Share News

క్రమబద్ధీకరణలో కక్కుర్తి!

ABN , Publish Date - May 19 , 2024 | 03:12 AM

గిరిజన సంక్షేమ శాఖలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారం ఆ శాఖకు తలనొప్పిగా మారింది.

క్రమబద్ధీకరణలో కక్కుర్తి!

కాంట్రాక్టు టీచర్ల నుంచి లంచాలు

ప్రాజెక్టు అధికారులకు తెలియకుండానే రాష్ట్ర కార్యాలయానికి నడిచిన ఫైళ్లు

10 ఐటీడీఏల్లో 483 మంది రెగ్యులరైజేషన్‌

ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష వసూలు

అనర్హులనూ క్రమబద్ధీకరించిన వైనం

గిరిజన సంక్షేమ శాఖకు అవినీతి మకిలి

రంపచోడవరం, మే 18: గిరిజన సంక్షేమ శాఖలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారం ఆ శాఖకు తలనొప్పిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 ఐటీడీఏల్లో పని చేస్తున్న అర్హులైన సుమారు 483 మంది కాంట్రాక్టు టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరణ వ్యవహారంలో భారీగా సాగిన వసూళ్ల వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. గత సంవత్సరం అక్టోబరు 21న ఆర్థిక శాఖ జీవో 114 జారీ చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్‌ 2లోగా ఆయా ఐటీడీఏల పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో కాంట్రాక్టు టీచర్లు(సీఆర్‌టీ)గా చేరిన వారి సర్వీసును క్రమబద్ధీకరించాలి. ఈ మేరకు గిరిజన సంక్షేమ డైరెక్టర్‌ కార్యాలయం ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయా ఐటీడీఏల పరిధిలోని జిల్లా యూనిట్లకు సూచనలు చేసింది. దీంతో ఆయా ఐటీడీఏల పరిధిలోని గిరిజన సంక్షేమ జిల్లా అధికారుల కార్యాలయాలు చర్యలు చేపట్టాయి. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో 46 మంది, విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 131 మంది, విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 209 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 92 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు మొత్తం 483 మంది కాంట్రాక్టు టీచర్లను అర్హులుగా గుర్తించారు. వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఇక్కడే మొదలైంది. సర్వీసును క్రమబద్ధీకరించేందుకు ఒక్కొక్క ఉపాధ్యాయుడిని రూ.లక్ష ముడుపులు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. అది కూడా రాష్ట్ర కార్యాలయం నుంచే అనధికారిక ఆదేశాలు రావడంతో ఉపాధ్యాయులు విస్తుబోయారు. కాదంటే తమ సర్వీసు క్రమబద్ధీకరణ కాదేమోనన్న బెంగతో అడిగినంతా సమర్పించుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.4.50 కోట్ల మేర వసూళ్లు సాగాయని సమాచారం. అంతేకాకుండా ఆయా జిల్లా కార్యాలయాలకు సంబంధించి కూడా ప్రతి టీచర్‌ నుంచి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ నియామకాల కోసం కమిటీలను కూడా నియమించి వ్యవహారం మొత్తాన్ని చక్కబెట్టారు. ఈ అవినీతి వ్యవహారం తాజాగా రచ్చకెక్కడంతో పలు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు విచారణ చేపట్టారు. ఐటీడీఏ పరిధిలో జరిగే ప్రతి అంశమూ ప్రాజెక్టు అధికారి ఆమోదంతోనే జరగాల్సి ఉండగా ఈ విషయానికి సంబంధించి మాత్రం ప్రాజెక్టు అధికారితో సంబంధం లేకుండానే రాష్ట్ర గిరిజన సంక్షేమ డైరెక్టర్‌ కార్యాలయం చక్కబెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు ఉపాధ్యాయుల ఫైళ్లను నేరుగా డైరెక్టర్‌ కార్యాలయానికే తెప్పించుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే స్థానిక గిరిజన సంక్షేమ కార్యాలయంలో బాధ్యులైన ఉన్నతాధికారుల నుంచి సెక్షన్‌ గుమస్తాల వరకు అందరికీ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన విచారణలో పలువురు అనర్హులను సిఫారసు చేయడం, ఆయా సీఆర్‌టీల నియామక నోటిఫికేషన్‌ను సక్రమంగా పరిశీలించకపోవడం, పలువురికి సరైన బాండ్లు లేకపోవడం, డ్యూటీ సర్టిఫికెట్లకు సంబంధించి విచారణ జరపకపోవడం వంటివి వెలుగు చూశాయి. అంతేకాదు.. పలువురికి టెట్‌ అర్హత కూడా లేకపోవడం వంటి లోపాలను గుర్తించినట్టు తెలిసింది. ఈ వ్యవహారం ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖలో సంచలనంగా మారింది.

Updated Date - May 19 , 2024 | 08:06 AM