మళ్లీ తనిఖీల వేట!
ABN , Publish Date - Mar 13 , 2024 | 03:50 AM
పేరుకు మాత్రమే గ్రానైట్ ఫ్యాక్టరీలు, క్వారీలపై దాడులంటూ ఉత్తర్వులు....అంతా పారదర్శకం.. కక్షసాధింపులకు తావులేదంటూ ప్రభుత్వం ప్రగల్భాలు..
వందల్లో గ్రానైట్ ఫ్యాక్టరీలు, పదుల్లో క్వారీలు..
అయినా టీడీపీ మద్దతుదారులపైకే విజిలెన్స్
ఎమ్మెల్యే గొట్టిపాటి లక్ష్యంగా దాడులు ముమ్మరం
ఆయన బంధువు ఫ్యాక్టరీల్లో మళ్లీ సోదాలు
గత మూడు నెలల్లో ఇది మూడోసారి
యజమానులంతా తన వద్దకు
రావాలంటూ అద్దంకి వైసీపీ నేత హుకుం
బాపట్ల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి)/ మార్టూరు: పేరుకు మాత్రమే గ్రానైట్ ఫ్యాక్టరీలు, క్వారీలపై దాడులంటూ ఉత్తర్వులు....అంతా పారదర్శకం.. కక్షసాధింపులకు తావులేదంటూ ప్రభుత్వం ప్రగల్భాలు.. అయితే, ఇవన్నీ ఉత్తమాటలేనని తేలిపోయింది. టీడీపీ మద్దతుదారులను టార్గెట్ చేసి వారి ఆర్థికమూలాలపై గురిపెట్టి తనిఖీల వ్యూహానికి తెరతీశారు. టీడీపీ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ లక్ష్యంగా మళ్లీ తనిఖీల వేట మొదలుపెట్టారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి సెంటర్ వద్ద ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలో మంగళవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ ఫ్యాక్టరీ యజమాని రవికమార్ బంధువు కామేపల్లి లక్ష్మీప్రసాద్. గతంలో రెండుసార్లు ఆయన ఫ్యాక్టరీలపై దాడులు చేశారు. ఐటీని ఉసిగొల్పారు. ఈ క్రమంలో ఆయన దాదాపు రూ. 2.5కోట్ల వరకు ప్రభుత్వానికి జరిమానా కూడా కట్టారని తెలుస్తోంది. అధికారులు మంగళవారం చేసిన దాడులు కూడా ఆయనకు సంబంధించిన ఫ్యాక్టరీలపైనే నిర్వహించారు. తనిఖీల నేపథ్యంలో అక్కడకు చేరుకున్న ఆ యజమాని అన్నింటిని వదిలేసి తన వాటినే ఎందుకు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ప్రశ్నించగా, పైనుంచి వచ్చిన జాబితా ఆధారంగానే తాము దాడులు చేస్తున్నామని అధికారులు చెప్పడం గమనార్హం. ఈ తనిఖీల్లో కృష్ణాజిల్లా మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతా్‌పరెడ్డి, నెల్లూరు విజిలెన్స్ ఏడీ బాలాజీనాయడు నేతృత్వంలోని రెండు బృందాలు పాల్గొన్నాయి. 2గ్రానైట్ ఫ్యాక్టరీలు, 5క్వారీల్లో తనిఖీలు జరపడానికి వచ్చినట్టు లక్ష్మీప్రసాద్‌కు నోటీసు ఇచ్చారు. కామేపల్లి ఫ్యాక్టరీల్లో తనిఖీలు జరపడం గత 3నెలల్లో ఇది మూడోసారి.
ఆ ఐదుగురే లక్ష్యంగా..: వందల సంఖ్యలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలు, పదుల్లో ఉన్న క్వారీలను వదిలిపెట్టి, ఎంపిక చేసుకున్న ఐదుగురి లక్ష్యంగానే ఈ దాడులకు వైసీపీ పెద్దలు వ్యూహరచన చేశారని సమాచారం. బుధవారం మరో ఇద్దరు లక్ష్యంగా తన కక్షసాధింపును కొనసాగించనుందని తెలుస్తోంది. అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ లక్ష్యంగా ప్రభుత్వం అనేక రకాలుగా వేధింపులకు దిగిన సంగతి తెలిసిందే. వందల కోట్లు జరిమానాల రూపంలో చెల్లించాల్సి వచ్చినా ఎమ్మెల్యే పోరుబాట వీడలేదు. ఇప్పుడు ఆయన బంధువులు, అనుచరులపై కక్షసాధింపులకు దిగడం వేధింపులకు పరాకాష్ఠగా అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే రవికుమార్ లక్ష్యంగా గతంలో జరిగిన దాడులయితేనేమి, తాజాగా పర్చూరులో మరో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లక్ష్యంగా చేసిన వ్యవస్థల దుర్వినియోగమయితేనేమి, ప్రస్తుతం ఎమ్మెల్యే రవి బంధువుతో పాటు మరి కొంతమంది టీడీపీ మద్దతు దారులను లక్ష్యంగా చేసుకోవడమయితేనేమీ. తాడేపల్లి పెద్దలే కీలకంగా వ్యవహరిస్తున్నారనేది కాదనలేని సత్యం. ప్రభుత్వం ఓవైపు టీడీపీ సానుభూతిపరులే లక్ష్యంగా దాడులు చేస్తూ, మరోవైపు గ్రానైట్ యజమానులలో ఉన్న ఐక్యతను దెబ్బతీసే రాక్షస క్రీడకు పూనుకున్నది. తనను వేడుకుంటే తప్ప ఈ దాడుల పరంపర ఆగదని అద్దంకి వైసీపీ నేత హుకుం జారీ చేశారని తెలుస్తోంది. ఇంకోవైపు గ్రానైట్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం సీఎంవో బాట పట్టినట్లు సమాచారం.