జగన్, షర్మిల వైఎస్ కడుపున ఎలా పుట్టారు..!
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:26 AM
‘షర్మిల వ్యవహార శైలితో మొదటి నుంచి కష్టపడిన నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

కేంద్ర పార్టీ ఇచ్చిన నిధులను అట్టిపెట్టుకుంది
తెలంగాణ వారిని పక్కన పెట్టుకొని టికెట్లు అమ్ముకుంది
పీసీసీ అధ్యక్షురాలిపై సుంకర పద్మశ్రీ విమర్శలు
విజయవాడ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ‘షర్మిల వ్యవహార శైలితో మొదటి నుంచి కష్టపడిన నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్, షర్మిల వైఎస్ కడుపున ఎలా పుట్టారో తెలియడం లేదు’ అని పీసీసీ కార్వనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఘాటుగా విమర్శించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, టికెట్ ఆశించి భంగపడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన నేతలు గురువారం విజయవాడ ఆంధ్రరత్న భవనం ఆవరణలో నిరసనకు దిగారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నుంచి పీసీసీని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కన్నీటిపర్యంతమైన సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ, ‘షర్మిల పార్టీలో సొంత అజెండాను అమలు చేసింది. చివరి వరకు బీ ఫారాలు ఇవ్వకుండా తొక్కిపెట్టింది. కేంద్ర పార్టీ నుంచి వచ్చిన నిధులను షర్మిల తన వద్ద పెట్టుకున్నారు. ఆంధ్రలో ఓటు హక్కులేని తెలంగాణ వారిని వెంటబెట్టుకుని టికెట్లను షర్మిల అమ్ముకుంది’ అని ఆరోపించారు. ఈ నిరసనకు ధీటుగా విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహరావు కార్యాలయంలో పీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ, లీగల్ సెల్ నాయకుడు గురునాథం మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఏమైనా పొరపాట్లు జరిగినా, సమస్యలు ఉన్నా అంతర్గతంగా కూర్చుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి నిధులను సమకూర్చలేమని పీసీసీ ముందుగానే చెప్పిందని స్పష్టం చేశారు.