Share News

కేజీబీవీ టీచర్లపై వేటేయండి

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:14 AM

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినిలపై జగన్‌ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సమ్మెకు దిగిన వారిని విధుల నుంచి తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకుంది.

కేజీబీవీ టీచర్లపై వేటేయండి

సమ్మెలో ఉంటే తొలగించాలని ఆదేశాలు

జగన్‌ ప్రభుత్వ సంచలన నిర్ణయం

ఉద్యోగాలకు ముప్పున్నా నేడు చలో విజయవాడ

అమరావతి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినిలపై జగన్‌ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సమ్మెకు దిగిన వారిని విధుల నుంచి తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసినట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. కేజీబీవీ టీచర్లను వెంటనే విధుల్లో చేరాలని సూచించాలని, చేరని వారిని పూర్తిగా విధుల నుంచి తొలగించాలని జిల్లాల అధికారులకు సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు అమలుచేస్తే ఒకేసారి దాదాపు వెయ్యి మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఒకట్రెండు రోజుల్లో తొలగింపు ఉత్తర్వులు జారీ చేసేందుకు జిల్లాల్లో అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా సమ్మె విరమించేది లేదని సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో శుక్రవారం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. విజయవాడలోని సమగ్రశిక్ష కార్యాలయాన్ని ముట్టడిస్తామని జేఏసీ చైర్మన్‌ కాంతారావు తెలిపారు. సమగ్రశిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, లేనిపక్షంలో మినిమం టైమ్‌ స్కేలయినా అమలుకు డిమాండ్‌ చేస్తూ సమగ్రశిక్ష ఉద్యోగులు డిసెంబరు 20 నుంచి సమ్మెలోకి వెళ్లారు. వారితోపాటు కేజీబీవీ టీచర్లు కూడా సమ్మెకు దిగారు. అయితే బోధనేతర సిబ్బందిని సీరియ్‌సగా తీసుకోని ప్రభుత్వం కేజీబీవీ టీచర్లపై మాత్రం బెదిరింపులకు దిగుతోంది. డిసెంబరు చివరి వారంలోనే వారికి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. అనధికారికంగా విధులకు దూరమైనందున వెంటనే వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో విధుల నుంచి తొలగిస్తామని స్పష్టంచేసింది.

వారిని తొలగించి కొత్తవారిని తీసుకోండి..

రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లో 4,594 మంది ప్రిన్సిపాళ్లు, టీచర్లు, పీఈటీలుగా పనిచేస్తున్నారు. వారిలో 1,555 మంది కొత్తగా భర్తీ అయ్యారు. అంతకముందు నుంచి పనిచేస్తున్న 3,039 మందిలో ప్రిన్సిపాళ్లు మినహా అందరూ సమ్మెకు దిగినట్లు ఉద్యోగ నాయకులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ ఒత్తిళ్లు, బెదిరింపులతో కొందరు ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరినట్లు తెలిసింది. ఇప్పటికీ సమ్మె కొనసాగిస్తున్న వారిని తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని సూచించారు. ఇటీవల ఉద్యోగాల భర్తీలో మెరిట్‌ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నవారిని విధుల్లోకి తీసుకోవాలని స్పష్టంచేశారు. కాగా, 2 నెలల్లో పబ్లిక్‌ పరీక్షలున్న సమయంలో కేజీబీవీ టీచర్లు సమ్మెకు దిగడం సరికాదని సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగుల జేఏసీ సమ్మెను కొనసాగిస్తుంటే కేజీబీవీ టీచర్ల సంఘం మాత్రం తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించింది. సమ్మె విరమిస్తే ఎంటీఎస్‌ అమలుచేస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని, దీంతో తాత్కాలికంగా విరమిస్తున్నామని సంఘం అధ్యక్షురాలు ఎస్‌బీటీఎస్‌ దేవి తెలిపారు.

Updated Date - Jan 05 , 2024 | 04:55 AM