అక్రమార్జనలో తోపులు!
ABN , Publish Date - Jan 12 , 2024 | 04:30 AM
రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గాల వరుసలోనే ఆ నియోజకవర్గం ఉంటుంది. ఫ్యాక్షన్ ఆనవాళ్లు ఉన్న నియోజకవర్గం కూడా

అనంతలో అవినీతి ప్రకాశాలు
సోదరులిద్దరూ షాడో ఎమ్మెల్యేలు
వివాదాస్పద భూములు హస్తగతం
రియల్టర్ల నుంచి కప్పం వసూళ్లు
దౌర్జన్యాలు, బెదిరింపులతో కోట్ల ఆర్జన
షాడో ఎమ్మెల్యేల దెబ్బతో పరిశ్రమలు పరార్
మహిళల నుంచి వసూళ్లు.. వడ్డీ వ్యాపారం
అప్పుల్లో నుంచి రూ.వందల కోట్లకు పడగ
వీళ్లు మామూలు తోపులు కాదు.. బ్రో!
ఆయన అధికార పార్టీ ప్రజాప్రతినిధి. ప్రజలను కాపు కాయడం ఏమోకానీ.. అందిన కాడికి దోచుకోవడంలో మాత్రం తోపుగా గుర్తింపు పొందారు. అనంతలో ఈయన అవినీతి భారీ ఎత్తున ప్రకాశిస్తోందని సొంత నేతలే గుసగుసలాడుతున్నారు. ఆయనతోపాటు ఇద్దరు సోదరులు.. చేతి వాటం.. నోటి వాటంతో కోట్లు కూడబెట్టుకున్నారు. తమను మించిన తోపులు ఎవరంటూ అక్రమ సంపాదనలో దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యే సోదరుల భూదందాలు, దౌర్జన్యాలు, అరాచకాలకు అంతేలేదని, వాళ్లను మించిన తోపులు లేరని టాక్!!
ఆ ఎమ్మెల్యే చెప్పేవన్నీ శ్రీరంగనీతులే. ఎవరన్నా ఏమన్నా అంటే నా రేంజే వేరంటారు. సీఎం తరువాత సీఎం లాంటివాణ్నంటూ కాలర్ ఎగరేస్తారు. ఇరిగేషన్ టాపిక్ అయితే పోలవరం నుంచి పిల్లకాలువల వరకూ తనకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదన్నట్లుగా లెక్చర్లిస్తుంటారు. పార్టీ సభలు, సమావేశాల్లో ఉపన్యాసాలతో ఊదరగొడుతుంటారు. మీడియా సమావేశం ఏర్పాటు చేశారా... విలేకరులకు తలలు బొప్పి కట్టాల్సిందే!!
రెండుసార్లు ఓటమితో ఆర్థికంగా కుదేలైన ఈ తోపు.. మూడోసారి గాలివాటంతో గెలుపొందారు. అయితే.. రెండు ఓటమి ఎఫెక్టులతో అప్పులపాలైన ఈ ప్రజాప్రతినిధి ఒక్క చాన్స్ దక్కడంతో సొమ్ములు పోగేసుకుని అప్పుల నుంచి బయటపడడమే కాదు.. ఏకంగా రూ.500 కోట్ల మేర ఆస్తులను సంపాదించుకున్నారు. వందల ఎకరాలు సొంతం చేసుకున్నారు. పొరుగు రాష్ట్ర రాజధానిలోనూ ఆస్తులు కూడబెట్టుకున్నారు.
(అనంతపురం-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గాల వరుసలోనే ఆ నియోజకవర్గం ఉంటుంది. ఫ్యాక్షన్ ఆనవాళ్లు ఉన్న నియోజకవర్గం కూడా! ఆ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడుసార్లు పోటీచేసి.. రెండు సార్లు చతికిలపడి.. మూడోసారి గాలి వాటంగా గట్టెక్కారు. రెండుసార్లు ఓటమితో అప్పుల్లో ఉన్న ఆ ఎమ్మెల్యే కుటుంబం.. అధికారం అండతో రూ.కోట్లకు పడగలెత్తింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోచుడు... దాచుడే ఆ ఎమ్మెల్యే కుటుంబం పనిగా పెట్టుకుంది. ఎమ్మెల్యేగా ప్రజలు ఆ కుటుంబంలో ఒకరిని గెలిపిస్తే, ఎమ్మెల్యే సోదరులు, వారి కుటుంబ సభ్యులు షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. అక్రమార్జనకు కాదేదీ అనర్హమంటూ అన్నింటిలోనూ తలదూరుస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా ఆ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉంటుంది. దాదాపు 60 కిలో మీటర్ల మేర జాతీయ రహదారి నియోజకవర్గం పరిధిలో ఉండటంతో.. దానికి ఇరువైపులా ఉన్న వివాదాస్పద భూముల పంచాయితీలు ఎమ్మెల్యే సోదరుల కనుసన్నల్లోనే పరిష్కారమవుతున్నాయి. అందుకు ఎవరైనా సరే కప్పం కట్టాల్సిందే. ఇక ప్రభుత్వ భూముల ఆక్రమణ సరేసరి. మాట వినకున్నా... ఎదురు తిరిగినా... విమర్శలు చేసినా... వారిపై దాడులు తప్పవు. అనుచరులే ఈ తోపు ఎమ్మెల్యే కుటుంబానికి బినామీలుగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమ ఇక్కడి నుంచి పరారవడానికి ఆ ఎమ్మెల్యే కుటుంబసభ్యులే కారణమనేది ఇక్కడ ఎవరినడిగినా చెబుతారు. దళితుల భూములను ఆ ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించుకున్నారు. బాధితులు అధికారులకు మొరపెట్టుకున్నా.. ఎమ్మెల్యే చెంతకు వెళ్లి ప్రాధేయపడాలని సూచనలు ఇచ్చారే తప్ప.. చేసింది ఏమీ లేదు. పేదల బియ్యంలోనూ ఆయనకు వాటా ఇవ్వాల్సిందే.
గద్దల్లా వాలి..
జాతీయ రహదారికి ఇరువైపులా ఆ నియోజకవర్గం విస్తరించి ఉండటంతో ఎక్కడ వెంచర్లు వేసినా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు గద్దల్లా వాలిపోతుంటారు. వెంచర్లు వేయాలంటే కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తుంటారు. ఎకరాకు ఏకంగా రూ.10 లక్షలు చొప్పున దండుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వేసిన వెంచర్లనూ వదలడం లేదు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఆ నియోజకవర్గం ఉంది. అనంతపురం నగరం రోజురోజుకు విస్తరిస్తుండటంతో రియల్ వెంచర్లు ఈ నియోజకవర్గం వరకు విస్తరించాయి. ఇంకేముంది.. ఈ తోపులు అక్కడ వాలిపోయారు. ముక్కుపిండి మరీ రూ.కోట్ల మామూళ్లు వసూలు చేస్తున్నారు. సిటీ పేరుతో వేసిన ఓ వెంచర్ నిర్వాహకులను బెదిరించి దాదాపు రూ.15 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ వివాదాస్పద భూమిలో జోక్యం చేసుకుని, భారీగా ప్లాట్లు రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో లే అవుట్ నిర్వాహకుల నుంచి ఏకంగా రూ.5 కోట్లు, ఓ రియల్టర్ నుంచి రూ.2 కోట్లు వసూలు చేశారు. అడిగినంత కప్పం కట్టకపోతే బెదిరిస్తున్నారని బాధిత రియల్టర్లు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. సివిల్ సప్లయిస్ స్టేజ్-1 కాంట్రాక్టర్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుని, పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ అందులోనూ వాటాలు పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. చివరికి టమోటా మార్కెట్ సుంకం, టోల్‌ప్లాజా నుంచీ కమీషన్లను వదలడం లేదు. రోజుకు రూ.లక్ష ముట్టజెప్పాల్సిందేనని బాధితులు బహిరంగంగానే చెబుతున్నారు.
భూములను వదలని షాడో ఎమ్మెల్యేలు
ఎక్కడ వివాదాస్పద భూములున్నా షాడో ఎమ్మెల్యేలు రంగ ప్రవేశం చేస్తారు. జాతీయ రహదారి పక్కనున్న దాదాపు 100 ఎకరాలకుపైబడి భూమిని బలవంతంగా లాక్కున్నట్లు విమర్శలు ఉన్నాయి. గతంలో రాజకీయాల్లో పేరుమోసిన ఓ కుటుంబానికి చెందిన రూ.కోట్ల విలువ చేసే భూమిని లాక్కున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులనూ వదలడం లేదు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో, పలువురు రైతులకు సంబంధించిన 15 ఎకరాలను లాక్కున్నట్లు సమాచారం. ఈ లెక్కన 200 ఎకరాలకుపైగానే సొంతం చేసుకుని ఉంటారని అధికార పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది.
ధాబానే అరాచకాలకు అడ్డా
ఆ ఎమ్మెల్యే కుటుంబానికి ఎవరు అడ్డు చెప్పినా, చెప్పిన మాట వినకపోయినా.. పోలీసులను అడ్డుపెట్టుకొని బెదిరిస్తారు. లేకుంటే ఎమ్మెల్యే సోదరులే నేరుగా రంగంలోకి దిగుతారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ధాబాను అడ్డాగా చేసుకుని ఎమ్మెల్యే సోదరులు అరాచకాలు, దౌర్జన్యాలు, పంచాయితీలు చేస్తున్నారు. ఈ విషయం నియోజకవర్గంలో అందరికీ తెలిసిందే. వారి అరాచకాలు, దౌర్జన్యాలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ మారితే.. వారిపై దాడులు చేయిస్తారు. ఈ ఎమ్మెల్యే కుటుంబానికి ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఉండడంతో ఎన్ని అరాచకాలు చేసినా, బెదిరించినా.. బాధితులెవరూ బయటకురాలేని పరిస్థితులు ఆ నియోజకవర్గంలో ఉండడం గమనార్హం.
భూములు.. బాదుడు!
అనుచరులను బినామీలుగా చేర్చి, ప్రభుత్వ భూములను రిజిస్టర్ చేయించుకుంటున్నారు. సొంత సామాజికవర్గానికి చెందిన అనుచరుల పేరిటే భూములను రాయించుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యే సోదరులతో పాటు సొంత సామాజికవర్గానికి చెందిన ఆరుగురు బినామీల పేరిట భూములు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ యూనివర్సిటీకి చెందిన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు ఆ భూమిని చదును చేశారు. ప్రస్తుతం ఆ భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. జగనన్న లేఅవుట్ల ముసుగులో కొండలను పిండిచేసి ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. సొంత పార్టీ నేతలు అనుమతులు పొంది ఎర్రమట్టిని తరలించినా... ఎమ్మెల్యే కుటుంబానికి కప్పం కట్టాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
మహిళల సొమ్ముతో వ్యాపారం
డెయిరీ ఏర్పాటు ముసుగులో ఈ షాడో ఎమ్మెల్యేలు మహిళల నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. రెండు మూడేళ్లు ఈ సొమ్మును ఎమ్మెల్యే కుటుంబం తమవద్దే ఉంచుకుని వడ్డీ వ్యాపారం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. మహిళల నుంచి దాదాపు రూ.6 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఆ డెయిరీ ఏర్పాటు కోసం జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో ఐదెకరాలు భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. మహిళల ఉపాధి కోసం గత ప్రభుత్వ హయాంలో ఓ పరిశ్రమను తీసుకొచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ పరిశ్రమ నిర్వాహకులను ఎమ్మెల్యే రూ.10 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వారు పరిశ్రమను పొరుగు రాష్ర్టానికి తరలించారు.
అప్పుల్లో నుంచి వందల కోట్లకు
గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కుటుంబం అప్పుల్లో ఉంది. అప్పటికే రెండు సార్లు ఓటమి చెందడంతో ఆర్థికంగా కుదేలయ్యారు. ఆస్తులు కూడా అమ్ముకున్న పరిస్థితి. ఒక్క చాన్స్ గాలివాటంతో ఎమ్మెల్యేగా గెలవగా.. అక్రమార్జనకు అవసరమైన అన్ని అడ్డదారులను తొక్కారు. ప్రస్తుతం ఈ తోపు కుటుంబం రూ.వందల కోట్లకు పడగలెత్తిందన్న ప్రచారం ఉంది. పొరుగు రాష్ట్ర రాజధానిలోనూ ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ ఆస్తుల విలువ రూ.500 కోట్ల దాకా ఉంటుందని వైసీపీ వర్గాలే బాహాటంగా చెప్పుకోవడం గమనార్హం.