Share News

జగన్‌ పాలనలో అన్నీ మోసాలే

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:52 AM

‘జగన్‌ పాలనలో అన్నీ మోసాలే.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు.

జగన్‌ పాలనలో అన్నీ మోసాలే

ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు

అమరావతిని కాస్తా భ్రమరావతిని చేశావు

చింతలపూడి పథకాన్ని ఎప్పుడో గాలికొదిలేశావు

ప్రతి ఏటా సంక్రాంతికి జాబ్‌ కేలెండర్‌ ఎక్కడ?

ఐదేళ్లుగా కోడి పందేలతోనే సరిపోయింది

సీఎం అయ్యాక ఒక్కరోజూ ప్రజల ముందుకు రాలేదు

సీఎం జగన్‌పై పీసీసీ చీఫ్‌ షర్మిల నిప్పులు

ఏలూరు/చింతలపూడి/దెందులూరు(ఆంధ్రజ్యోతి)/తిరువూరు, ఏప్రిల్‌ 26: ‘జగన్‌ పాలనలో అన్నీ మోసాలే.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు, ఏలూరు జిల్లా చింతలపూడి, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని గోపన్నపాలెం వద్ద జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. ‘మేనిఫెస్టో తనకు భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అన్నాడు. సీఎం అయిన తర్వాత ఒక్కసారి కూడా ప్రజల వద్దకు వచ్చిందే లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశాడు. కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. మనకు మాత్రం చేతిలో చిప్ప మిగిల్చాడు’ అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా సంక్రాంతికి జాబ్‌ కేలెండర్‌ ప్రకటిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌... ఐదేళ్లలో ప్రతి సంక్రాంతికి కోడి పందేలు వేయించడం మినహా ఒక్కసారి కూడా కేలెండర్‌ విడుదల చేయలేదని విమర్శించారు. ‘అమరావతిని భ్రమరావతి చేశారు. మూడు రాజధానులు అని మూడు ముక్కలాడారు. మెగా డీఎస్సీ అంటు దగా డీఎస్పీ ప్రకటించారు. ఎన్నికల ముందు నిద్రలేచి 6వేల టీచరు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇదంతా జరిగేదా..? చచ్చేదా?’ అంటూ షర్మిల దుయ్యబట్టారు.

వైఎస్సార్‌ వారసుడైతే ఇలానే చేస్తాడా?

‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ ఇక్కడకు వచ్చారు. చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చాడు. చింతలపూడి పథకం వైఎస్సార్‌ కల, ఆయన తనయుడిగా జగన్‌ ఏమీ చేయలేకపోయారు. ఈ ఐదేళ్లలో తట్టెడు మట్టి తీయలేదు. పోలవరం పూర్తి చేస్తానని జగన్‌ హామీ ఇచ్చాడు. చివరికి మనం కట్టేది కాదని చేతులేత్తేశాడు. వైఎస్సార్‌ వారసుడైతే ఇలానే చేస్తాడా?’ అని నిలదీశారు. ‘మద్యనిషేధం అన్న పెద్దమనిషి నాసిరకం మద్యం అమ్మకాలు జోరుగా సాగిస్తూ పేదల ప్రాణాలు హరిస్తున్నాడు. ఇందుకేనా వీరికి అధికారం ఇచ్చింది?’ అంటూ మండిపడ్డారు. గతఎన్నికల ముందు తిరువూరు వచ్చిన జగన్‌.. సాగర్‌ కాల్వ నుంచి నియోజకవర్గంలోని 300 చెరువులకు నీరు మళ్లించి ప్రతి చెరువును రిజర్వాయరు చేస్తానని, ఎ.కొండూరు మండలంలో ఫ్లోరైడ్‌ బాధితులు అధికంగా ఉన్నారని, కిడ్నీ బాధితులకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు రిజర్వాయర్‌ నిర్మిస్తానని ఇచ్చిన హామీని నిలుపుకున్నాడా అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో వ్యవసాయాన్ని దండుగలా మార్చేశారు. పామాయిల్‌ పంటకు గిట్టుబాటు ధర అన్నాడు. కాకుంటే నష్టపరిహారం ఇస్తానన్నాడు. 2019లో పంట తక్కువ ధరకే అమ్మితే పరిహారమిస్తానని రైతులను మోసం చేశాడు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏమైౖంది? రూ.4వేల కోట్లతో పంట నష్టపరిహారం నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్క ఏడాదైనా రైతులకు రూపాయి కేటాయించారా?’ అని విరుచుకుపడ్డారు. ‘ఈ సీఎం ఐదేళ్లు మొద్దునిద్ర పోయాడా, గాడిదలు కాశాడా? ఎన్నికలు వచ్చేసరికి సిద్ధం అంటూ ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెట్టేందుకొస్తున్నాడు’ అని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 27 , 2024 | 04:52 AM