Share News

సీఆర్డీయే ‘రద్దు’ ఉత్తర్వులు రద్దు!

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:46 AM

రాజధాని రైతుల ప్లాట్ల విషయంలో చట్టం నిర్దేశించిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే అనుసరించలేదని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. భూసేకరణలో భాగంగా రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి మరోచోట వారికి కేటాయించే

సీఆర్డీయే ‘రద్దు’ ఉత్తర్వులు రద్దు!

రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట

ప్లాట్ల రద్దు, మరో చోట కేటాయింపులో

సహజ న్యాయసూత్రాలు పాటించలేదు

సీఆర్డీయే ప్రక్రియ పూర్తిగా లోపభూయిష్ఠం

రాతపూర్వకంగా రైతులకు తెలియజేయలేదు

నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారు

సీఆర్డీయే, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆక్షేపణ

ప్రొసీడింగ్స్‌, ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం

వారంలో తాజాగా నోటీసులివ్వాలని ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రాజధాని రైతుల ప్లాట్ల విషయంలో చట్టం నిర్దేశించిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే అనుసరించలేదని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. భూసేకరణలో భాగంగా రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి మరోచోట వారికి కేటాయించే విషయాల్లో సీఆర్డీయే అనుసరించిన విధానం లోపభూయిష్ఠంగా ఉన్నదని తప్పుబట్టింది. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తేల్చింది. ఈ మేరకు సీఆర్డీయే ప్రొసీడింగ్స్‌ను, రైతులకు ఇచ్చిన నోటీసులను రద్దుచేసింది. రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసే ముందు నోటీసులు ఇచ్చి వారి అభ్యంతరాలు స్వీకరించకపోవడం ఏమిటని ప్రశ్నించింది. చట్టనిబంధనలు అనుసరించడంలో అధికారులు విఫలమయ్యారని స్పష్టం చేసింది. అధికారుల చర్యలు సివిల్‌ వివాదాలకు దారితీసేవిగా ఉన్నాయని హెచ్చరించింది. యజమానులకు నోటీసులు ఇచ్చి, వారి అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్లాట్ల రద్దుపై రాతపూర్వక ఆదేశాలు ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడింది. ప్రాధమిక న్యాయసూత్రాలను అనుసరించడంలో అధికారులు విఫలమయ్యారని తేల్చింది. అయితే చట్ట నిబంధనలు, సహజ న్యాయసూత్రాలను అనుసరించి రైతులకు మరోచోట ప్లాట్ల కేటాయించే ప్రక్రియను కొనసాగించేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కాబోవని సీఆర్డీయే, ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తీర్పు ప్రతి అందిన తరువాత వారం రోజుల్లో ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ప్లాట్లను ఎందుకు రద్దు చేయాల్సి వస్తుందో, చట్టంలోని ఏ నిబంధన ఆ అధికారం కల్పిస్తుందో అందులో పేర్కొనాలంది. ఆ తరువాత మూడు వారాల పాటు వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని అధికారులకు స్పష్టం చేసింది. అనంతరం రైతులు తమ వాదనను నేరుగా వినిపించేందుకు రెండువారాల గడువు ఇవ్వాలని ఆదేశించింది. తదనంతరం రాతపూర్వకంగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఆర్డీయే, రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. సీఆర్డీయే నుంచి దస్త్రాలు కోరేందుకు పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.

నిబంధనలు పాటించాల్సిందే..

రాజధాని అమరావతిలో భూసేకరణ ప్రక్రియ ద్వారా సేకరించిన భూముల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేసి మరోచోట కేటాయించేందుకు సీఆర్డీయే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ కొండెపాటి కరుణ, మరికొందరు రైతులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను విచారించిన సింగిల్‌ జడ్జి తాము తగిన ఉత్తర్వులు జారీ చేసేవరకు పిటిషనర్లకు ఇప్పటికే కేటాయించిన ప్లాట్లను రద్దు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మరోచోట ప్లాటు తీసుకొనేందుకు సమ్మతించిన రైతుల విషయంలో నిబంధనలను అనుసరించి కేటాయింపు ప్రక్రియను కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీయే అప్పీల్‌ దాఖలు చేశాయి. వారి తరఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘సీఆర్డీయే చట్టం ప్రకారం భూ సేకరణవిధానం కింద తీసుకున్న భూముల్లో మాత్రమే రైతులకు ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. పిటిషనర్లలో కొందరికి భూసేకరణ ద్వారా తీసుకున్న భూమిలో ప్లాటు కేటాయించారు. ఈ నేపఽథ్యంలోనే వారికి కేటాయించిన ప్లాటును రద్దు చేసి, వేరే చోట ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని తెలిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాదులు సాయి సంజయ్‌ సూరనేని, కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు.

‘‘పిటిషనర్ల ప్లాట్లను రద్దు చేస్తూ సీఆర్డీయే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. పిటిషనర్లకు నోటీసులు ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించలేదు. కేటాయించిన ప్లాటును రద్దు చేసే అధికారం సీఆర్డీయేకు లేదు. రద్దు చేసి మరోచోట కేటాయించాలనుకుంటే సీఆర్డీయే అధికారులు తగిన కారణాన్ని చూపించాలి. ప్రస్తుత కేసులో ఏ కారణంతో పిటిషనర్‌ ప్లాటు రద్దు చేశారో చెప్పలేదు. చట్ట నిబంధనలు అనుసరించడంలో అధికారులు విఫలమయ్యారు’’ అని తెలిపారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.... రైతులకు ఇచ్చిన ప్లాట్లు రద్దు చేసే విషయంలో ప్రాఽథమిక, సహజ న్యాయసూత్రాలు పాటించడంలో అధికారులు విఫలమయ్యారని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపఽథ్యంలో రైతులకు మరోచోట తిరిగి ప్లాట్లు కేటాయించే విషయంలో సీఆర్డీయే ఇచ్చిన ప్రొసీడింగ్స్‌, తదనంతరం రైతులకు ఇచ్చిన నోటీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Feb 28 , 2024 | 03:46 AM