Share News

నిబద్ధతతోనే న్యాయవాద వృత్తిలో ఉన్నతస్థానం

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:07 AM

నిబద్ధత, విశ్వాసంతో ముందుకు సాగితే న్యాయవాద వృత్తిలో ఉన్నతస్థానానికి చేరవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి అన్నారు.

నిబద్ధతతోనే న్యాయవాద వృత్తిలో ఉన్నతస్థానం

ఏపీ హైకోర్టుకు రావడం సొంతింటికి వచ్చినట్టుంది: జస్టిస్‌ భట్టి

సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఘనంగా సన్మానించిన హైకోర్టు న్యాయవాదుల

సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య

అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): నిబద్ధత, విశ్వాసంతో ముందుకు సాగితే న్యాయవాద వృత్తిలో ఉన్నతస్థానానికి చేరవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి అన్నారు. ఏపీ హైకోర్టుకు రావడం సొంత ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడిని కావడం వల్లే తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కాగలిగానన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య సంయుక్తంగా మహిళా న్యాయమూర్తులు, ఉప లోకాయుక్త, సీనియర్‌ మహిళా న్యాయవాదులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా న్యాయమూర్తులు జస్టిస్‌ బీఎస్‌ భానుమతి, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ కిరణ్మయి మండవ, జస్టిస్‌ జగడం సుమతి, ఉప లోకాయుక్త రజనీరెడ్డి, న్యాయవాద వృత్తిలో అపార అనుభవం ఉన్న గుంటూరు బార్‌కు చెందిన సీనియర్‌ న్యాయవాది గోగినేని ప్రేమకుమారి, విజయవాడ బార్‌ నుంచి న్యాయవాది అచ్చమ్మ, హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాది కె.విజయలక్ష్మిని సన్మానించారు. ఆ తరువాత జస్టిస్‌ భట్టి, ఆయన సతీమణి అనుపమను గజమాల, శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ భట్టి మాట్లాడుతూ..ఉద్యోగాల పేరుతో అమాయక యువతులను ట్రాఫికింగ్‌ ఊబిలో దింపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ ప్రాంతాలను గుర్తించి ప్రజలను చైతన్యవంతం చేసేలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఏపీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (ఏపీఎ్‌సఎల్‌ఎ్‌సఏ), ఏపీ మహిళా న్యాయవాదుల సమాఖ్యను ఆయన కోరారు. మదనపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్లి లాయర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించేందుకు తన తల్లి ఎంతగానో ప్రోత్సహించారన్నారు. ఈ స్థాయికి ఎదిగేందుకు తన తల్లి, సోదరి, సతీమణి ప్రోత్సాహం, సహకారం ఎంతో ఉందన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. మహిళలు అనాదిగా అసమానత్వాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. పురుషులతో సామానంగా మహిళలు నిలబడేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు అవసరమన్నారు. సమర్ధత, నిజాయితీ, నిస్పాక్షిత వంటి లక్షణాల కారణంగానే జస్టిస్‌ భట్టి ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి మాట్లాడుతూ.. జస్టిస్‌ భట్టిని మదనపల్లి మాణిక్యంగా అభివర్ణించారు. ఏ మగాడైతే తన తల్లిని, సోదరిని ప్రేమగా చూసుకుంటాడో... అతను మంచి భర్తగా, తండ్రిగా నిలుస్తాడన్నారు. తల్లి తన బిడ్డను పెంచే విధానాన్ని బట్టే సమాజంలో నేరాల శాతం ఆధారపడి ఉంటుందని ఓ అధ్యయనం చెబుతోందన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.నాగిరెడ్డి, ఏపీ హైకోర్టు మహిళా న్యాయవాదుల సమాఖ్య అధ్యక్షురాలు కె.అరుణ, వ్యవస్థాపక అధ్యక్షురాలు భాస్కరలక్ష్మి పాల్గొని ప్రసంగించారు. బెజవాడ బార్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ విజయవాడ బీబీఏ హాలులో సంయుక్తంగా శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 03:07 AM