Share News

AP Politics: 9 మంది టీడీపీ అభ్యర్థులు సిద్ధం.. జనసేన సీట్లపై ఇంకా రాని స్పష్టత!

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:10 AM

సామాజిక సమీకరణలు, విజయావకాశాలు, స్థానికంగా ఉన్న పట్టు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీ నాయకత్వం వీరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది..

AP Politics: 9 మంది టీడీపీ అభ్యర్థులు సిద్ధం.. జనసేన సీట్లపై ఇంకా రాని స్పష్టత!

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలోఖరారు చేసిన టీడీపీ నాయకత్వం

  • జనసేన సీట్లపై ఇంకా రాని స్పష్టత

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను 9 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సీట్లలో బరిలోకి దిగే అభ్యర్థులపై ఆ పార్టీలో స్పష్టత వచ్చినట్లు సమాచారం. సామాజిక సమీకరణలు, విజయావకాశాలు, స్థానికంగా ఉన్న పట్టు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ పార్టీ నాయకత్వం వీరిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ఐదు సీట్లపై కసరత్తు నడుస్తోంది. గట్టి అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఆ పార్టీ సర్వేలు నిర్వహిస్తోంది. దీంతోపాటు కొన్నిచోట్ల కొత్త అభ్యర్థుల పేర్లు కూడా పరిశీలనకు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలు.. కర్నూలు, నంద్యాల ఉన్నాయి. వీటి పరిధిలోని 14 అసెంబ్లీ సీట్లలో కర్నూలు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, శ్రీశైలం, డోన్‌, పత్తికొండ, ఎమ్మిగనూరు సీట్లలో టీడీపీ నిలిపే అభ్యర్థులు దాదాపు ఖాయమయ్యారు.

ఇంకా నందికొట్కూరు (ఎస్సీ), కోడుమూరు(ఎస్సీ), ఆదోని, ఆలూరు, మంత్రాలయం సీట్లపై నిర్ణయం జరగాల్సి ఉంది. నందికొట్కూరులో జయరాజు, జయసింహ, కాకర్లవాడ వెంకట స్వామి పోటీలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కుటుంబానికి చెందిన కొప్పుల లావణ్య తాజాగా రేసులోకి వచ్చారు. ఆమె భర్త టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న పార్టీ నేత మాండ్ర శివానంద రెడ్డి ఇటీవల ఈ నియోజకవర్గానికి ఓ అభ్యర్థి పేరు బహిరంగంగా ప్రకటించారు. కానీ పార్టీ వర్గాలు మాత్రం అధిష్ఠానం కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదని అంటున్నాయి. ఇక్కడి సిటింగ్‌ ఎమ్మెల్యే ఆర్థర్‌కు వైసీపీ టికెట్‌ నిరాకరించింది. ఆయన టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోడుమూరులో కూడా ముగ్గురు రేసులో ఉన్నారు. ప్రస్తుత ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ కోట్ల వర్గానికి సన్నిహితుడు.

కొత్త ముఖాలు..!

విష్ణువర్ధన్‌రెడ్డి వర్గం నుంచి దస్తగిరితో కిరణ్మయి అనే మహిళా నేత కూడా ఈ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గంపైనా టీడీపీ నాయకత్వం తుది నిర్ణయానికి రాలేదు. ఆదోని సీటుకు ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ఉన్నారు. ఆయనతోపాటు పార్టీ నేతలు కృష్ణమ్మ, శ్రీకాంత్‌రెడ్డి, మధిర భాస్కరరెడ్డి కూడా ఆశిస్తున్నారు. అంతర్గత సర్వేల్లో మీనాక్షినాయుడి వైపే మొగ్గు కనిపిస్తున్నా.. ఇతర కోణాలను కూడా పరిశీలించేందుకు నాయకత్వం నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఆలూరుకు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆమె కుటుంబానికి డోన్‌లో అవకాశం ఇస్తుండడంతో ఇక్కడి రేసు నుంచి ఆమె వైదొలిగారు. పార్టీ నేతలు వీరభద్ర గౌడ్‌, వైకుంఠం జ్యోతి, వైకుంఠం మల్లికార్జున ఇక్కడ పరిశీలనలో ఉన్నారు. ఇక్కడి ఎంపికను ఆదోని అభ్యర్థి ఎంపిక ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. మంత్రాలయానికి ప్రస్తుతం తిక్కారెడ్డి ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయనతోపాటు మాధవరం రాఘవేంద్ర పేరు కూడా పరిశీలనలో ఉంది. సర్వే ఫలితాలను బట్టి ఇక్కడ నిర్ణయం జరుగుతుందని అంటున్నారు. డోన్‌ సీటును కోట్ల కుటుంబానికి ఇవ్వాలని టీడీపీ నాయకత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఈ స్థానాన్ని బీసీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించడంతో.. ప్రత్యామ్నాయంగా ఆ కుటుంబానికి డోన్‌ అసెంబ్లీ సీటు ఇస్తున్నారు.

ఎంపీ సీట్లకు పోటీ..

కర్నూలు, నంద్యాల ఎంపీ సీట్లలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కర్నూలుకు బీసీ నేతలు బస్తీ నాగరాజు, డాక్టర్‌ పార్థసారథి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ సిటింగ్‌ ఎంపీ సంజీవ్‌కుమార్‌ పేరును కొందరు స్థానిక టీడీపీ నేతలు ప్రతిపాదించారు. నంద్యాల ఎంపీ సీటుకు బైరెడ్డి శబరి, మాండ్ర శివానందరెడ్డి, కేవీ సుబ్బారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి జిల్లాలో జనసేన సీట్ల విషయంలో స్పష్టత రాలేదు. ఆళ్లగడ్డ, ఆదోని సీట్లు ఆశిస్తున్నా.. వారు అక్కడ అంత బలంగా లేరన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది. రెండు పార్టీల మధ్య చర్చలు పూర్తయితే ఈ విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Feb 02 , 2024 | 09:43 AM