Share News

HIV : హెచ్‌ఐవీ చికిత్సలో గేమ్‌ చేంజర్‌!

ABN , Publish Date - Dec 01 , 2024 | 02:22 AM

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ చికిత్సల్లో లెంకపావీర్‌ ఇంజెక్షన్‌ను సరికొత్త గేమ్‌ చేంజర్‌గా భావిస్తున్నారు. ఇప్పటి వరకు హెచ్‌ఐవీ పాజిటివ్‌

HIV : హెచ్‌ఐవీ చికిత్సలో గేమ్‌ చేంజర్‌!

త్వరలో అందుబాటులోకి ‘లెంకపావీర్‌’ ఇంజెక్షన్‌

ఏడాదికి రెండుసార్లు వేసుకుంటే వైరస్‌ నియంత్రణ

ఇన్ఫెక్షన్‌ వ్యాధుల స్పెషలిస్ట్‌ కల్యాణ్‌ చక్రవర్తి వెల్లడి

గుంటూరు మెడికల్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ చికిత్సల్లో లెంకపావీర్‌ ఇంజెక్షన్‌ను సరికొత్త గేమ్‌ చేంజర్‌గా భావిస్తున్నారు. ఇప్పటి వరకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ తేలిన వారు యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ చికిత్స పొందుతున్నారు. ఇవి మాత్రల రూపంలో నోటి ద్వారా తీసుకొనే ఔషధాలు. ప్రతి రోజూ ఒక మాత్రను రోగులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై మాత్రతో పనిలేకుండా ఏడాదిలో కేవలం రెండు లెంకపావీర్‌ ఇంజెక్షన్లను తీసుకొంటే సరిపోతుంది. ఆరు నెలలకు ఒక ఇంజెక్షన్‌ చొప్పున ఏడాదిలో రెండుసార్లు మాత్రమే వీటిని తీసుకొంటే చాలని వైద్యులు చెబుతున్నారు. డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇన్ఫెక్షన్‌ వ్యాధుల స్పెషలిస్ట్‌ డాక్టర్‌ కె.కల్యాణ్‌ చక్రవర్తి శనివారం గుంటూరులో మీడియాకు ఈ విషయాలు వెల్లడించారు. 2030 నాటికి హెచ్‌ఐవీని అంతమొందించాలనే లక్ష్యానికి లెంకపావీర్‌ను ముఖ్యమైనదిగా భావించొచ్చన్నారు. లెంకపావీర్‌ ఇంజెక్షన్లు ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో అందుబాటులోకి వచ్చాయని, త్వరలో డాక్టర్‌ రెడ్డీస్‌, హెటిరో, ఎంక్యూర్‌ కంపెనీల ద్వారా మన దేశంలోకి వస్తున్నట్టు చెప్పారు. ఇదే స్ఫూర్తితో హెచ్‌ఐవీ నివారణకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడానికి కృషి జరుగుతోందన్నారు. జీన్‌ ఎడిటింగ్‌ ద్వారా వైరస్‌ జన్యువును నియంత్రించే మరో పరిశోధన జరుగుతుందని, దీనిని క్రిస్ఫర్‌ టెక్నాలజీ అంటారని తెలిపారు.

Updated Date - Dec 01 , 2024 | 02:22 AM