అక్రమ వసూళ్లు
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:12 PM
కేంద్ర ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ ఆత్మకూరు కార్యాలయంలో వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు.
బీఎ్‌సఎనఎల్ ఆఫీసులో దోపిడీ..!
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ చేతివాటం
పట్టించుకునే నాఽథుడే కరువు
ఆత్మకూరు, సెప్టెంబరు 15: కేంద్ర ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ ఆత్మకూరు కార్యాలయంలో వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. అడిగే వారు ఎవరూ లేరనుకున్నారో ఏమో తెలియదు కానీ.. సంస్థ ద్వారా వినియోగదారులకు అందించే అన్ని రకాల సేవల్లో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అయితే వినియోగదారులకు జరుగుతున్న అన్యాయాన్ని కార్యాలయంలో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అసలు కార్యాలయంలో సంబంధిత అఽధికారులెవరూ అక్కడ అసలు కనిపించరు. పైగా జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చిన తనిఖీలు చేసిన సందర్భాలు లేవని తెలుస్తోంది. దీంతో ఇదే అదునుగా బీఎస్‌ఎనఎల్ ఆఫీసులో జరుగుతున్న దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.
ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ అక్రమ వసూళ్లు :
కొంత కాలంగా బీఎ్‌సఎనఎల్ ఆఫీసుల్లోనే ఆధార్ కార్డుల్లో పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను అప్‌డేట్ చేసుకోవడంతోపాటు ఆధార్ కార్డుకు ఫోన నంబర్ లింకేజీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈసేవలకు రుసుము రూ.50 వసూళ్లు చేయాల్సి ఉండగా రూ.100కు పైగానే వసూలు చేస్తున్నారు. పైగా ఆధార్ కార్డులో ఒకే సందర్భంలో అన్ని వివరాలను మార్చుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఒక్కొక్కటి ఒక్కో సందర్భంలో మార్చి దండుకుంటున్నారు. దీనికితోడు ఇటీవల కాలంగా దేశంలోని ప్రైవేట్ రంగ టెలికమ్యూనికేషన సంస్థలు యూజర్ చార్జీలను భారీగా పెంచడంతో చాలా మంది ప్రైవేట్ టెలికమ్యూనికేషన్ల యూజర్లు బీఎ్‌సఎనఎల్‌లోకి తమ సిమ్ కార్డులను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో సిమ్ కార్డు పోర్టు అయ్యేందుకు రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. ఇవేకాకుండా 4జీ సిమ్ పొందేందుకు బీఎ్‌సఎనఎల్ ఉచిత సర్వీసును అందుబాటులో ఉంచారు. అయితే 4జీ సిమ్‌కార్డు ఇచ్చేందుకు కూడా చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా బీఎ్‌సఎనఎల్ కార్యాలయం ద్వారా అందే అన్ని సర్వీసులను అదనంగా వసూలు చేస్తున్నప్పటికీ రశీదులు మాత్రం ఇవ్వడం లేదు. అలాగే ఆయా సర్వీసుకు ఎంత చార్జీ అవుతుందన్న వివరాలతో కూడిన పట్టిక కూడా అక్కడ అమర్చలేదు.
పత్తాలేని బీఎ్‌సఎనఎల్ అధికారులు :
ఆత్మకూరు బీఎ్‌సఎనఎల్ కార్యాలయ అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉండరన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ జేటీఓ స్థాయి అధికారి ఉంటారని చెబుతున్నప్పటికీ ఆయన కార్యాలయంలో ఎక్కువ సమయం గడపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మిగతా ఉద్యోగులు కూడా కాసేపు అలా కార్యాలయానికి వచ్చి ఆ తర్వాత తమ సొంత పనులు చేసుకునేందుకు బయటకు వెళ్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే దేశంలో బీఎ్‌సఎనఎల్ సేవల పట్ల వినియోగదారులు ఆకర్షితులవుతుంటే సంస్థ అభివృద్ధికి కృషి చేయాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ప్రతినెలా తీసుకునే జీతానికి తగ్గట్లుగా ఉద్యోగులు విధులు నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
నెలకు రూ.లక్షల్లో వసూళ్లు :
ఇటీవల కాలంలో బ్యాంకు ఖాతాలకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డుకు ఫోన నంబర్ లింకేజీ అవసరం కానుంది. అలాగే ఆధార్ కార్డుల్లో నమోదైన పొరపాట్లను సరిచేసుకుంటుంటారు. ఈ అవసరాలతోపాటు బీఎ్‌సఎనఎల్ టెలికామ్ సేవల కోసం ప్రతిరోజూ ఆత్మకూరులోని బీఎ్‌సఎనఎల్ ఆఫీసుకు చాలా మంది వినియోగదారులు వస్తుంటారు. అయితే ఒక్కొక్కరి నుంచి రూ.50, రూ.100 తదితర అదనపు రుసుముల పేరిట చేతివాటం ప్రదర్శించడంతో సదరు అనధికార వ్యక్తులకు ప్రతిరోజూ వేల రూపాయాల్లో అక్రమార్జన సమకూరుతోందన్న విమర్శలు ఉన్నాయి.
ధరల పట్టికను ఏర్పాటు చేస్తాం
- నారాయణస్వామి, డీఈ, బీఎ్‌సఎనఎల్ ఆఫీసు, ఆత్మకూరు :
కార్యాలయ పరిధిలో ఆయా సేవలకు సంబంధించిన రుసుముల పట్టికను అందుబాటులో ఉంచుతాం. అలాగే సమాచారం హక్కు చట్టం - 2005 ప్రకారం కార్యాలయ సమాచారం, అఽధీకృత అధికారి వివరాలను పొందుపరుస్తాం అదేవిధంగా పొందిన సేవలకు సంబంధించిన రుసుములకు రశీదులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. వినియోగదారులెవరూ నిర్ణయించిన రుసుము కంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.