Share News

పెంచి.. తగ్గించి!

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:09 AM

స్మార్ట్‌ మీటర్ల ధరల విషయంలో విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లు ఇప్పటికీ ఒక స్పష్టతకు రాలేదు. బిడ్‌ విధానం పారదర్శకంగా ఉందని, రివర్స్‌ టెండర్లను,

పెంచి.. తగ్గించి!

స్మార్ట్‌ మీటర్ల ధరల౅పై స్పష్టత లేని డిస్కమ్‌లు

ధరలు పెంచేసి.. బిడ్‌లు

అదానీ, షిర్డీసాయికి సొంతం

విమర్శలు రావడంతో తగ్గింపు

వాస్తవ ధరలపై ఇంధనశాఖ గోప్యం

మోసం జరిగిందంటున్న నిపుణులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

స్మార్ట్‌ మీటర్ల ధరల విషయంలో విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లు ఇప్పటికీ ఒక స్పష్టతకు రాలేదు. బిడ్‌ విధానం పారదర్శకంగా ఉందని, రివర్స్‌ టెండర్లను, ఆ తర్వాత సంప్రదింపుల ప్రక్రియను చేపట్టామని చెబుతున్న డిస్కమ్‌లు వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నాయి. తాజాగా విద్యుత్తు నియంత్రణ సంస్థ(ఏపీఈఆర్‌సీ) చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో కొన్ని గణాంకాలు వెల్లడించినా వాటిలోనూ స్పష్టత లేదని విద్యుత్తురంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్లను రెండు దశల్లో బిగించాల్సి ఉంది. వీటిలో 38,63,537 గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో స్మార్ట్‌ మీటర్ల ధరలు రూ.12,047 నుంచి రూ.12,713 దాకా ఉంటే.. రాష్ట్రంలో మాత్రం.. రూ.13,578 నుంచి రూ. 14,319 వరకు ఉందని డిస్కమ్‌లు ఇటీవల ఏపీఈఆర్‌సీకి అందించిన సమాచారంలో పేర్కొన్నాయి. స్మార్ట్‌ మీటర్ల ధరలను సమీక్షిస్తున్నామంటున్న డిస్కమ్‌లు.. ఏయే సంస్థలతో ఎంతెంత ధరలకు ఒప్పందం చేసుకున్నారో మాత్రం చెప్పడం లేదు. దీనిపై ఇంధన శాఖ కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. మరోవైపు, స్మార్ట్‌ మీటర్ల బిడ్‌లలో అదానీ, షిర్డీసాయి సంస్థలు పాల్గొన్నాయి. 2022, మే 22న స్మార్ట్‌ మీటర్ల టెండర్ల ప్రక్రియ మొదలైంది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయ మీటర్ల ధరలెంతో.. గృహ, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు స్మార్ట్‌ మీటర్లను బిగించినందుకు ఎంత వసూలు చేస్తారో అనే విషయాలను కూడా డిస్కమ్‌లు గాని.. ఇంధన శాఖగానీ అధికారికంగా ప్రకటించలేదు. 2024-25 వార్షిక ఆదాయ వ్యయ నివేదికపై ఏపీఈఆర్‌సీ చేపడుతున్న అభిప్రాయ సేకరణలో ఇస్తున్న సమాచారం కూడా గజిబిజిగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్ల బిగింపు అంశంపై విద్యుత్తు రంగ నిపుణుడు ఎం. వేణుగోపాలరావు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఏపీఎస్పీడీసీఎల్‌ ఇచ్చిన సమాధానం వింతగా ఉంది. దీంతో అధికారులు అసలేం చెప్పదలచుకున్నారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. 2022, డిసెబరు 5న 11 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల కోసం ఎస్పీడీసీఎల్‌ పిలిచిన టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,369 కోట్లకు పరిపాలనా ఆమోదం తెలిపింది. టెండర్లను పిలిచాక.. 2022, డిసెంబరు 22న అవే టెండర్లను రూ.4,068.08 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. ఇలా ఒక్కసారిగా ప్రభుత్వం పెద్దమొత్తంలో పెంచడానికి గల కారణాలను డిస్కమ్‌లు వివరించలేదు. ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వలేదు. స్మార్ట్‌ మీటర్ల వ్యయాన్ని వినియోగదారుల నుంచి 93 నెలల్లో వాయిదాల రూపంలో వసూలు చేయాలని మాత్రమే డిస్కమ్‌లను ప్రభుత్వం ఆదేశించింది.

వ్యవసాయానికీ అంతే

ఏపీసీపీడీసీఎల్‌ 5 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు 2022, డిసెంబరు 5న రూ.1531 కోట్లకు టెండర్లను పిలిచింది. దానిని 2023, జూన్‌ 21వ తేదీనాటికి ఏకంగా రూ.333.18 కోట్లను పెంచుతూ రూ.1864.54 కోట్లకు చేశారు. మరో 2.58 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లను బిగించేందుకు 2022, డిసెంబరు 5న పరిపాలనా ఆమోదం పొందింది. దీనికి రూ.956.41 కోట్లకు పరిపాలనా ఆమోదం ఇచ్చిన ప్రభుత్వం.. ఆ వెంటనే రూ.699.08 కోట్లకు కుదించింది. అదేవిధంగా ఎస్పీడీసీఎల్‌ పిలిచిన టెండర్లకు అదానీ సంస్థ రూ.2288.25 కోట్లకు బిడ్‌ వేసింది. రివర్స్‌ టెండర్‌లో రూ.1990.78 కోట్లకు మీటర్లను బిగించేందుకు అదానీ సంస్థ అంగీకరించిందని ఎస్పీడీసీఎల్‌ పేర్కొంది. సంప్రదింపులు జరిపాక.. రూ.1386.93 కోట్లకు స్మార్ట్‌ మీటర్లను అమర్చేందుకు అంగీకరించినట్లుగా వెల్లడించింది. ఈ ధరలు అమాంతం 45.27 శాతం మేర(రూ.901.32 కోట్లను) తగ్గించేందుకు అంగీకరించడంలో అర్థమేమిటని నిపుణలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంటే స్మార్ట్‌ మీటర్ల ధరలను అమాతం రెట్టింపు చేసి బిడ్‌లను వేసినట్లుగా స్పష్టమవుతోందని చెబుతున్నారు. రెట్టింపు ధరలకు బిడ్‌లను వేసినప్పుడు వాటిని ఎందుకు రద్దు చేయలేదని నిలదీస్తున్నారు. ఏపీసీపీడీసీఎల్‌ అదానీ నుంచి 7,23,131 సింగిల్‌ ఫేజ్‌ కనెక్షన్లకు మీటర్లను బిగించేందుకు అదానీతో ఒప్పందం చేసుకుంది. ఈ మీటర్లను బిగించేందుకు నెలకు రూ.95.99 చొప్పున 93 నెలల పాటు.. అంటే రూ.8927.07 ఒక్కో సింగిల్‌ ఫేజ్‌ మీటరును అప్పగిస్తామని అదానితో సీపీడీసీఎల్‌ ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా 1,09,220 త్రీఫేజ్‌ మీటర్లు సరఫరా చేసేందుకు నెలకు రూ.185.87 చొప్పున 93 నెలల వాయిదాల చొప్పున రూ.17,285.91కు సరఫరా చేసేలా అదానీతో సీపీడీసీఎల్‌ ఒప్పందం చేసుకుంది. మరో 1,13,650 డీటీ మీటర్లకు నెలకు రూ.265.62 చొప్పున 93 నెలల పాటు వసూలు చేసేలా రూ.24702.66కు అదానీతో సీపీడీసీఎల్‌ అంగీకారం కుదుర్చుకుంది.

అస్మదీయులు కాబట్టే!

విద్యుత్తు మీటర్ల ధరలను నిశితంగా పరిశీలిస్తే.. అస్మదీయులమన్న ధీమాతో భారీగా రేట్లు పెంచేసి.. ఆ తర్వాత.. నిపుణులు, ప్రజా సంఘాల ఆందోళనలతో రివర్స్‌ టెండర్‌తో కొంత తగ్గించి.. ఆ తర్వాత సంప్రదింపుల సందర్భంగా మరింత తగ్గించడం వెనుక పెద్ద మోసమే దాగుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.2288.35 కోట్లకు వేసిన టెండరు ఏకంగా రూ.1386.93 కోట్లకు చేరుకోవడంలోనే.. భారీ మతలబులున్నాయని విద్యుత్తు రంగ నిపుణులు అంటున్నారు.

Updated Date - Feb 15 , 2024 | 08:54 AM