Share News

నేనొస్తేనే పింఛన్లు, పథకాలు

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:54 AM

మళ్లీ తాను ముఖ్యమంత్రి అయితేనే ఇంటింటికీ రేషన్‌, పింఛన్‌ వస్తాయని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయంటూ

నేనొస్తేనే పింఛన్లు, పథకాలు

అంతా ఏకమై నన్ను ఓడించాలని చూస్తున్నారు

జగన్‌ మాటల్లో బేలతనం...

పి.గన్నవరం, చోడవరం, పొన్నూరులో ప్రచార సభలు

అనకాపల్లి/చోడవరం, కాకినాడ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి)/పొన్నూరుటౌన్‌: మళ్లీ తాను ముఖ్యమంత్రి అయితేనే ఇంటింటికీ రేషన్‌, పింఛన్‌ వస్తాయని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయంటూ... ఓటమి భయాన్ని కప్పిపెట్టుకునేందు సీఎం జగన్‌ ప్రయత్నించారు. ఎన్నికల్లో అంతా కలిపి తనను ఓడించాలని చూస్తున్నారని, తానే మో పేదలను గెలిపించాలని చూస్తున్నానని గొప్పలు పోయారు. కూటమి నేతలు తమ ఫొటోలతో 2014 ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేశారని, కానీ...ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా చోడవరం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి. గన్నవరం, గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. సంక్షేమాన్ని అందించే ఫ్యాన్‌ ఎక్కడ ఉండాలి అని జగన్‌ పదేపదే అడిగినా పెద్దగా జనంలో స్పందన లేదు. ఎన్నికల్లో తానొక్కడినే ఒకవైపు ఉన్నానని, మరోవైపు కూటమిగా చంద్రబాబు, పవ న్‌, బీజేపీ, నోటా ఓట్లు కూడా రాని కాంగ్రెస్‌ ఉండి.. తనను ఓడించాలని చూస్తున్నారంటూ మొసలి కన్నీరు కార్చారు. సామాజిక పెన్షన్లు ఇంటికే రావాలన్నా, పథకాలు కొనసాగాలన్నా తాను మళ్లీ సీఎం అవాలని వేడుకున్నారు. ఇక పొన్నూరు సభలోనూ పాత పాటే పాడారు.

గుంటూరు ఎంపీ, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి వాడు, సౌమ్యుడు....మీ అందరికీ మంచి చేస్తాడు అంటూ జగన్‌ పరిచయం చేసిన తీరు వైసీపీ శ్రేణులనే ఒకింత ఆశ్చర్యపరిచింది. ఇక.. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలునాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఇద్దరూ మంచివాళ్లు, సౌమ్యులని వారిని గెలిపించాలని జగన్‌ కోరారు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాపాక వరప్రసాద్‌ సౌమ్యుడు, మంచివాడంటూ జగన్‌ మెచ్చుకోవడంపై జనం నవ్వుకున్నారు. జగన్‌ ఎన్నికల బహిరంగ సభలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మన ప్రియతమ నేత జగన్మోహన్‌రెడ్డి అని కాకుండా, ప్రియతమ నేత కాబోయే సీఎం శ్రీ నారా చంద్రబాబు అని అనడంతో వైసీపీ నేతలను దిమ్మెరపోయారు. ఆ వెంటనే సవరించుకుని.. జగన్మోహన్‌రెడ్డి అంటూ సరిగ్గా పలికారు.

అరగంట సభ.. ఐదుగంటలు నరకం

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో సీఎం ఎన్నికల ప్రచార సభలో పోలీసుల అతి ప్రజలను నరకయాతనకు గురిచేసింది. అంబాజీపేటకు వచ్చేదారిలో రహదారికి ఇరువైపులా దుకాణాలను మూసివేయించారు. సీఎం వచ్చే దారిలో ఎవరినీ అనుమతించలేదు. సభకు వచ్చిన వారికి భోజనాలు అరకొరగా ఉండడంతో ఆహార ప్యాకెట్ల కోసం జనం పోటీపడ్డారు. ఆటోలు మోటార్‌సైకిళ్లను కిలోమీటర్ల దూరంలో పోలీసులు నిలిపివేయడంతో మహిళలు కాలినడకతో సభా స్థలానికి చేరుకోవడానికి అగచాట్లు పడ్డారు.పొన్నూరులో అరగంట సభకు ఐదుగంటలపాటు జనం, ప్రయాణికులకు నరకం చూపించారు. 4.30 గంటలకు సభ వద్దకు చేరుకున్న జగన్మోహన్‌ రెడ్డి అరగంట మాత్రమే ప్రసంగించి వెళ్లిపోయారు. ఈ మాత్రం దానికి సోమవారం ఉదయం నుంచే సీఎం దిగే హెలిప్యాడ్‌ వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో దుకాణాలను తెరవనీయకుండా పోలీసులు మూయించి వేశారు. అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన రాకపోకలను ఐదు గంటల ముందుగా అడ్డుకున్నారు. 108 వాహనాన్ని సైతం వెళ్లకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అనకాపల్లి జిల్లాలో సీఎం వస్తున్నారని అన్ని దుకాణాలు మూసేయించిన పోలీసులు.. మద్యం దుకాణాల జోలికి మాత్రం పోకపోవడం గమనార్హం. ఉదయం 10.30 గంటలకు హెలీకాప్టర్‌లో జగన్‌ అనకాపల్లి జిల్లా చోడవరం శివారునున్న కొత్తూరులో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జగన్‌ సభ జరగడంతో సుమారు 4గంటల పాటు రెండు వైపుల నుంచి ఆర్టీసీ బస్సులు, ఇతరత్రా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Updated Date - Apr 30 , 2024 | 03:54 AM