ మాస్టర్ ప్లాన్‌లో ఈ నగరాలు రూపొందుతాయి. పని ప్రాంతాలకు సమీపంలోనే నివాస వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తారు.
తెలంగాణలోని జహీరాబాద్‌కు ఉత్తరాన 9 కిలోమీటర్ల దూరంలో 3,245 ఎకరాల్లో రూ.2,361 కోట్ల వ్యయంతో పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. దీనిలో రూ.10 వేల కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది.
కొప్పర్తి ప్రత్యేకతలు
ఉత్పత్తి: పునరుత్పాదక ఇంధనం, ఆటో పరికరాలు, లోహ ఖనిజ వనరులు, లోహేతర ఖనిజ వనరులు, రసాయనాలు, జౌళి, ఇంజనీంగ్ వస్తువులు.
ప్రయాణం ఈజీ: కొప్పర్తి.. కడప విమానాశ్రయానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. 40వ నెంబర్ జాతీయ రహదారికి 5 కిలో మీటర్ల దూరంలో తిరుపతి విమానాశ్రయం, నాలుగు జాతీయ రహదారులు, రెండు రేవులు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
ఓర్వకల్లు ప్రత్యేకతలు
ఉత్పత్తి: ఎయిరో స్పేస్, రక్షణ పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, ముత్యాలు, నగలు, జౌళి, వస్త్ర పరిశ్రమతో పాటు ఇతర ఉత్పత్తులు. ఈ క్రమంలో విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్ల అభివృద్ధి జరుగుతుంది.