Share News

తిరుపతి ఉప ఎన్నిక తంతులో.. ఈసారి ఖాకీలపై ఈసీ వేటు

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:45 AM

ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అధికార పక్షం విజయానికి అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసులపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వరుసగా చర్యలు తీసుకుంటోంది.

తిరుపతి ఉప ఎన్నిక తంతులో.. ఈసారి ఖాకీలపై ఈసీ వేటు

ఇద్దరు సీఐలు, ఎస్‌ఐ, హెచ్‌సీ సస్పెన్షన్‌

ఇంకో ఇద్దరు సీఐలు వీఆర్‌కు

అక్రమాలపై దర్యాప్తు జరపని వైనం

ఆనక కేసుల మూసివేతపై ఈసీ ఆగ్రహం

త్వరలో మరిన్ని సస్పెన్షన్లు!

తిరుపతి ఉప ఎన్నిక తంతులో..

తిరుపతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అధికార పక్షం విజయానికి అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసులపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వరుసగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఐఏఎస్‌ అధికారి గిరీషా, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోగా.. తాజాగా పోలీసు అధికారులపై కొరడా ఝళిపించింది. ఓటర్‌ ఐడీ కార్డులు అక్రమంగా డౌన్‌లోడ్‌ చేసిన వ్యవహారంలో ఇద్దరు సీఐలు, ఓ ఎస్‌ఐతో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌పై సస్సెన్షన్‌ వేటు వేసింది. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి తిరుపతి వెస్ట్‌ సీఐ శివప్రసాద్‌, ఈస్ట్‌ సీఐ శివప్రసాదరెడ్డి, ఎస్‌ఐ జయస్వాములు, హెడ్‌ కానిస్టేబుల్‌ ద్వారకానాథరెడ్డిలను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేస్తూ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. అదేవిధంగా ప్రస్తుత అలిపిరి సీఐ అబ్బన్నను, అప్పటి అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. ఉప ఎన్నికల కోసం వాడిన నకిలీ ఎపిక్‌ కార్డులను, ఆధార్‌ కార్డులను సాక్ష్యాధారాలతో విపక్షాల నేతలు పోలీసులకు అప్పగించగా.. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోకపోగా కాలక్రమంలో ఆయా కేసులను మూసివేయడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు, విపక్షాల ఫిర్యాదులపై విచారించలేదని నిర్ధారించుకుంది. దొంగ ఓట్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎపిక్‌ కార్డులు, ఆధార్‌ కార్డుల వివరాలను సేకరించి భద్రపరచాల్సి ఉండగా, అవేమీ చేయలేదని గుర్తించింది. ఎలాంటి విచారణా లేకుండా వైసీపీ పెద్దల ఒత్తిడితో ఆయా కేసులను మూసివేసినట్లు తేల్చింది. ఈ కేసులో తొలి వేటు ఐఏఎస్‌ అధికారి గిరీషా మీద పడగా మలివేటు తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌పై పడిన విషయం తెలిసిందే. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డిపై కూడా ఈసీ గత శుక్రవారం వేటు వేసింది. ఈ వ్యవహారంలో ఇంకొందరు సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - Feb 12 , 2024 | 02:45 AM