Share News

భారీ వర్షం

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:12 AM

హాలహర్వి మండలంలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రాత్రి వర్షంతో పాటు భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు మెరిశాయి.

 భారీ వర్షం
మార్లమాడికి వద్ద వేదవతి నదిలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

హాలహర్వి/హొళగుంద/ఎమ్మిగనూరు రూరల్‌, జూన్‌ 3: హాలహర్వి మండలంలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రాత్రి వర్షంతో పాటు భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు మెరిశాయి. దీంతో బాపురం గ్రామంలో పచ్చని టెంకాయ చెట్టుకు పిడుగు పడి మంటలు చెలరేగాయి. చెట్టుకు మంటలు వ్యాపించడంతో స్థానికులు భయపడ్డారు. వెంటనే వర్షం చినుకులు పడటంతో మండలు ఆరిపోయాయి. చింతకుంట గ్రామం వద్ద తాత్కాలిక వంతెన వాగుకు కొట్టకుపోవడంతో బళ్లారి, ఆదోని, ఆలూరు హాలహర్వి, హగరి ప్రాంతాలకు వెళ్ళే రాకోకలు స్తంభించిపోయాయి. వేదావతి వాగునీటితో కళకళలాడింది వర్షాలు లేక సాగు చేయని మండల రైతులు సాగుకు సిద్దమైయ్యారు. రాత్రి కురిసిన భారీ వర్షం రైతులకు ఎంతో మేలు జరిగింది.

వేదవతి నదికి వరద నీటి ప్రవాహం

హొళగుంద మండల పరిధిలోని మార్లమాడికి గ్రామం వద్ద ప్రవహిస్తున్న వేదవతి నదికి వరద నీటి ప్రవాహం పెరిగింది. ఆదివారం రాత్రి కర్ణాటకలోని ఎగువ ప్రాంతలో కురిసిన భారీ వర్షానికి వరద నీరు నదిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే వేదవతి నది వంతెనను వరదనీరు తాకుతున్నాయి. నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే, కర్ణాటక నుండి రాకపోకలు నిలిచే అవకాశం ఉంది.

ఎమ్మిగనూరులో 69.7 మి.మి వర్షపాతం

ఎమ్మిగనూరు మండలంలో సోమవారం 69.7 మి.మీ వర్షాపాతం నమోదైంది. మంగళవారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ఎమ్మిగనూరు మండలంలోని సిరాలదొడ్డి, రాళ్లదొడ్డి, ఎర్రకోట, గువ్వలదొడ్డి, కడిమెట్ల, కడివెళ్ల, కందనాతి, మాస్‌మాన్‌దొడ్డి, కె. తిమ్మాపురం తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంటపొలాల్లో నీరు చేరాయి. వాగులు, వంకల్లో నీరు పారి పంటపొలాల్లోకి చేరడంతో ముందుగా సాగు చేసిన పత్తి, కంది పంటపొలాల్లో విత్తనాలు వర్షంనీటిలో కొట్టుకుపోయాయి. సోమవారం కురిసిన వర్షానికి మండలంలోని ఆయా గ్రామాల్లోని రైతులు పంటలను సాగుచేసేందుకు విత్తనాల దుకాణాల ముందు బారులు తీరారు.

Updated Date - Jun 04 , 2024 | 12:13 AM