సాయం.. న్యాయం చేయండి!
ABN , Publish Date - Sep 21 , 2024 | 04:02 AM
టీడీపీ నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి మోసాలకు, అన్యాయాలకు గురైన బాధితులు పోటెత్తుతున్నారు.
టీడీపీ నేతల గ్రీవెన్స్‌లో బాధితుల ఫిర్యాదులు, వినతులు
అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి మోసాలకు, అన్యాయాలకు గురైన బాధితులు పోటెత్తుతున్నారు. తమ గోడు వెల్లబోసుకుంటూ.. సాయం, న్యాయం చేయాలని పార్టీ నాయకులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేఎస్ జవహర్, నెట్టెం రఘురామ్ వినతులు స్వీకరించారు. మోసానికి పాల్పడిన ఒక బ్యాంకు మేనేజర్ తన పేరుపై రూ.50 లక్షలు స్వాహా చేశాడని ఓ బాధితుడు, తన భూమిని కొట్టేయాలని బంధువులే కుట్ర చేస్తున్నారని ఓ ఒంటరి మహిళ ఫిర్యాదులు చేశారు. రెండు కిడ్నీలు పాడైపోయిన తన ప్రాణాలు కాపాడాలని మరొకరు వేడుకున్నారు. రుణం కోసం తణుకులోని తన రెండు దుకాణాలకు సంబంధించిన పత్రాలతో బ్యాంకులో దరఖాస్తు చేస్తే.. రుణం ఇవ్వకపోగా, తన డాక్యుమెంట్లపై బ్యాంక్ మేనేజరే రూ.50 లక్షలు లోన్ తీసుకుని మోసం చేశాడని, దీనిపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రాజమండ్రికి చెందిన కే భగవత్‌రావు టీడీపీ నేతల దృష్టికి తెచ్చారు. బ్యాంకు మేనేజర్‌పై చర్యలు తీసుకుని, తన డాక్యుమెంట్లు తిరిగి ఇప్పించాలని కోరారు. మరోవైపు తన రెండు కిడ్నీలు పాడైపోయి, డయాలసి్‌సతో జీవిస్తున్నానని, తన తల్లి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.17 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి గ్రామానికి చెందిన రాయల మహేష్ వాపోయారు. ఆర్థిక సాయం చేసి, తన ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. భర్త చనిపోవడంతో తనకు రావాల్సిన భూమిని తనకు ఇవ్వకుండా మరిది, చిన్న మామ కుటుంబసభ్యులు చంపేస్తామని బెదిరిస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ పరీక్షల విభాగంలో అవినీతిని అరికట్టి, తన కుమారుడికి న్యాయం చేయాలని డీవీ సూర్యనారాయణ అనే వ్యక్తి కోరారు. 2021లో తహశీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు ఉత్తీర్ణత సాధించినా.. పోస్టు ఇవ్వడం లేదని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పి.సూర్య ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని పార్టీ నేతలు వారికి చెప్పారు.