Share News

హై అలర్ట్‌!

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:04 AM

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కౌంటింగ్‌ కేంద్రాలు, ప్రధాన కూడళ్లు, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

హై అలర్ట్‌!

ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం

రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌, యాక్ట్‌ 30

రెడ్‌ జోన్లుగా కౌంటింగ్‌ కేంద్రాలు

పల్నాడులో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ

సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ

సంఖ్యలో కేంద్ర బలగాల మోహరింపు

‘కాల్చివేత’ అనుమతి కోరిన పోలీసులు

కలెక్టర్లకు నిర్ణయాధికారం ఇచ్చిన ఈసీ?

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కౌంటింగ్‌ కేంద్రాలు, ప్రధాన కూడళ్లు, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు ప్రాంతంలో పోలీసులు డ్రోన్లతో నిఘా పెట్టి శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించి మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌తోపాటు 30 పోలీసు యాక్టు అమలు చేస్తున్నారు. కేంద్రం నుంచి 57 కంపెనీల బలగాలను రాష్ట్రానికి రప్పించి అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు. సీఆర్‌పీఎఫ్‌ ఐజీ చారుసిన్హా సోమవారం విజయవాడకు వచ్చి ఇక్కడి పరిస్థితులను ఏపీ పోలీసులతో సమన్వయం చేసుకుని సాయుధ బలగాలకు దిశా నిర్దేశం చేశారు. అల్లర్లకు పాల్పడే వారిని ముందుగా గుర్తించి స్థానిక పోలీసులు బైండోవర్‌ చేశారు. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా హెచ్చరించారు. ‘‘కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో ఇతరులను బెదిరించి సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేయడంతోపాటు రౌడీ షీట్లు తెరుస్తాం. పీడీ యాక్టు ప్రయోగించి ఉక్కుపాదంతో అణచి వేస్తాం’’ అని గట్టిగా హెచ్చరించారు. రెచ్చగొట్టే పోస్టులు ఎవరు పెడుతున్నారు? ఎవరు వ్యాప్తి చేస్తున్నారనే విషయంపై నిరంతర నిఘా పెట్టామన్నారు. పోలీసుల డేగ కన్ను నుంచి ఎవరూ తప్పించుకోలేరని డీజీపీ తెలిపారు.

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కౌంటింగ్‌ కేంద్రాలు, ప్రధాన కూడళ్లు, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్‌ను దృష్టిలో పెట్టుకుని మద్యం దుకాణాలను మూసి వేయించినట్టు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. అనధికార మద్యం విక్రయాలపైనా నిఘా పెట్టి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించామన్నారు. అనధికార నిల్వలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ కార్యాలయాల నుంచి పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాల వ్యక్తులు ఎవరు వచ్చినా సహేతుక కారణం లేకుంటే చెక్‌ పోస్టుల వద్ద అనుమతించడం లేదని తెలిపారు. లాడ్జీలు, హోటళ్లు ఎక్కడికక్కడ తనిఖీ చేస్తూ కొత్త వ్యక్తులను సోమవారమే పంపించేశారు.

వజ్ర వాహనాలు సిద్ధం

హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు మొత్తం 1,985 సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసు శాఖ ఆయా ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బందికి బాడీ వార్న్‌ కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ప్రజలు గుంపులుగా ఏర్పడకుండా నియంత్రణ చర్యలకు పోలీసు బృందాలతో పాటు గ్యాస్‌ స్క్వాడ్‌లు, జల ఫిరంగులతో కూడిన వజ్ర వాహనాలను రంగంలోకి దింపారు. ప్రతి జిల్లా ఎస్పీ పరిధిలో క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసి, ఏ క్షణం ఎక్కడ అవసరమైనా అత్యంత వేగంగా చేరుకోవడానికి ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు. పెట్రోలు బంకుల్లో లూజ్‌ విక్రయాలు జరపకుండా నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించి అణువణువూ శోధించామని, ఎటువంటి అల్లర్లకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. కాగా, హింసకు పాల్పడే వ్యక్తులను ఏరిపారేసేందుకు కాల్చివేత ఆదేశాల కోసం పోలీసు శాఖ ఎన్నికల సంఘం అనుమతి కోరినట్లు తెలిసింది. అయితే, క్షేత్రస్థాయిలో జిల్లాల కలెక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటారని, పరిస్థితి చేయి దాటితే కలెక్టర్లను సంప్రదించాలని పోలీసు శాఖకు ఎన్నికల సంఘం సూచించినట్టు సమాచారం. ఇదేసమయంలో జిల్లాల ఎస్పీల ఫోన్లకు తక్షణమే స్పందించాలంటూ కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిసింది.

Updated Date - Jun 04 , 2024 | 04:04 AM