నేడు, రేపు కోస్తాలో భారీ వర్షాలు
ABN , Publish Date - Jul 18 , 2024 | 04:25 AM
మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం బుధవారం బలహీనపడింది. మరోవైపు ఈనెల 19న పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
అమరావతి, విశాఖపట్నం, జూలై 17(ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం బుధవారం బలహీనపడింది. మరోవైపు ఈనెల 19న పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి తూర్పుభాగం ఒడిశా నుంచి కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. ఒడిశా మీదుగా తూర్పు, పడమరకు ఒక ఉపరితల ద్రోణి, అరేబియా సముద్రం తీరం వెంబడి కేరళ నుంచి గుజరాత్ వరకు మరో ద్రోణి కొనసాగుతున్నాయి. వీటన్నింటి ప్రభావంతో కోస్తాలో రుతుపవనాలు చురుగ్గా మారడంతో బుధవారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 21 వరకూ కోస్తాలో వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. గురువారం ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, శుక్రవారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల 20, 21 తేదీల్లో కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వివరించింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా, గురువారం శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు, అలాగే, నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అత్యవసర సాయంకోసం టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101లో సంప్రదించాలని సంస్థ ఎండీ కూర్మనాథ్ కోరారు.