Share News

నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:28 AM

పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌, ఒడిశా పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఎన్టీఆర్‌, కృష్ణా, గోదావరి, ఏలూరు జిల్లాలకు హెచ్చరిక

ఈ సీజన్‌లో 42ు అధిక వర్షపాతం

అమరావతి/తిరుమల/విశాఖపట్నం, జూలై 14(ఆంధ్రజ్యోతి): పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌, ఒడిశా పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది నైరుతి దిశగా ఒంగి ఉంది. మరోవైపు కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మరో ఆవర్తనం దీనిలో విలీనమైంది. ఇంకోవైపు కేరళ నుంచి గుజరాత్‌ వరకు అరేబియా సముద్ర తీరం వెంబడి ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాష్ట్రంలోని అనేకచోట్ల ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఎక్కువ చోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో కృష్ణా, ఎన్టీఆర్‌, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. గత 48 గంటలుగా రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. గరిష్ఠంగా కల్యాణదుర్గంలో 42, పాడేరు లో 36, చింతపల్లిలో 35, నాగాయలంకలో 28, నిజాం పట్నంలో 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ వర్షాలతో ఖరీఫ్‌ పైర్లకు జీవం లభిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో 42.1ు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 12లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ పంటలు సాగులోకి వచ్చాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే, 3 లక్షల ఎకరాలు అధికంగా సాగులోకి వచ్చింది. లక్షన్నర ఎకరాల్లో చిరుధాన్యాలు వేయగా, 1.25లక్షల ఎకరాల్లో కంది, మినుము, పెసర వంటి అపరాల పంటలు వేశారు. లక్ష ఎకరాలపైగా వేరుశనగ పడింది.

తిరుమలలో కూలిన భారీ వృక్షం

తిరుమలలో ఆదివారం ఓ భారీ వృక్షం నేలకూలింది. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు తిరుమలలో వర్షం కురిసింది. దీంతో పాటు భారీగా ఈదురుగాలులు వీయడంలో బాటగంగమ్మ ఆలయ సమీపంలోని కారు పార్కింగ్‌లో ఉన్న ఓ భారీ వృక్షం కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే చెట్టు కొమ్మలు పడి రెండు టెంపో ట్రావెలర్‌ వాహనాలు, ఓ కారు ధ్వంసమయ్యాయి. అలాగే పలు ప్రాంతాల్లో కూడా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా అటవీ అధికారులు, సిబ్బంది.. చెట్లు, కొమ్మలను వేగవంతంగా తొలగించారు.

Updated Date - Jul 15 , 2024 | 04:28 AM