Share News

ఆదర్శ పాఠశాలల్లో అక్రమ వసూళ్లు!

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:14 AM

ఆదర్శం పేరుతో నడుస్తున్న మోడల్‌ స్కూళ్లలో వసూళ్ల పర్వం మొదలైంది. గత అక్టోబరులో పదోన్నతుల పేరుతో వసూళ్లకు పాల్పడిన అక్రమార్కులు..

ఆదర్శ పాఠశాలల్లో అక్రమ వసూళ్లు!

సీనియారిటీని పక్కనపెట్టి పదోన్నతులు

కోర్టుకు వెళ్లకుండా ఓ అధికారి ఒత్తిడి

తాజాగా 010 పేరుతో మరోసారి దందా

కార్యదర్శి మార్పు నుంచే విమర్శలు

అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆదర్శం పేరుతో నడుస్తున్న మోడల్‌ స్కూళ్లలో వసూళ్ల పర్వం మొదలైంది. గత అక్టోబరులో పదోన్నతుల పేరుతో వసూళ్లకు పాల్పడిన అక్రమార్కులు.. ఇప్పుడు 010 పద్దుతో జీతాలు ఇప్పిస్తామంటూ మరోసారి టీచర్ల నుంచి వసూళ్లు మొదలుపెట్టారు. ఏడాది కిందటి వరకూ మోడల్‌ స్కూల్స్‌ సొసైటీ ఎలాంటి ఆరోపణలు లేకుండా సక్రమంగానే సాగింది. సొసైటీ కార్యదర్శి మార్పు నుంచి అనేక ఆరోపణలు, విమర్శలకు సొసైటీ కేంద్రంగా మారింది. అయితే వాటిని నియంత్రించాల్సిన కీలక అధికారే ఈ తరహా వ్యవహారాలను ప్రోత్సహిస్తున్నారంటూ టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 164 మోడల్‌ స్కూళ్లలో 2200 మంది టీచర్లు పనిచేస్తున్నారు. గతేడాది అక్టోబరులో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ)లకు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ)లుగా, పీజీటీలకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు కల్పించారు. అయితే సీనియారిటీ జాబితా ప్రకారం 2013లో చేరిన వారి కంటే 2015లో తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే విషయంపై అప్పట్లో బాధిత టీచర్లు కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేయగా ఓ కీలకాధికారి వారిని బెదిరించారు. అప్పట్లో 161 మంది టీజీటీలకు పీజీటీలుగా పదోన్నతి కల్పించారు. మరో 81 మందికి పదోన్నతి కల్పించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పీజీటీలను చూపించి పదోన్నతులు నిలిపివేశారు. రెగ్యులర్‌ టీచర్లకు పదోన్నతులు ఇచ్చేటప్పుడు కాంట్రాక్టు టీచర్లు అడ్డు కాకపోయినా కావాలనే అన్యాయం చేశారని టీచర్లు గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ కీలకాధికారికి రూ.10లక్షల మేర ముడుపులు అందినట్లు టీచర్లలో బహిరంగంగానే ప్రచారం సాగుతోంది. ఇక తాజాగా 010 పద్దు కింద జీతాలు ఇప్పిస్తామంటూ ఒక్కో టీచర్‌ నుంచి రూ.10వేల నుంచి రూ.15వేల వరకూ మళ్లీ వసూళ్లకు దిగారు. రాష్ట్ర సచివాలయంలో అధికారులను మేనేజ్‌ చేయాలని, అందుకు రూ.కోటి ఖర్చవుతుందంటూ కొందరు నేతలు ఈ వసూళ్లను ప్రారంభించారు. కీలకమైన అధికారే వారి వెనుక ఉండటంతో టీచర్లు కూడా అడిగిన మేరకు గత్యంతరంలేక సమర్పించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటివరకూ వసూళ్లు చేయగా, మిగిలిన జిల్లాల్లో ఇప్పుడు మొదలుపెడుతున్నారు. ప్రతి స్కూలుకు వెళ్లి 010 కింద జీతాలు రావాలంటే కచ్చితంగా ముడుపులు ఇచ్చుకోక తప్పదంటూ బలవంతంగా వసూళ్లకు దిగుతున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 06:39 AM