విశాఖలో భారీగా నగదు పట్టివేత
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:09 AM
సరైన పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న రూ.52 లక్షల నగదు, రూ.31 లక్షల విలువైన 51 చెక్కులను విశాఖ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

52 లక్షల నగదు, రూ.31 లక్షల విలువైన చెక్కులు
విశాఖపట్నం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): సరైన పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న రూ.52 లక్షల నగదు, రూ.31 లక్షల విలువైన 51 చెక్కులను విశాఖ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై సూట్‌కే్‌సలో భారీగా నగదు తీసుకువెళుతున్నారంటూ ద్వారకానగర్ సీఐ రమేశ్‌కుమార్‌కు సమాచారం అందింది. దీంతో సీతంపేట వైపు నుంచి ద్వారకానగర్ వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని టైటాన్ షోరూమ్ వద్ద ఆపి తనిఖీ చేశారు. సూట్‌కేస్ తెరచి చూడగా రూ.51,99,800 నగదుతోపాటు రూ.31 లక్షలు విలువ కలిగిన 51 బ్యాంకు చెక్కులు లభ్యమయ్యాయి. ద్విచక్ర వాహనంపై ఉన్న శ్రీను, లక్ష్మణరావులను ప్రశ్నించగా... నగరంలోని ఒక ప్రైవేటు చిట్‌ఫండ్ కంపెనీ నుంచి బ్యాంకుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. అయితే వాటికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో కేసు నమోదుచేసి అర్బన్ తహసీల్దార్‌కు అప్పగించారు.