Share News

ఎన్నాళ్లీ కడుపు‘కోత’!

ABN , Publish Date - May 27 , 2024 | 04:12 AM

రాష్ట్రంలో గత ఐదేళ్లల్లో సిజేరియన్ల సంఖ్య భారీగా(16.5 శాతం) పెరిగింది. 2019-20 నుంచి 2023-24 వరకు రాష్ట్రంలో 8,14,558 ప్రసవాలు జరిగాయి.

ఎన్నాళ్లీ కడుపు‘కోత’!

సిజేరియన్‌ వైపే ఆస్పత్రుల మొగ్గు

సాధారణ డెలివరీలు చేయని వైద్యులు

ఐదేళ్లలో 4.44 లక్షల మందికి సిజేరియన్‌.. గత ఏడాది 1.30 లక్షల మందికి

రాష్ట్రంలో 16.5ు పెరిగిన సిజేరియన్లు.. ప్రైవేటులో ప్యాకేజీల కోసం సర్జరీలు

ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలే లేక గర్భిణుల ఇక్కట్లు

పూర్వం ప్రసవం అంటే సాధారణ డెలివరీయే! ఆపరేషన్‌ అన్న మాటే ఉండేది కాదు! నవమాసాలూ నిండిన ప్రతి గర్భిణి సుఖ ప్రసవం కోసం తగిన జాగ్రత్తలు తీసుకునేవారు! క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్‌ చేసేవారు. కానీ వైద్యం వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్లిష్ట పరిస్థితుల్లో తప్ప సాధారణ ప్రసవమే తల్లీబిడ్డకు మేలన్న విషయాన్ని మరిచి గర్భిణులు ఆస్పత్రికి వెళ్లడమే తరువాయి కటింగ్‌ చేసేయడమే! ప్రభుత్వాసుపత్రా, ప్రయివేటు ఆస్పత్రా అన్న తేడా లేదు. సాధారణ డెలివరీకి ప్రయత్నం చేద్దాం... తల్లీబిడ్డకు ఇబ్బంది లేకుండా చూద్దామన్న ఆలోచనే చేయడంలేదు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 4.44 లక్షల మందికి సిజేరియన్‌ ఆపరేషన్లు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో గత ఐదేళ్లల్లో సిజేరియన్ల సంఖ్య భారీగా(16.5 శాతం) పెరిగింది. 2019-20 నుంచి 2023-24 వరకు రాష్ట్రంలో 8,14,558 ప్రసవాలు జరిగాయి. అందులో 4,44,194 మందికి సిజేరియన్లు చేసేశారు. ఇదంతా కేవలం ప్రభుత్వ లెక్కల్లో ఉన్న వివరాలు మాత్రమే. ప్రభుత్వ లెక్కల్లో లేనివి మరో 50 వేలు పైనే ఉంటాయని ఆరోగ్యశాఖ అధికారుల అంచనా. ఏటా ఆస్పత్రుల్లో సిజేరియన్ల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. 2019 - 20లో 34 వేల మంది గర్భిణులకు సాధారణ డెలివరీలు, 45 వేల మందికి సిజేరియన్‌ చేశారు. 2023 - 24లో 2.42 లక్షల మంది గర్భిణులు డెలివరీ అయితే అందులో దాదాపు 1.30 లక్షల మందికి సిజేరియన్‌ ప్రసవాలే! ప్రయివేటు ఆస్పత్రులకు అసలు సాధారణ డెలివరీల ఊసే పట్టడంలేదు. చివరికి ప్రభుత్వాసుపత్రులదీ అదేతీరు. ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్యాకేజీల కోసం సిజేరియన్లు చేసేస్తుంటే... ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రం సమయం లేక సిజేరియన్లు చేసేస్తున్నారు.

ఆరోగ్యశ్రీని పక్కదారి పట్టించి..

పేద కుటుంబాలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం గర్భిణులకు ఉచితంగా వైద్య అందించాలనే ఉద్దేశంతో ప్రసవాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఆరోగ్యశ్రీలో సాధారణ డెలివరీకి రూ.8 వేలు ప్యాకేజీ ఇస్తే, సిజేరియన్‌కు రూ.13 వేల ప్యాకేజీ ఇస్తుంది. సిజేరియన్‌ సమయం ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఈ ప్యాకేజీ ఇంకా పెరుగుతుంది. ప్రయివేటు ఆస్పత్రులకు ఇది వరంగా మారింది. గర్భిణులు డెలివరీకి ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యం.. సిజేరియన్‌ చేయడానికి సిద్ధంగా ఉంటారు. బంధువులు అడిగినా, సాధారణ డెలివరీ కష్టమనే చెప్పేస్తారు. ఇక ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. సరైన సౌకర్యాలు లేక, వైద్య సిబ్బంది అందుబాటులో లేక సిజేరియన్లు చేసేస్తున్నారు.


అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి) : ఐదేళ్లుగా పీహెచ్‌సీల్లో ఒక్క ప్రసవమూ చేయని సంబంధిత మెడికల్‌ ఆఫీసర్ల విషయంలో ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆరోగ్యశాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ హెచ్చరించారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. చాలా కాలంగా ఒక్క ప్రసవమూ చేయని పీహెచ్‌సీ వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని డీహెచ్‌ పద్మావతిని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో ప్రసవాల్ని పెంచేందుకు ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖాధికారులు దృష్టి పెట్టాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో జీరో ప్రసవాలు ఉండేందుకు వీల్లేదన్నారు. బీసీజీ టీబీ టీకాల విషయంలో వెనుకబడిన గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో సంబంధిత అధికారులు వీలైనంత త్వరగా పరిస్థితిని సరిదిద్దుకోవాలని చెప్పారు. ప్రచార సాధనాలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఏపీ సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాల్ని నిర్వహించి బీసీజీ టీబీ టీకా వేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అలానే మలేరియా, డెంగీ, చికున్‌గున్యా ప్రబల కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఈ కేసులు ఎక్కువ ఉన్న జిల్లాల డీఎంహెచ్‌వోలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మున్సిపల్‌ శాఖాధికారులతో డీఎంహెచ్‌వోలు సమన్వయం చేసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. రానున్న నాలుగు నెలలూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని చెప్పారు. యూపీహెచ్‌సీ (అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌) ల్లో డెంగీ కేసులు పెరగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ వెంకటేశ్వర్‌ సూచించారు.

సిజేరియన్‌ వల్ల సమస్యలు

గతంలో రాష్ట్రంలో సిజేరియన్ల శాతం తక్కువగా ఉండేది. ఇప్పుడు సాధారణ డెలివరీల కంటే సిజేరియన్‌ శాతం 16.5కు పెరిగింది. సిజేరియన్‌ వల్ల మహిళలకు భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. సాధారణ డెలివరీ అయిన మహిళల కంటే సిజేరియన్‌ చేయించుకున్న మహిళలు ఫిట్‌నెస్‌ పరంగా చాలా వీక్‌గా ఉంటారు. సిజేరియన్‌కు ముందు ఉన్నంతగా ఫిట్‌గా ఉండరు. సిజేరియన్‌ వల్ల అధిక రక్తనష్టం, ఇన్ఫెక్షన్‌ వల్ల అంటువ్యాధులు, యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌, రక్తం గడ్డకట్టడం, మత్తుమందు వల్ల దుష్ఫలితాలు, హెర్నియా వంటి అనేక సమస్యలు వచ్చే ప్రమాదముంది. దీనివల్ల భవిష్యత్తులో అనేకసార్లు శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి రావచ్చు. కాబట్టి మహిళలు కూడా వైద్యులు చెప్పిందే వినకుండా సాధారణ డెలివరీ కోసం ప్రయత్నం చేయమని అడగాలి. నిజంగానే క్లిష్టపరిస్థితి ఎదురైతే తల్లీబిడ్డ రక్షణ కోసం సిజేరియన్‌ తప్పనిసరి కావచ్చు. ప్రభుత్వం కూడా దీనిపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టి సిజేరియన్‌లను కట్టడి చేయాలి. కేవలం ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చినంత మాత్రనా సిజేరియన్లకు బ్రేక్‌లు పడే పరిస్థితి లేదు. అవసరం లేకపోయినా సిజేరియన్లు చేసే ఒకటి రెండు ఆస్పత్రులను సీజ్‌ చేస్తేనే దీనికి బ్రేక్‌ పడుతుందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యశాఖ సిజేరియన్లు ఎక్కువగా నిర్వహించే దాదాపు 141 ఆస్పత్రులకు నోటీసులు అయితే ఇచ్చింది. కానీ ఆయా ఆస్పత్రులపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటేనే ఫలితం ఉంటుంది.

Updated Date - May 27 , 2024 | 04:12 AM