లోతైన విచారణ చేయాలి
ABN , Publish Date - Aug 24 , 2024 | 05:39 AM
ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఘోరంగా విఫలమయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు చిత్తుగా ఓడించినా ఆయన వైఖరిలో మార్పురాలేదు.
ప్రమాదంపై ప్రభుత్వ స్పందన సరిగా లేదు: జగన్
నివేదికను తొక్కిపెట్టిన జగన్: షర్మిల
పరామర్శకు వెళ్లి గొప్పలా?
పనిలో పనిగా రాజకీయ విమర్శలు
జగన్ వ్యవహార శైలిపై ఆక్షేపణ
విస్తుపోయిన ‘ఎసెన్షియా’ బాధితులు పరామర్శకు వెళ్లి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఘోరంగా విఫలమయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు చిత్తుగా ఓడించినా ఆయన వైఖరిలో మార్పురాలేదు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో కుటుంబ సభ్యులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ శవరాజకీయాలు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సందర్భానికి భిన్నంగా లేనిపోని గొప్పలకు పోవడంతో పాటు రాజకీయ ప్రసంగం చేశారు. శుక్రవారం అనకాపల్లిలో బాధితుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన గురించి గొప్పగా చెప్పుకోవడంతో పాటు రాజకీయ విమర్శలు చేయడంతో అక్కడున్నవారంతా విస్తుపోయారు. బాధితులకు 15రోజుల్లో పరిహారం అందకుంటే తానే వచ్చి ధర్నా చేస్తానంటూ పదే పదే చెప్పారు. తానొచ్చి ధర్నా చేస్తానంటే చంద్రబాబు భయపడతారంటూ డప్పు కొట్టుకున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనను గుర్తుకు తెస్తూ తానప్పుడు రూ.కోటి పరిహారం ప్రకటించానంటూ ఘనంగా చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న ఒక వైసీపీ మహిళా నేత చప్పట్లు కొట్టారు. వెనుక ఉన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆమెను వారించాల్సి వచ్చింది. ఆప్తులను కోల్పోయి బాధలో ఉన్న బాధితుల ఎదుట గొప్పలు చెప్పుకోవడం అవసరమా? అన్న విమర్శలు వినపడ్డాయి. జగన్ తానొచ్చిన సందర్భాన్ని మరచి రాజకీయ విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయన్నారు. వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కావడం లేదని, రైతుభరోసా దక్కడం లేదని, పంటల బీమా చెల్లించలేదని, ప్రీమియం కట్టలేదని, గోరుముద్ద పథకం అమలు కావడం లేదని.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని రాజకీయ ఉపన్యాసం చేశారు. ఇదెక్కడి శవరాజకీయమంటూ బాధిత కుటుంబాలు ఈసడించుకున్నాయి.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏదీ?
2020లో విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. తెల్లవారుజామున సంఘటన జరగగా, విషవాయువులు వెలువడి 15,000 మంది ఊపిరి ఆడక, కళ్లు మంటలతో నరకయాతన అనుభవించారు. ఘటన జరిగిన రోజు నాటి సీఎం జగన్ క్షతగ్రాతులను పరామర్శించారు. బాధితుల కుటుంబాలతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. వెంటిలేటర్ మీద ఉన్నవారికి పది లక్షలు సాయం చేస్తామన్నారు. వెంకటాపురం తదితర గ్రామాలకు నిరంతరం వైద్య సేవలందించేందుకు వీలుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తానని నాడు జగన్ హామీఇచ్చారు. హెల్త్ కార్డులు జారీ చేస్తానని, జీవితాంతం ఉచిత వైద్య సేవలు అందిస్తానని ప్రకటించారు. తర్వాత ఎల్జీ పాలిమర్స్ నుంచి మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించారు. ఆ తర్వాత మరో ముగ్గురు చనిపోయినా ప్రమాద ఘటనతో సంబంధం లేదని చెప్పి పరిహారం చెల్లించలేదు. చనిపోయిన పశువులకు నష్టపరిహారం లేదు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం హామీని గాలికొదిలేశారు.
జగన్ తీరుపై విమర్శలు
ఎసెన్షియా ఘటన అనంతరం సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత తదితరులు క్షతగాత్రులను, బాధిత కుటుంబాలను పరామర్శించారు. వైద్యసేవలు అందుతున్న తీరుపై సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. స్థానిక వైసీపీ నేతలెవరూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. వైసీపీ తరఫున బాధిత కుటుంబాలకు సహాయాన్ని ప్రకటించలేదు. అయినా జగన్, ఆయన రోత పత్రిక ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేశా రు. ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత పరామర్శకు వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు జగన్ అంతటితో పాటు పరిమితం కాకుండా రాజకీయం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.