Share News

Dhanunjaya Reddy: ఐఏఎస్సా.. వైసీపీ బాసా?

ABN , Publish Date - Jan 09 , 2024 | 03:57 AM

సీఎంవో ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి ఐఏఎస్‌ అధికారి. కానీ, ఆయన ఇప్పుడు అంతకు మించి... అన్నట్టు వైసీపీ సేవలో తరిస్తున్నారని ఆ పార్టీ ముఖ్యనేతలే చెబుతున్నారు.

Dhanunjaya Reddy: ఐఏఎస్సా.. వైసీపీ బాసా?

  • అక్కడ సర్వం ధనుంజయరెడ్డే!

  • నేతలంతా ఆయనను కలవాల్సిందే

  • సర్వే ఆధారంగా అక్కడికక్కడే తీర్పు

  • తాడేపల్లిలో జగన్‌ దర్శనం కాదు

  • కలిసినవారికీ ‘అన్న’ వద్దకే వెళ్లాలని సూచన

  • ఇన్‌చార్జులపై జగన్‌ కసరత్తు ఉత్తుత్తిదే

  • వైసీపీ నేతల్లో గుసగుసలు .. అసహనం

(అమరావతి - ఆంధ్రజ్యోతి) : సీఎంవో ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి ఐఏఎస్‌ అధికారి. కానీ, ఆయన ఇప్పుడు అంతకు మించి... అన్నట్టు వైసీపీ సేవలో తరిస్తున్నారని ఆ పార్టీ ముఖ్యనేతలే చెబుతున్నారు. వైసీపీ సుప్రీంలా మారారని కూడా అంటున్నారు. నియోజకవర్గాల ఇన్‌చార్జీల నియామకం విషయంలో ఆయన సర్వం తానే అయి నడిపించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా.. ఉప ముఖ్యమంత్రి అయినా.. మంత్రి అయినా.. ధనుంజయరెడ్డిని కలవాల్సిందేనని పార్టీనేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైసీపీలో ధనుంజయరెడ్డి నిర్ణయమే ఫైనల్‌ అని మంత్రులూ.. మాజీ మంత్రులూ.. ముఖ్యనేతలూ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. పార్టీలో పంచాయతీలు సీఎం జగన్‌ను కలిస్తే పరిష్కరం అవుతాయనే గ్యారంటీ లేని పరిస్థితి. ఎవరైనా తన వద్దకు వచ్చినా.. ‘ధనుంజయరెడ్డి అన్నతో మాట్లాడా’లని నేతలకు జగనే సూచిస్తున్నారని సమాచారం. నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు ముందుగా ప్రాంతీయ సమన్వయకర్తలను కలుస్తున్నారు. ఆ తర్వాత సీఎంవోకు వెళ్తున్నారు. వారికి అక్కడ జగన్‌ దర్శనం దొరకడంలేదు. ధనుంజయరెడ్డిని కలసి, తనను నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగిస్తున్నారో లేదో తెలసుకుంటున్నారు. అప్పటికే సర్వే నివేదికలను ధనుంజయరెడ్డి దగ్గర ఉంచుకుంటారు. వాటి ఆధారంగా టికెట్‌ దక్కుతుందో లేదో అప్పటికప్పుడే ఆయన చెప్పేస్తారు. ఇక అదే ఫైనల్‌!

Dhanunjaya-Reddy.jpg

అంతా బిల్డప్పే!

నియోజకవర్గాల ఇన్‌చార్జిల విషయంలో జగన్‌ భారీ కసరత్తు చేస్తున్నారని నీలి,కూలి మీడియాలో గడచిన నెల రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. కానీ, అదంతా బిల్డప్పేనని సీఎంవోను సందర్శించిన నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ప్రముఖ నేతలతో సీఎం జగన్‌ ముఖాముఖీ సమావేశమవడం లేదు. ఎమ్మెల్యేలూ .. ఎంపీలపై సర్వే నివేదికలు ఏం చెప్పాయో ధనుంజయరెడ్డి క్షుణ్ణంగా వడబోస్తారు. వాటిని సుదీర్ఘంగా సమీక్షిస్తారు. ఎమ్మెల్యే పనితీరు బాగుందంటే..దానిని ముఖ్మమంత్రి జగన్‌కు చేరవేస్తారు. సర్వే నివేదిక బాగున్నప్పటికీ .. ప్రతిపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న అనుమానం ఉంటే ఆయా నేతలను ఆయన పరీక్షలకు గురిచేస్తారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు .. లోకేశ్‌ .. పవన్‌ కల్యాణ్‌పై దుర్భాషలాడితేనే సీటు అని తేల్చేస్తారు. గతంలో .. భూముల ఆక్రమణలపై అసహనంతో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన తాడేపల్లికి వచ్చారు. ఆయనను జగన్‌ కలుస్తారని అంతా భావించారు .కానీ .. ధనుంజయరెడ్డితో బాలినేని సమావేశమై .. బయటకు వచ్చేశారు. ఇదే మాజీ మంత్రి బాలినేనిలోని అసంతృప్తిని మరింత రాజేసిందని చెబుతారు.

YS Jagan Sad.jpg

సాయిరెడ్డి వద్ద తేలని టికెట్‌ పంచాయతీ

రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వద్ద నరసరావుపేట అసెంబ్లీ టికెట్‌ పంచాయతీ ఎటూతేలలేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ బ్రహ్మారెడ్డి సహా ఇతర నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ాడేపల్లి సీఎంవద్ద ఇటీవల బ్రహ్మారెడ్డి వర్గం నిరసనకూడా తెలిపింది. తనకు నరసరావుపేట టికెట్‌ను సీఎం ఖరారు చేశారని గోపిరెడ్డి ఇటీవల మీడియాకు వెల్లడించారు. తనపై అసంతృప్తులు సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు ఉంటాయంటూ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో.. నేతల మధ్య సయోధ్యను కుదిర్చేపనిలో ప్రాంతీయ సమన్వయకర్తలు ఉన్నారు. ఈ క్రమంలో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా గోపిరెడ్డిని ప్రకటించవద్దంటూ బ్రహ్మారెడ్డి వర్గం సోమవారం సాయిరెడ్డి సమక్షంలోనే డిమాండ్‌ చేసింది. గోపిరెడ్డిని నరసరావుపేట అభ్యర్థిగా సీఎం ప్రకటించారని విజయసాయి తెలిపారు. అయితే, తాము .. ఆయనకు మద్దతు ఇచ్చేదిలేదని బ్రహ్మారెడ్డి వర్గం తేల్చి చెప్పేసింది.

Updated Date - Jan 09 , 2024 | 09:38 AM