Share News

కోడ్‌ కూయకనే కోట్లు హుష్‌!

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:47 AM

కోట్లు గుమ్మరించైనా ఓట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైన ఆ నేతకు ఊహించని షాక్‌ తగిలింది.

కోడ్‌ కూయకనే కోట్లు హుష్‌!

ప్రకాశంలో కీలక నేత లబోదిబో చేతిలో డబ్బులు పాయెనే!

ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో

ఓటర్లకు పంచేందుకు భారీగా డంప్‌

వైసీపీ నేత కళాశాలలో దాచిన

5 కోట్ల నగదు మాయం

ఎస్పీకి నోటిమాటగా ఫిర్యాదు!

కేసు నమోదు చేయకుండా

గుట్టుచప్పుడు కాకుండా విచారణ

ఆ పార్టీ నేతలపైనే అనుమానం

సింగరాయకొండ, మార్చి 23: కోట్లు గుమ్మరించైనా ఓట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైన ఆ నేతకు ఊహించని షాక్‌ తగిలింది. ఎన్నికల్లో పంపకాలకు దాచిపెట్టుకున్న రూ.5 కోట్ల మూట గల్లంతైపోయింది. దీంతో ఆ నాయకుడు లబోదిబోమంటున్నారు. పోయింది ‘దొంగ’ సొమ్ము కావడంతో బయటకు చెప్పుకోలేరు. పోలీసులకూ ఫిర్యాదు చేయలేరు. అయినప్పటికీ... ‘వెతికి పెట్టండి ప్లీజ్‌ అని పోలీసులను వేడుకున్నారు. అధికార పక్ష అభ్యర్థి కావడంతో పోలీసులూ ఆయనకు సహకరిస్తున్నారు. కేసు నమోదు చేయకుండా గుట్టుగా విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఒంగోలు లోక్‌సభ పరిధి తూర్పు ప్రాంత ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగుతున్న కీలక నేత భారీగా నగదు డంప్‌ చేశారు.

ఎన్నికల కోడ్‌ అమలులోకి రాకముందే డబ్బులు సమీకరించి పెట్టుకున్నారు. నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయం ఉన్న కీలక మండలంలోనే భారీగా నగదు దాచినట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని వైసీపీకి చెందిన వారి నివాసాల్లో ఉంచారు. అందులోభాగంగా వైఎస్సాఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర కీలక నేతకు చెందిన కళాశాలలో రూ.5కోట్లు దాచారు. ఆ డబ్బులు ఈ నెల 10న మాయమయ్యాయి. ఈ విషయం తెలియడంతో కంగుతిన్న అభ్యర్థి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. కోడ్‌ వచ్చిన రోజున ఎస్పీని వ్యక్తిగతంగా కలిసి నోటిమాటగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఖర్చుకోసం దాచిన నగదు కాబట్టి కేసు నమోదు చేయకుండా దర్యాప్తు చేయాలని కోరినట్లు సమాచారం. దీంతో ఎస్పీ దర్యాప్తు బాధ్యతలను ఆ ప్రాంత సీఐకి అప్పగించారు. ఆయన గోప్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. నగదు మాయమైనరోజు కళాశాలకు బయట వ్యక్తులు ఎవరు వచ్చారనే కోణంలో ఆరాతీశారు. నెల్లూరు జిల్లా వైసీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ముఖ్య అనుచరులు కొందరు 10న మేదరమెట్ల వద్ద నిర్వహించిన సిద్ధం సభకు వెళ్తూజాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ కళాశాలకు వచ్చినట్లు గుర్తించారు. వారు అక్కడే భోజనం చేసి కొంతసేపు గడిపిన అనంతరం బయల్దేరినట్లు నిర్ధారించుకున్నారు. ఫోన్ల సిగ్నల్స్‌ను పరిశీలించగా వారు సిద్ధం సభకు వెళ్లలేదని తేలింది. దీంతో వారిని అనుమానితులుగా భావించి ఇటీవల సీఐ తన స్టేషన్‌ఎస్‌ఐతో కలిసి నెల్లూరు వెళ్లి గోప్యంగా విచారించినట్లు సమాచారం. కొంతమంది స్థానిక వైసీపీ నాయకులను, అనుమానితులను సీఐ కార్యాలయానికి పిలిపించుకొని విచారిస్తున్నారు.

పోలీసులపై నేత ఒత్తిడి

కీలక నేతకు చెందిన రూ.5కోట్లు మాయమైన ఘటనపై కేసు నమోదు చేయకుండా పోలీసులు వ్యక్తిగతంగా దరాప్తు చేయడం విమర్శలకు తావిస్తోంది. కోడ్‌ అమలుపై దృష్టిసారించకుండా అభ్యర్థి వ్యక్తిగత సేవలో పోలీసు అధికారులు నిమగ్నమవడం ఆ శాఖలోని డొల్లతనాన్ని బహిర్గతం చేస్తోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కీలక నేత అక్రమంగా సంపాదించిన సొమ్ము కావడం, ఓటర్లకు పంచేందుకు దాచినందున ఆయన ఒత్తిడి మేరకు పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Mar 24 , 2024 | 03:47 AM