పూనం మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు
ABN , Publish Date - Apr 04 , 2024 | 04:32 AM
ఏపీ మెడ్‌టెక్ జోన్ ఏర్పాటులో అక్రమాలు, నేషనల్ హెల్త్ మిషన్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య,
మెడ్‌టెక్ అక్రమార్కులపై చర్యలు నిలిపివేత జీవోపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ఏపీ మెడ్‌టెక్ జోన్ ఏర్పాటులో అక్రమాలు, నేషనల్ హెల్త్ మిషన్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య, మెడ్‌టెక్ జోన్ సీఈవో జితేంద్రశర్మపై తదుపరి చర్యలను ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న పూనం మాలకొండయ్య, జితేంద్రశర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. ఏపీ మెడ్‌టెక్ జోన్ ఏర్పాటులో అక్రమాలు, నేషనల్ హెల్త్ మిషన్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య, మెడ్‌టెక్ జోన్ సీఈవో జితేంద్రశర్మపై తదుపరి చర్యలను ఉపసంహరిస్తూ 2021లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1645ను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. లీడర్ పత్రిక ఎడిటర్ వెంకట రమణమూర్తి ఈ పిల్ దాఖలు చేశారు. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించేలా సీఎస్‌ను ఆదేశించాలని కోరారు. ఆయన తరఫున న్యాయవాది వీవీ నారాయణరావు వాదనలు వినిపించారు. మెడ్‌టెక్ జోన్ ఏర్పాటులో అక్రమాలు, నేషనల్ హెల్త్ మిషన్ నిధుల దుర్వినియోగం జరిగాయని నిర్థారిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక సమర్పించిందన్నారు. బాధ్యులపై చర్యలకు సిఫారసు చేసిందన్నారు.