Share News

‘బ్యాలెట్లు’ చెల్లకపోతే ఈసీ, ఆర్వోలదే బాధ్యత

ABN , Publish Date - May 29 , 2024 | 03:53 AM

పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత ఎన్నికల సంఘం, రిటర్నింగ్‌ అధికారులదేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక చైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ అన్నారు.

‘బ్యాలెట్లు’ చెల్లకపోతే ఈసీ, ఆర్వోలదే బాధ్యత

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక

అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత ఎన్నికల సంఘం, రిటర్నింగ్‌ అధికారులదేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక చైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల అధికారి సమక్షంలో ఓటు వేసే ఉద్యోగి.. పోస్టల్‌లో బ్యాలెట్‌ను పంపే ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంలో రికార్డు స్థాయిలో వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లను చెల్లుబాటయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం అధికారులు, ఆర్వోలదేనని స్పష్టం చేశారు. ఫెసిలిటేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసి ఓటు హక్కును వినియోగించుకునే లా చేస్తూనే పోస్టల్‌ బ్యాలెట్‌లో తతగమంతా మళ్లీ ఉద్యోగులతో చేయించడం, ఈ క్రమంలో గెజిటెడ్‌ అధికారులను నియమించుకోవడం, కొంత మంది గెజిటెడ్‌ అధికారులు వారి స్టాంపును వేయకపోవడం కొంత మంది సంతకం చేయకపోవడం ద్వారా చెల్లుబాటు కానీ ఓట్లకు ఈసీదే బాధ్యత అని పేర్కొన్నారు. ఏ ఒక్క ఉద్యోగి తమ ఓటును ఇంటి దగ్గర నుంచిగానీ, పోస్టల్‌లోగానీ వేయలేదని.. నేరుగా ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోనే వేసినందున.. సీరియల్‌ నంబరు, సంతకం, ఇతర సాంకేతిక పరమైన విషయాలన్నీ పూర్తి చేయించాల్సిన బాధ్యత అక్కడున్న పీవో, ఇతర పోలింగ్‌ అధికారులదేనని తెలిపారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఓట్లు చెల్లుబాటు కాకపోవడం భావ్యం కాదని, ఇలాంటి ఓట్ల శాతం అధికంగా ఉంటే ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం విధిగా ప్రతి ఉద్యోగి బ్యాలెట్‌ ఓటు చెల్లుబాటయ్యేవిధంగా చూడాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - May 29 , 2024 | 08:13 AM