Share News

కిలో 408కి ఇవ్వలేనోళ్లు 328కి ఎలా ఇచ్చారు?

ABN , Publish Date - Oct 03 , 2024 | 03:57 AM

తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్లలో నిబంధనలు మార్చి వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

కిలో 408కి ఇవ్వలేనోళ్లు 328కి ఎలా ఇచ్చారు?

ఏఆర్‌ ఫుడ్స్‌ కాంట్రాక్టులో మతలబు ఏమిటి?

సుబ్బారెడ్డి, భూమనలో దొంగెవరు: ఆనం

నెల్లూరు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): తిరుమలకు నెయ్యి సరఫరా టెండర్లలో నిబంధనలు మార్చి వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. 2023 నవంబరులో నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొన్న ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ రూ.408కు కేజీ నెయ్యి సరఫరా చేయలేమని చెప్పిందన్నారు. అదే సంస్థ 4 నెలల తర్వాత ఈ ఏడాది మార్చిలో జరిగిన టెండర్లలో కేజీ నెయ్యి రూ.328కే సరఫరా చేస్తామని ముందుకొచ్చిందని, దీని వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. బుధవారం నెల్లూరులో ఆనం విలేకరులతో మాట్లాడారు. ‘తిరుపతి-శ్రీకాళహస్తి మధ్య ఉన్న వైష్ణవి మిల్క్‌ ప్రొడక్ట్స్‌ నుంచి ఒక ట్యాంకర్‌ (ఏపీ26టీసీ4779) నెయ్యితో జూలై 2న బయల్దేరి తమిళనాడులోని దుండిగల్‌కు వెళ్లింది. అక్కడి ఏఆర్‌ ఫుడ్స్‌కు చేరింది. ఇదే ట్యాంకర్‌ మళ్లీ అక్కడి నుంచి జూలై 4న బయల్దేరి తిరుమలకు వచ్చింది. అంటే ఏఆర్‌ ఫుడ్స్‌కు నెయ్యి సరఫరా చేస్తోంది వైష్ణవి మిల్క్‌ ప్రొడక్ట్స్‌. దీన్నిబట్టి ఏఆర్‌ ఫుడ్స్‌కు నెయ్యి సరఫరా చేసే స్థాయి లేదని అర్థమవుతోంది. మార్చిలో జరిగిన టెండర్లు రింగ్‌ అయ్యాయి. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి టెండర్‌ నిబంధనలు మార్చారు. టెండర్లలో పాల్గొనే సంస్థల దూరం 800 కి.మీ. నుంచి 1500 కి.మీ.కు ఎందుకు మార్చారు? సుబ్బారెడ్డి హయాంలో కేజీ నెయ్యి ధర రూ.496కు ఓ కంపెనీకి టెండర్‌ అప్పగించారు. భూమన హయాంలో ఈ ధరను రూ.294కు తగ్గించారు. ఇది ఎలా సాధ్యమైంది? ఇంత తక్కువ ధరకు ప్రపంచంలో ఎక్కడైనా నెయ్యి దొరుకుతుందా? ఒక ఏడాదిలో 55 శాతం నెయ్యి ధరను తగ్గించారు. ఇలా చేస్తే నాణ్యమైన నెయ్యి ఎలా తీసుకొస్తారు? ఇక్కడ దొంగ వైవీ సుబ్బారెడ్డినా లేక భూమన కరుణాకర్‌రెడ్డినా? వీరిలో ఒకరు జగన్మోహన్‌రెడ్డికి రైట్‌ హ్యాండ్‌ మరొకరు లెఫ్ట్‌ హ్యాండ్‌’ అని ఆనం వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారు కాబట్టే అంత తక్కువ ధరకు కోట్‌ చేశారన్నారు.

Updated Date - Oct 03 , 2024 | 03:59 AM