Share News

ఎంతమంది వలంటీర్లు రాజీనామా చేశారు?

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:06 AM

వలంటీర్లు తమ జేబులో సొమ్ము ఏమీ లబ్ధిదారులకు ఇవ్వడం లేదు కదా? వారు చెప్పిన మాటలు విని ఓటు వేసేంత బలహీనంగా ఓటరు ఉన్నారా?

ఎంతమంది వలంటీర్లు రాజీనామా చేశారు?

ఆ వివరాలను సమర్పించండి.. ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన హైకోర్టు

అమరావతి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘‘వలంటీర్లు తమ జేబులో సొమ్ము ఏమీ లబ్ధిదారులకు ఇవ్వడం లేదు కదా? వారు చెప్పిన మాటలు విని ఓటు వేసేంత బలహీనంగా ఓటరు ఉన్నారా?’’ అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. రాజీనామాతో వలంటీరు, లబ్ధిదారుకు మధ్య ఉన్న అనుబంధం పోతుందని, అలాంటి వ్యక్తి మాట విని ఏ లబ్ధిదారుడు ఓటు వేస్తారని వ్యాఖ్యానించింది. పోలింగ్‌ బూత్‌కు వెళ్లే వరకు మాత్రమే ప్రభావితం చేయగలరుగానీ, ఒకసారి బూత్‌లోకి ప్రవేశించిన తరువాత తన విచక్షణ మేరకే ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకుంటారని గుర్తు చేసింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం సర్క్యులర్‌ జారీ చేశాక ఎంత మంది వలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారనేది పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో ఎన్నికలు ముగిసేవరకు గ్రామ-వార్డు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్‌, గ్రామ-వార్డు సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శికి సూచించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా, పిటిషనర్‌ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు.

‘‘వైసీపీకి గ్రామ-వార్డు వలంటీర్లు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే సర్క్యులర్‌ జారీ చేసింది. ఈసీ సర్క్యులర్‌ను అపహాస్యం చేస్తూ వలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 44వేల మంది వలంటీర్లు రాజీనామా చేశారు. వీరు వైసీపీకి అనుకూలంగా లక్షలమంది ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉంది. రాజీనామాల వెనుక కుట్రకోణం దాగి ఉంది. వలంటీర్లుగా ఉండి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తే వారిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. దీంతో వారు రాజీనామాలు చేసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. అధికరణ 324 మేరకు ఎన్నికల కమిషన్‌ తనకు ఉన్న విశేష అధికారాలను వినియోగించి వలంటీర్ల రాజీనామాలు ఆమోదించకుండా ప్రభుత్వానికి సూచించేలా ఆదేశించండి’’ అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ‘‘ఐఏఎస్‌ అధికారులు సైతం ఉద్యోగాలకు రాజీనామా చేసి తమకు ఇష్టమైన రాజకీయ పార్టీలలో చేరుతున్నారు. ఆ వెంటనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వలంటీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత వారిని ప్రభుత్వం నియంత్రించలేదు. పిటిషనర్‌ ఊహాజనిత ఆరోపణలు చేస్తున్నారు. వలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేసిన తరువాత ఓ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లు పిటిషనర్‌ ఎలాంటి ఉదంతాలనూ కోర్టు ముందు ఉంచలేదు’’ అని తెలిపారు.

Updated Date - Apr 24 , 2024 | 07:03 AM