Share News

Nara Lokesh: ఉత్తరాంధ్రను పందికొక్కుల్లా మెక్కుతున్నారు.. వైవీ, విజయసాయిరెడ్డిపై లోకేశ్‌ ఫైర్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:49 AM

ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పందికొక్కుల్లా మెక్కేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు.

Nara Lokesh: ఉత్తరాంధ్రను పందికొక్కుల్లా మెక్కుతున్నారు.. వైవీ, విజయసాయిరెడ్డిపై లోకేశ్‌ ఫైర్‌

ఉత్తరాంధ్రను పందికొక్కుల్లా మెక్కుతున్నారు!

జగన్‌ ప్రభుత్వం టీడీపీని వేధించేందుకు అన్ని శక్తులనూ వాడుకుంది. నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం సహా 22 కేసులు పెట్టారు.చేయని తప్పునకు చంద్రబాబును జైలుకు పంపారు. ఆయన్ను అరెస్టు చేసినప్పుడు రూ.3 వేల కోట్ల స్కిల్‌ కుంభకోణమని అన్నారు. తర్వాత రూ. 300 కోట్లన్నారు. ఇప్పుడు రూ.27 కోట్లు అంటున్నారు. ఆ చార్జిషీటు చూసి కోర్టు వారు ఛీ పో.. ఇది చార్జిషీటా అన్నారు.

- లోకేశ్‌

వైవీ, విజయసాయిరెడ్డిపై లోకేశ్‌ ఫైర్‌

ఈ ప్రాంతంలో విప్లవం మొదలైంది

జగన్‌ పని అయిపోయింది..

ఇక తాడేపల్లి కొంప గేట్లు బద్దలే

సీఎం కొత్త పథకం.. ఎమ్మెల్యేల బదిలీ

రూ.5,400 కోట్లు ఇసుకలోనే దోపిడీ

మద్యంపై అదనంగా జే-టాక్స్‌

ఐదేళ్లలో 45 వేల కోట్లు అక్రమార్జన

వంద సంక్షేమ పథకాలు రద్దు

రెండోరోజు ‘శంఖారావం’లో లోకేశ్‌

శ్రీకాకుళం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పందికొక్కుల్లా మెక్కేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. రెండు మాసాల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తోందని.. వారు తిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు. ‘శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా సోమవారం రెండో రోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో జరిగిన భారీ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘ఉత్తరాంధ్ర ఊపే వేరు. ఉత్తరాంధ్ర అంటేనే విప్లవం. ఇప్పుడు ఆ విప్లవం మొదలైంది’ అని తెలిపారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికిన వారి ఆచూకీ ఇప్పటివరకు లేదని.. టీడీపీ వస్తే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వంశధార, తోటపల్లితో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. ‘తాడేపల్లి కొంప గేట్లు బద్దలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సిక్కోలులో ఈరోజు అందరూ సింహాల్లా కనిపిస్తున్నారు. అరసవల్లి సూర్యదేవాలయం ఉన్న పుణ్యభూమి ఇది’ అని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే..

ఏదీ హోదా..?

జగన్‌రెడ్డి పని అయిపోయింది. ఈ మాట వారి సొంత పార్టీ ఎంపీలే చెబుతున్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు. కానీ ప్రధానిని ఏనాడైనా అడిగారా? 31 మంది ఎంపీలను (లోక్‌సభ, రాజ్యసభ) ఇస్తే కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టారు. సొంత పార్టీ ఎంపీలే ‘బైబై జగన్‌’ అనేస్తున్నారు. అధికారంలోకి వస్తే వారంలోగా సీపీఎస్‌ రద్దు చేస్తానని జగన్‌ మాటిచ్చాడు. నాలుగేళ్ల పది మాసాలైంది. ఉద్యోగులు కూడా వైసీపీకి బైబై అనేస్తున్నారు. జగన్‌రెడ్డి ఇటీవలే కొత్త స్కీం తీసుకొచ్చాడు. అదే ఎమ్మెల్యేల బదిలీ పథకం. మన ఇంటి చెత్త పక్కన ఇంట్లో వేస్తే బంగారం అవుతుందా? పక్క నియోజకవర్గంలో చెల్లని వైసీపీ ఎమ్మెల్యే మన నియోజకవర్గంలో చెల్లుతారా? సొంత ఎమ్మెల్యేలే వైసీపీని వీడి పారిపోతున్నారు.

అన్నం తినడం మానేసి..

ఇసుక టీడీపీ పాలనలో ఉచితంగా ఉస్తే.. ఇప్పుడు ట్రాక్టర్‌ రూ.5వేలకు పెంచేశారు. జగన్‌ అన్నం తినడం మానేసి ఇసుకను తినడమే పనిగా పెట్టుకున్నారు. రోజుకు రూ.3 కోట్లు, ఏడాదికి రూ.1,080 కోట్లు, ఐదేళ్లలో రూ.5,400 కోట్లు దోచేస్తున్నారు. మరో రెండు మాసాలు ఓపికపట్టండి. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక ఇసుక ధరలు తగ్గిస్తాం. జగన్‌రెడ్డి కటింగ్‌, ఫిట్టింగ్‌ మాస్టర్‌. రూ.10 ఇచ్చేందుకు బ్లూబటన్‌ నొక్కి.. ఆ తర్వాత ఎర్ర బటన్‌ నొక్కి రూ.100 చొప్పున ప్రజల నుంచి కాజేస్తున్నాడు. మద్యం క్వార్టర్‌ బాటిల్‌పై రూ.25 జే ట్యాక్స్‌ కట్టించుకుంటున్నాడు. ఇది నేరుగా జగన్‌ జేబులోకే వెళ్తోంది. మద్యం ద్వారానే ఏడాదికి రూ.9 వేల కోట్ల చొప్పున ఐదేళ్ల కాలంలో రూ.45 వేల కోట్లు దోచుకున్నాడు. జగన్‌ గొప్ప కటింగ్‌ మాస్టర్‌ కూడా. అన్న క్యాంటీన్లు, ప్రమాద బీమా కట్‌.. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ కట్‌.. 6 లక్షల మందికి పింఛన్‌ కట్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌ కట్‌.. ఇలా వంద సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసేశాడు.

చర్చకు సిద్ధమా?

మైడియర్‌ జగన్‌.. నువ్వే టైం చెప్పి, డేట్‌ ఫిక్స్‌ చేయి. మీ అవినీతిపై, మాపై ఆరోపణలపై చర్చకు సిద్ధం.. నువ్వు సిద్ధమా? చట్టాలను ఉల్లంఘించినవారి పేర్లను రెడ్‌బుక్‌లో రాశాం. దీనికి డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. దీనిపై కేసు కూడా పెట్టారు. మా తాత, మా నాన్నలా మంచిపేరు వస్తుందో లేదో నాకు తెలియదు. చెడ్డపేరైతే తీసుకురాను. వైసీపీకి వలంటీర్లు ఉంటే టీడీపీకి 60 లక్షల మంది కార్యకర్తలున్నారు. టీడీపీ ఆఫీసు చుట్టూ కాదు.. ప్రజల చుట్టూ తిరిగితే నేను స్వయంగా వచ్చి నామినేటెడ్‌ పోస్టులు ఇస్తా. రూ.5 కోసం వైసీపీ పేటీఎం బ్యాచ్‌ సోషల్‌మీడియా ద్వారా ఎంతటి దారుణాలకైనా తెగబడుతోంది. టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఆపేస్తారని వలంటీర్ల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఆపేది లేదు. ఆ తప్పుడు ప్రచారం నమ్మవద్దు.

పిన్ని తాళిబొట్టు తెంపింది..?

బాబాయిని చంపింది ఎవరు..? పిన్ని తాళి బొట్టు తెంపింది ఎవరో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. వివేకానందరెడ్డిని హత్య చేయించింది జగన్‌రెడ్డే. జగనాసుర రక్త చరిత్ర. మనపై నింద వేశారు. ఈ కేసులో అవినాశ్‌రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. రేపోమాపో జగన్‌ కూడా ఏ-1గా చేరుతున్నారు. ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడి మనపై నెట్టారు. ఆర్మీలో సిక్కోలు వాసులు పెద్ద ఎత్తున ఉంటారు. నేను ఢిల్లీ వెళ్తే అక్కడ బాడీగార్డులంతా సిక్కోలు వాసులే. తాము రిటైరయ్యాక తమ కోసం శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వారు కోరారు. వారు కోరినట్లే చేస్తాం.

తమ్మినేని, అప్పలరాజు పోటీ

అవినీతిలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి అప్పలరాజు పోటీపడుతున్నారు. టీడీపీ హయాంలో ఆమదాలవలస నియోజకవర్గాన్ని రూ.1,600 కోట్లతో అభివృద్ధి చేశాం. ఆ తర్వాత డమ్మాబుస్సు (తమ్మినేని)ని ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈయన ఈ ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు సంపాదించుకున్నాడు. కొడుకు పెళ్లి కోసం రూ.1.3 కోట్లు వసూలు చేశాడు. ఇసుకలో రూ.300 కోట్లు దోచుకున్నాడు. వలంటీర్‌, అంగన్వాడీ, షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు డబ్బులు ఇచ్చినవారికే అమ్ముకున్నాడు. మైన్స్‌ పేరిట వందల ఎకరాలను కొడుకు పేరుపై రాయించుకున్నాడు. టీడీపీ వచ్చాక విచారణ వేసి ప్రజలకు అప్పగిస్తాం. తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్‌ అని తమ్మినేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి అదే ఎన్టీఆర్‌ కుమార్తెను అసెంబ్లీలో అవమానిస్తే నువ్వు చేసిందేంటీ..? మంత్రి ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదా్‌సల ఇంటి పేరులోనే ధర్మం ఉంది. వారి చేసేవన్నీ అధర్మ పనులే.

ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్‌. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడుతున్నాడు. ఈ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. తాను మాత్రం రూ.500 కోట్లతో విశాఖలో ప్యాలెస్‌ కట్టుకున్నాడు. రైల్వే జోన్‌కు అవసరమైన భూమి కూడా ఇవ్వలేదు. టీడీపీ అధికారంలోకి వస్తే స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కానివ్వం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి కాపాడతాం.

Updated Date - Feb 13 , 2024 | 07:33 AM