Share News

భోగాపురంలో 70 ఎకరాలకు జవహర్‌ ఎసరు

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:47 AM

విశాఖ కేంద్రంగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి రూ.వందల కోట్ల విలువైన భూముల కబ్జాకు పాల్పడ్డారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు.

భోగాపురంలో 70 ఎకరాలకు జవహర్‌ ఎసరు

300 కోట్ల రూపాయల కుంభకోణం

జనసేన నేత మూర్తియాదవ్‌

విశాఖపట్నం, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్రంగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి రూ.వందల కోట్ల విలువైన భూముల కబ్జాకు పాల్పడ్డారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బసవపాలెంలో 70 ఎకరాల భూమికి జవహర్‌రెడ్డి ఎసరు పెట్టారని తెలిపారు. దీనిలో 50 ఎకరాలు డి.పట్టా కాగా మరో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఈ 70 ఎకరాల విలువ సుమారు రూ.300 కోట్లు ఉంటుందన్నారు. చంద్రబాబు హయాంలో 2018లో భోగాపురం మండలం బసవపాలెం సర్వే నంబరు 22 నుంచి 24, 79 నుంచి 83లో మొత్తం 70 ఎకరాలు మెగా ఫుడ్‌పార్కు ఏర్పాటుకు కేటాయించారన్నారు. దీనిలో 50 ఎకరాలు డి.పట్టా భూములు, మరో 20 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవిగా రెవెన్యూ అధికారులు గుర్తించి ఏపీఐఐసీకి బదలాయించారని తెలిపారు. ఈ 70 ఎకరాల్లో మెగా ఫుడ్‌పార్కు కోసం 2019 ఫిబ్రవరి 13 జీవో 139 జారీ చేశారన్నారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో ఫుడ్‌పార్కుకు ప్రోత్సాహం లేకపోవడంతో కంపెనీ ప్రారంభించలేని పరిస్థితి వచ్చిందన్నారు. డి.పట్టా భూములను రెగ్యులర్‌ చేయడానికి గత ఏడాది జూలైలో గవర్నర్‌ ఆర్డినెన్స్‌ జారీ చేశారని తెలిపారు. దీంతో జవహర్‌రెడ్డి, ఆయన బినామీ త్రిలోక్‌ విశాఖ, విజయనగరం జిల్లాల్లో డి.పట్టా భూముల కు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు జారీ చేయించుకున్నారని ఆరోపించారు. ఏపీఐఐసీ కేటాయించిన 70 ఎకరాలపై కన్నేసిన జవహర్‌రెడ్డి తన అధికారం ఉపయోగించుకుని పావులు కదిపారన్నారు. ఏపీఐఐసీ సేకరించిన భూమిలో 50 ఎకరా లకు సంబంధించి గత ఏడాది డిసెంబరు 18నే ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వానికి చెందిన 20 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు చేయించారని అన్నారు.

గుప్పిట్లో 70 ఎకరాలు

బసవపాలెంలో 70 ఎకరాలు జవహర్‌రెడ్డి గుప్పిట్లోనే ఉందని మూర్తి యాదవ్‌ ఆరోపించారు. ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్లు జారీ చేసిన వ్యవహారంలో విజయనగరం కలెక్టర్‌, ఆర్డీవో, భోగాపురం తహసీల్దారుపై చర్యలు తీసుకోవాలన్నా రు. జవహర్‌రెడ్డి భూముల కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Jun 12 , 2024 | 02:47 AM