Share News

hosteles ప్రైవేటు ‘సంక్షేమమే’ లక్ష్యమా..?

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:51 PM

పేద విద్యార్థులకు విద్య, వసతి, నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ వసతి గృహాల వ్యవస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది. ప్రభుత్వ వసతి గృహాలున్నా వాటిలో కాకుండా అద్దె భవనాల్లో అది కూడా ఇరుకు గదులు అరకొర వసతులున్న భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీరి నిర్వాకంతో ఓ వైపు విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా మరోవైపు ప్రభుత్వ సొమ్ము వృథా అవుతోంది.

hosteles ప్రైవేటు ‘సంక్షేమమే’ లక్ష్యమా..?
నిరుపయోగంగా ఉన్న శింగనమలలోని ఎస్సీ బాలికల వసతి గృహం

ప్రభుత్వ భవనాలున్నా అద్దె భవనాల్లోనే హాస్టళ్లు

మండల కేంద్రాల్లోనూ ఇదే దుస్థితి

ఏటా రూ.1.80 కోట్లకుపైగా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఆగస్టు 21: పేద విద్యార్థులకు విద్య, వసతి, నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ వసతి గృహాల వ్యవస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది. ప్రభుత్వ వసతి గృహాలున్నా వాటిలో కాకుండా అద్దె భవనాల్లో అది కూడా ఇరుకు గదులు అరకొర వసతులున్న భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీరి నిర్వాకంతో ఓ వైపు విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా మరోవైపు ప్రభుత్వ సొమ్ము వృథా అవుతోంది.

ప్రభుత్వ భవనాలున్నా..

సంక్షేమశాఖల అధికారులకు జిల్లా కేంద్రంలో అది కూడా నగర నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భవనాలు కనిపించకపోవడం గమనార్హం. అవేమైనా వాడకానికి వీలులేని పరిస్థితుల్లో ఉన్నాయా అంటే ఒక్కో భవనంలో రెండు హాస్టళ్లు నిర్వహించే సామర్థ్యం ఉన్నవే. నగరంలో పలు ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నాయి. అయినా అధికారులు అద్దె భవనాల వైపే మక్కువ చూపుతున్నారు. ఫలితంగా నెలనెలా ఎస్సీ, బీసీ సంక్షేమ వసతిగృహాలకు సంబంధించి ప్రైవేట్‌ భవనాల యజమానులకు రూ. 15 లక్షలకుపైగా అద్దె చెల్లించాల్సి దుస్థితి నెలకొంది.

నగరంలోని అటవీశాఖ కార్యాలయం పక్కనే ఓ ప్రభుత్వ భవనం ఉంది. ఆ భవనంలో ఇదివరకూ విజిలెన్స కార్యాలయాన్ని నిర్వహించారు. సంవత్సర కాలంగా ఆ భవనం ఖాళీగా ఉంది. ఆ భవనాన్ని వినియోగిస్తే దాదాపు 400 మందికిపైగా విద్యార్థులకు వసతి కల్పించవచ్చు. అంటే రెండు హాస్టళ్లు అక్కడ నిర్వహించే వెసులుబాటు ఉంది.

కలెక్టరేట్‌ సమీపంలో ఎస్సీ సంక్షేమశాఖ కార్యాలయం వెనుకవైపు ఎస్కేయూ, ఎస్సీ వెల్ఫేర్‌ అనుసంధానంగా ఏర్పడిన స్కియాడ్‌ భవనం ఉంది. ఆ భవనం దాదాపు నాలుగేళ్లుగా ఖాళీగా ఉంది. ఇప్పటికీ నూతన గదులతో ఆ భవనం చెక్కుచెదరలేదు. అందులోనూ దాదాపు రెండు హాస్టళ్లను నిర్వహించవచ్చు.

నగరంలోని ఎస్సీ వెల్ఫేర్‌ వెనుకవైపు ఓ హాస్టల్‌ భవనం ఉంది. ఆ హాస్టల్‌ కెపాసిటీ దాదాపు 500 మందికిపైగా ఉంది. అయితే సకాలంలో ఆ భవనానికి మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపడంతో ఆ భవనం శిథిలమైంది. ఇప్పటికీ ఆ భవనానికి మరమ్మతులు చేయిస్తే ఉపయోగంలో వచ్చే అవకాశం ఉంది.

నగరంలోని దివ్యశ్రీ ఆస్పత్రి ఎదురుగా ఎస్సీ హాస్టల్‌ ఉంది. ఆ హాస్టల్‌ దాదాపు నాలుగేళ్లకుపైగా మూతపడింది. దానికి మరమ్మతులు చేపడితే రెండు హాస్టళ్లను నిర్వహించే అవకాశం ఉంది.

శింగనమల మండల కేంద్రంలో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల బాలికల వసతిగృహం కోసం ఓ భవనాన్ని నిర్మించారు. అయితే ఊరికి దూరంగా ఉందని ఆ భవనాన్ని వినియోగించుకోకపోవడంతో అందులో ప్రస్తుతం ఎమ్మార్సీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే శింగనమలలో ఎస్సీ బాలికల వసతి గృహం భవనాన్నీ వాడుకోకుండా గాలికొదిలేయడంతో ఆ భవనమూ ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. ఫలితంగా శింగనమల బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ భవనాల్లో నిర్వహిస్తున్నారు.

కాలేజీ హాస్టళ్ల సమస్య ఉంది

జిల్లాలోని పలు వసతి గృహాలు ప్రైవేట్‌ భవనాల్లో నిర్వహిస్తున్న మాట వాస్తవమే. అయితే ప్రభుత్వ భవనాలు లేని చోట మాత్రమే ప్రైవేట్‌ భవనాల్లో హాస్టళ్లు నిర్వహిస్తున్నాం. ఉన్న వసతిగృహాల్లో ఏవైనా సమస్యలుంటే వాటికి సంబంధించి రిపేరీలు చేయించి వినియోగించుకుంటున్నాం. ప్రీమెట్రిక్‌ హాస్టళ్లన్నీ దాదాపుగా సొంత భవనాల్లోనే నిర్వహిస్తున్నాం. కాలేజీ హాస్టళ్లకు మాత్రమే సమస్య ఉంది. మండల కేంద్రాల్లో హాస్టళ్లు ఉన్నప్పటికీ కాలేజీలకు దూరంగా ఉన్నాయి. ఫలితంగా విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్‌ భవనాల్లో వసతి గృహాలు నిర్వహిస్తున్నాం.

- కుష్బూకొఠారీ, డీడీ, బీసీ, ఎస్సీ సంక్షేమశాఖలు

Updated Date - Aug 21 , 2024 | 11:52 PM