Share News

గిట్టకపోతే వేటేయడమే!

ABN , Publish Date - May 19 , 2024 | 03:24 AM

వ్యక్తులను బట్టి రూల్స్‌ మారిపోతుంటాయి. అతను మనవాడైతే సమర్థించడానికి ఒక రూల్‌ ఉంటుంది. అదే తస్మదీయుడు అయితే వ్యతిరేకించడానికి మరో రూల్‌ ఉంటుంది.

గిట్టకపోతే వేటేయడమే!

ఎన్నికల హింసపై చర్యల్లో ఆశ్రిత పక్షపాతం

అస్మదీయులకు రక్షణ కవచంలా సీఎస్‌ తీరు

ఎన్నికల అనంతరం హింస ఘటనల్లో తేటతెల్లం

పల్నాడు కలెక్టర్‌ శివకుమార్‌ బదిలీకి సిఫారసు

తిరుపతి, అనంత కలెక్టర్లను కదిలించని సర్కారు

బాధ్యులపై చర్యల్లో పారదర్శకత లేదని విమర్శలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వ్యక్తులను బట్టి రూల్స్‌ మారిపోతుంటాయి. అతను మనవాడైతే సమర్థించడానికి ఒక రూల్‌ ఉంటుంది. అదే తస్మదీయుడు అయితే వ్యతిరేకించడానికి మరో రూల్‌ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అదే రూల్‌ ఆఫ్‌ లా అమలవుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి పర్యవేక్షణలో సొంతవారికి పిలిచి పెద్దపీట వేస్తున్నారు. వారు తప్పుచేసినా చూసీచూడనట్లు వదిలేస్తూ మేం ఉన్నామనే భరోసా ఇస్తున్నారు. తస్మదీయులైతే చాలు... కారణం లేకపోయినా వేటు వేస్తున్నారు. సంబంధం లేని కారణాలు చూపి బదిలీ, సస్పెండ్‌ చేస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు, సస్పెన్షన్లే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం తిరుపతి, అనంతపురం, పల్నాడు, నంద్యాల జిల్లాలో హింస చెలరేగింది. దాడులు, ప్రతిదాడుల నుంచి హత్యాయత్నాల వరకు తెగబడ్డారు. ఈ పరిణామాలపై పల్నాడు ఎస్పీ బిందు మాధవ్‌, అనంతపురం ఎస్పీ అమిత్‌ బర్దార్‌ను సస్పెండ్‌ చేశారు. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌, పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ తిరుపతి, అనంతపురం కలెక్టర్లను మాత్రం కదిలించలేదు. పల్నాడు స్థాయిలో తిరుపతిలోనూ పెద్దఎత్తున గొడవలు జరిగినా అక్కడ ఎస్పీ బదిలీతో సరిపెట్టారు. ఈ చర్యలు సర్కారు పక్షపాత ధోరణిని బయటపెట్టాయి. డీజీపీ నివేదిక ఆధారంగా ఎస్పీలు, సీఎస్‌ నివేదిక ఆధారంగా కలెక్టర్లపై చర్యలు తీసుకున్నారు. అయితే, చర్యలకు సిఫారసు చేయడంలోనే తీవ్రమైన అశ్రితపక్షపాతం ప్రదర్శించినట్లుగా స్పష్టమవుతోంది.


అస్మదీయులు సేఫ్‌

ఎన్నికల తర్వాత పల్నాడులో రేగిన హింసను నియంత్రించేందుకు, శాంతిస్థాపనకు జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. అయినా, విధి నిర్వహణలో విఫలమయ్యారు కాబట్టి ఆయన్ను బదిలీ చేయాలని సీఎస్‌ సిఫారసు చేశారు. శివశంకర్‌ ముక్కుసూటి అధికారి. అధికార పార్టీ కొమ్ముకాసే జాబితాలో, సీఎస్‌ అస్మదీయుల జాబితాలో లేకపోవడంతో ఆయన్ను బదిలీ చేసేశారు. మరోవైపు తిరుపతి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు సీఎం జగన్‌, సీఎస్‌ ఆశీస్సులు దండిగా ఉన్నాయి. తిరుపతి వెళ్లడానికి ముందు ఆయన మిషన్‌ బిల్డ్‌ ఏపీ, ఏపీఐఐసీ, ఇతర కీలక విభాగాల్లో పనిచేశారు. ప్రభుత్వ భూములు తెగనమ్మడానికి జగన్‌ సర్కారు ఏర్పాటు చేసిన సంస్థే మిషన్‌ బిల్డ్‌ ఏపీ. చంద్రగిరి నియోజకవర్గం కూచినవారిపల్లి, రామిరెడ్డిపల్లి, తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలో హింస చెలరేగింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై మహిళా వర్సిటీ ప్రాంగణంలో సమ్మెట, ఇనుప రాడ్లు, బీరు సీసాలు, రాళ్లతో దాడిచేశారు. నాని గన్‌మన్‌పై కూడా సమ్మెటతో దాడిచేశారు. ఇదంతా హత్యాయత్నం కిందకే వస్తుంది. అయినా, ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులే పాల్గొన్నారని, కేవలం కర్రలే ఉపయోగించారని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఎన్నికల అనంతరం కూచినవారిపల్లికి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నిజాలు తెలుసుకునేందుకు వెళ్లారని, టీడీపీ వారు గొడవలు చేశారని నివేదికలో పేర్కొన్నారు. ఆయన నిజాలు దాచడం వైసీపీ పట్ల ఉన్న అమితమైన స్వామిభక్తిని చాటుకునేలా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే, తిరుపతిలో జరిగిన గొడవలను పరిశీలిస్తే పోలీసు, నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఆ జిల్లా ఎస్పీని బదిలీతో సరిపెట్టారు. అనంతపురం జిల్లాలో ఎన్నికలకు ముందు, తర్వాత రాజకీయ హింస చెలరేగడం ఖాయమని గత అనుభవాలు అనేకం ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో తాడిపత్రి నియోజకవర్గం ఉంది. అక్కడ భారీగా బలగాలను మోహరించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ ముందస్తు జాగ్రతలు తీసుకోవాల్సి ఉంది. కానీ, అవేమీ కనిపించ లేదు. వైసీపీ నేతలు పోలింగ్‌ రోజు తొలి గంట నుంచే కవ్వింపు చర్యలకు దిగారు. కలెక్టర్‌ కూడా ముందస్తు చర్యలు తీసుకునేలా పోలీసు శాఖకు దిశానిర్దేశం చేయాలి. కానీ ఆ దాఖలాలు లేవు. అయినా, ఎస్పీని సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం కలెక్టర్‌పై ఏ చర్యలూ తీసుకోలేదు. కనీసం ఆయన్ను బదిలీ కూడా చేయలేదు. అంటే, ఆయన కూడా సీఎస్‌ అస్మదీయుల జాబితాలో ఉన్నట్లేనని స్పష్టమవుతోంది.

సీఎస్‌.. మీరేం చేశారు?

ఎన్నికల అనంతరం హింస చెలరేగుతుందని డీజీపీతో పాటు సీఎ్‌సకు సమాచారం ఉంది. పోలింగ్‌ రోజే హింస చెలరేగింది. అదేరోజు పక్కా ప్రణాళికతో రాజకీయ హింసను అరికట్టడానికి చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది. మరి సీఎ్‌సగా జవహర్‌రెడ్డి ఏం చేశారు? జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఏం దిశానిర్దేశం చేశారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరిస్థితి అదుపులోకి రాకపోతే వెంటనే ఆ జిల్లా కలెక్టర్‌ను పిలిపించి మాట్లాడాలి. అవసరమైతే సీఎస్‌ సంబంధిత జిల్లాకు వెళ్లాలి. మరి జవహర్‌రెడ్డి ఈ పనులు చేశారా? మూడు జిల్లాల్లో హింసను నియంత్రించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎస్పీతో పాటు కలెక్టర్లనూ బాధ్యుల్ని చేయాలి. కానీ, ఆ విధానం ఒక పల్నాడుకే వర్తింపజేసి, మిగతా రెండు జిల్లాల్లో అమలు చేయకపోవడం సీఎస్‌ పరిపాలనా దక్షత లోని కొత్త కోణమా... అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకే సమస్యపై ఒక్కో జిల్లాలో ఒక్కోలా చర్యలు తీసుకోవడంపై అఖిల భారత సర్వీసు అధికారుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్‌ చేశారు. పల్నాడు కలెక్టర్‌ను మాత్రమే మార్చారు. అనంతపురం కలెక్టర్‌ను ఎందుకు మార్చలేదు? అక్కడ కలెక్టర్‌ వైఫల్యం సీఎ్‌సకు కనిపించలేదా? తిరుపతి ఎస్పీని ఎందుకు బదిలీతో వదిలేశారు? తిరుపతిలో జరిగిన హింస చిన్నదని సీఎస్‌ భావిస్తున్నారా? తిరుపతి కలెక్టర్‌ బాగా పనిచేశారని చెప్పదల్చుకున్నారా? పోలింగ్‌ అనంతరం జరిగిన హింస జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బాధ్యులైన అధికారులను గుర్తించడం, వారిపై చర్యలు తీసుకోవడంలో పారదర్శకత ఉండాలి. కానీ అందులోనూ అస్మదీయ సూత్రాన్ని పాటిస్తే ప్రజల దృష్టిలో చులకన అవుతాం’’ అని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.

Updated Date - May 19 , 2024 | 03:24 AM