Share News

శ్రీశైలానికి భారీగా వరద

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:05 AM

ఎగువ నుంచి శ్రీశైల జలాశయానికి భారీగా వరద ప్రవహిస్తోంది. శనివారం జూరాల నుంచి 3,12,544 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 99,736 క్యూసెక్కులు మొత్తం 4,12,280 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

శ్రీశైలానికి భారీగా వరద

మరో మూడు రోజుల్లో గేట్లెత్తే చాన్స్‌

కర్నూలు/శ్రీశైలం(ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి శ్రీశైల జలాశయానికి భారీగా వరద ప్రవహిస్తోంది. శనివారం జూరాల నుంచి 3,12,544 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 99,736 క్యూసెక్కులు మొత్తం 4,12,280 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల సమయానికి 2,97,886 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 866.40 అడుగులకు చేరింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీంఎంసీలు కాగా, ప్రస్తుతం 127.5950 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 18,480 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగుతున్నాయి. తుంగభద్ర డ్యాం గరిష్ఠ నీటిమట్టం 1,633 అడుగులకుగాను ప్రస్తుతం 1,631.68 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 100.52 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం 33 గేట్లు ఎత్తి దిగువకు 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలోకి రోజుకు సగటున 30 టీఎంసీల వరద వచ్చి చేరుతోంది. వరద ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యాం ఇంజనీర్లు చెబుతున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 03:07 AM