Share News

సింహపురిలో పరువు హత్య!

ABN , Publish Date - Sep 21 , 2024 | 03:37 AM

అల్లారు ముద్దుగా పెంచిన ఆడబిడ్డ పెళ్లైన ఏడాదికే భర్తతో విభేదాల కారణంగా ఇంటికి తిరిగొచ్చేసింది.

సింహపురిలో పరువు హత్య!

కన్నకూతురినే కడతేర్చిన తల్లిదండ్రులు

కొడవలూరు, సెప్టెంబరు 20: అల్లారు ముద్దుగా పెంచిన ఆడబిడ్డ పెళ్లైన ఏడాదికే భర్తతో విభేదాల కారణంగా ఇంటికి తిరిగొచ్చేసింది. ఆ తర్వాత ఆమె వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక గొంతు నులిమి హత్య చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో 25 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొడవలూరు మండలం సత్రం గ్రామానికి చెందిన తిరుమూరు వెంకట రమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. అనారోగ్యం కారణంగా పదిహేనేళ్ల క్రితం పెద్దకుమారుడు మృతి చెందాడు. వీరిలో మూడో సంతానం తిరుమూరు శ్రావణిని (24) ఐదేళ్ల క్రితం సంగం మండలం సద్దీపురానికి చెందిన రాజే్‌షకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయిన ఏడాదికే కుటుంబ కలహాల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం అల్లూరు మండలం ఆములూరులో మరో మతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం కుమార్తెను అపహరించాడంటూ ఆమె భర్తపై అల్లూరు పోలీసులకు వెంకటరమణయ్య ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కుమార్తెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. తాను భర్తతోనే కలిసి ఉంటానని, తనను పంపేయాలంటూ కుటుంబ సభ్యులతో శ్రావణి గొడవ పడేది. ఈ క్రమంలో 25 రోజుల క్రితం జరిగిన ఘర్షణలో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు కుమార్తె గొంతు నులిమి హత్య చేసినట్టు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో గ్రామస్థులు గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే రోజు వెంకటరమణయ్య ఇంటికి వెళ్లిన పోలీసులు శ్రావణి గురించి ఆరా తీయడంతో పాటు, వారిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసులు ఇంటి వెనుక పూడ్చిన శ్రావణి మృతదేహాన్ని వెలికితీయించారు.

Updated Date - Sep 21 , 2024 | 03:38 AM