కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Jun 12 , 2024 | 02:56 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్థితిని చూశామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ
భీమవరం టౌన్, జూన్ 11: వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్థితిని చూశామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. అమర్ రాజా బ్యాటరీనే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన.. తండ్రి సూర్య నారాయణరాజు అస్వస్థతకు గురయ్యారని తెలిసి మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి తిరిగి వచ్చారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసి కన్నీరుపెట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రంలో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చంద్రబాబు దృష్టికి తీసుకె ళ్తానని, సోమవారం కేంద్రమంత్రి కుమారస్వామితో కూడా ఇదే అంశంపై మాట్లాడానని తెలిపారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సాహం ఇస్తామన్నారు. నిబంధనలు సులభతరం చేయడం, అనుమతులు ఇవ్వడం, త్వరితగతిన భూముల కేటాయింపు తదితర అంశాలపై భరోసా ఇచ్చినప్పుడే పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తారన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారానే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వర్మ హామీ ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ, కూటమి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.