Share News

ఎన్నాళ్లీ నిరీక్షణ..?

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:38 PM

సాధారణ ఎన్నికలకు ఇంక కేవలం 51 రోజులు మాత్రమే గడువుంది. దీంతో ఇప్పటికే అధికార పార్టీ రెండు విడతల్లో జిల్లాలోని ఆరు ఆసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

ఎన్నాళ్లీ నిరీక్షణ..?

తేలని రాజంపేట, రైల్వేకోడూరు అభ్యర్థుల పంచాయితీ

రాజంపేట పార్లమెంటుదీ అదే తీరు

ఆందోళనలో తెలుగుతమ్ముళ్లు

జిల్లాలో ఇప్పటికే నాలుగు ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన తెలుగుదేశం పార్టీ రాజంపేట, రైల్వేకోడూరు స్థానాల విషయంలో ఎందుకనో.. ఆలస్యం చేస్తోంది. శుక్రవారం విడుదల చేసిన మూడవ జాబితాలోనూ.. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అదేవిధంగా రాజంపేట పార్లమెంటు అభ్యర్థి విషయంలోనూ.. అధిష్టానం దోబూచులాడుతోంది. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేయడంతో వారంతా ప్రచారంతో పాటు.. అన్ని రకాల కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా.. హడావుడిగా ఉన్నారు. ప్రతిపక్ష టీడీపీ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

(రాయచోటి-ఆంధ్రజ్యోతి): సాధారణ ఎన్నికలకు ఇంక కేవలం 51 రోజులు మాత్రమే గడువుంది. దీంతో ఇప్పటికే అధికార పార్టీ రెండు విడతల్లో జిల్లాలోని ఆరు ఆసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మదనపల్లె నిస్సార్‌ అహ్మద్‌, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, రాయచోటి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, రైల్వేకోడూరుకు కొరముట్ల శ్రీనివాసులు పేర్లను ఖరారు చేసింది. రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డినే బరిలో నిలిపింది. దీంతో అధికార పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంతో పాటు ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమంలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఎన్నికల సంఘం ఎంత గొంతు చించుకుని వద్దని చెప్తున్నా.. గ్రామ, వార్డు వలంటీర్లను ఎన్నికల విధుల్లో తిప్పుతూనే ఉన్నారు. ఇంటింటికీ పంపించి.. తమకే ఓటు వేయాలని వలంటీర్ల ద్వారా ఓటర్లపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఓటర్లకు కానుకలు కూడా పంపిణీ చేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అడ్డదారులు సైతం తొక్కుతున్నారు. అధికార పార్టీలో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రతిపక్షంలో మరోలా ఉంది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికి రెండు విడతల్లో తంబళ్లపల్లె దాసరి జయచంద్రారెడ్డి, మదనపల్లె షాజహాన్‌బాషా, పీలేరు కిశోర్‌కుమార్‌రెడ్డి, రాయచోటి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డిలను తమ అభ్యర్థులుగా బరిలో నిలిపింది. రాజంపేట, రైల్వేకోడూరు విషయంలో ఇంకా స్పష్టతకు రాలేదు.

ఇంకెప్పటికో.. స్పష్టత

తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలను ఎదుర్కొనబోతున్నాయి. జిల్లాలో రెండు పార్టీలకు టీడీపీ సీట్లను కేటాయించనుంది. దీంతో రాజంపేట, రైల్వేకోడూరులలో అభ్యర్థులను ప్రకటించడంలో తాత్సారం జరుగుతోంది.. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం రైల్వేకోడూరును జనసేనకు కేటాయించినట్లు సమాచారం. దీంతో ఇక్కడ అభ్యర్థిని ప్రకటించుకునే బాధ్యత జనసేనదే. అయితే రాజంపేట విషయంలోనే.. అనేక విషయాలు ప్రచారంలో ఉన్నాయి. టీడీపీ తరపున ఇక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రాజు, పోలిరెడ్డి సుబ్బారెడ్డి, మేడా విజయశేఖర్‌రెడ్డి, ఇంకా కొందరు, జనసేన తరపున గంటా నరహరి తదితరులు టికెట్టును ఆశిస్తున్నారు. అయితే కొత్తగా బీజేపీ కూడా ఈ రేసులో చేరినట్లు తెలుస్తోంది. రాజంపేట పార్లమెంటు పరిధిలో మదనపల్లె స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ప్రచారానికి తెరదించుతూ.. రెండవ జాబితాలో మదనపల్లె స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషాకు చంద్రబాబు కట్టబెట్టారు. ఈ పరిస్థితుల్లో రాజంపేట పార్లమెంటు పరిధిలో బీజేపీకి ఒక అసెంబ్లీ సీటును కేటాయించాలంటే.. కేవలం రాజంపేట మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ మాజీ ఎంపీ సాయిప్రతాప్‌ అల్లుడు సాయిలోకేశ్‌ టికెట్టును ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే.. రైల్వేకోడూరు, రాజంపేట స్థానాల్లో అభ్యర్థుల విషయం కొలిక్కి రాలేదు.

తేలని రాజంపేట పార్లమెంటు స్థానం

రాజంపేట పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఇలా ఉంటే.. రాజంపేట పార్లమెంటు స్థానంలో టికెట్టు విషయం కూడా ఇంకా అసృష్టంగానే ఉంది. 2022లో రాజంపేట పార్లమెంటు స్థానానికి గంటా నరహరి పేరును చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు. కలికిరిలో జరిగిన సమావేశంలో గంటా నరహరిని రాజంపేట పార్లమెంటు ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు. అయితే తర్వాత ఏమైందో..? ఏమో.. అతని స్థానంలో సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యం తెరమీదకు వచ్చారు. పార్లమెంటు పరిధిలోని పరిస్థితులను బట్టి చంద్రబాబు.. బాలసుబ్రమణ్యం అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపారు. విజయవాడకు పిలిపించుకుని మాట్లాడి.. టికెట్టుపైన హామీ ఇచ్చి.. ప్రచారం చేసుకోమని చెప్పారు. దీంతో బాలసుబ్రమణ్యం నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ.. పార్టీ ముఖ్యనాయకులను కలుస్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే.. కేంద్రంలోని బీజెపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పడింది. దీంతో రాజంపేట పార్లమెంటు స్థానానికి బీజేపీ తరపున మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెరమీదకు వచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీజెపీకి 6 పార్లమెంటు స్థానాలను కేటాయించారు. ఇందులో విజయనగరం, అరకు, రాజమండ్రి, అనకాపల్లి, తిరుపతి, నరసాపురం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి టికెట్టు విషయమై గట్టిగా పట్టుపట్టినట్లు ప్రచారంలో ఉంది. దీంతో శుక్రవారం ప్రకటించిన మూడవ విడతలో రాజంపేట పార్లమెంటు అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించలేదు. బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత.. ఒకటి రెండు రోజుల్లో ఈ స్థానంలో అభ్యర్థి విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:38 PM