Share News

అరచేతిలో ‘వైద్యం’

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:27 AM

కొత్తగా ప్రారంభించిన 5 మెడికల్‌ కాలేజీల్లో విద్యార్థులకే సరైన సౌకర్యాలు లేకుంటే.. ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అంటూ సీఎం జగన్‌ రోత పత్రికలో చెత్త రాతలు రాశారు.

అరచేతిలో ‘వైద్యం’

కొత్త మెడికల్‌ కాలేజీలపై సీఎం రోతపత్రికలో తప్పుడు రాతలు

ఎన్నికల వేళ మభ్యపెట్టే యత్నం

5 కొత్త కాలేజీల్లో ఆధునిక వసతులట

క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు

పూర్తిస్థాయిలో నిర్మాణం కాని భవనాలు

నిర్మాణంలోనే హాస్టళ్లు, బోధనాస్పత్రులు

కనీస వసతులు లేక విద్యార్థుల అవస్థలు

ఈ ఏడాదిలో 5, వచ్చే ఏడాదిలో 7 కొత్త కాలేజీలు రెడీ అంటూ డబ్బా

పలు చోట్ల పునాదుల దశలోనే నిర్మాణాలు

ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కొత్తగా ప్రారంభించిన 5 మెడికల్‌ కాలేజీల్లో విద్యార్థులకే సరైన సౌకర్యాలు లేకుంటే.. ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అంటూ సీఎం జగన్‌ రోత పత్రికలో చెత్త రాతలు రాశారు. హాస్టల్‌ భవనాల నిర్మాణాలను ఇంకా పూర్తి చేయకపోయినా, కనీస వసతులు కల్పించకపోయినా.. ఆధునిక వసతులతో కొత్త కాలేజీలు నిర్మించారని తప్పుడు రాతలు రాశారు. పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించకపోయినా, బోధనాస్పత్రులు నిర్మించకపోయినా, చాలా భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నా.. వైద్య విద్యలో నవశకం అంటూ రోత రాతలు రాశారు. తాత్కాలిక భవనాలు, అరకొర వసతులు-నిర్మాణాలకు కలర్‌ఫుల్‌గా రంగులు వేయించి కొత్త కాలేజీలను ప్రారంభించారు. ఈ మాత్రం దానికే ప్రభుత్వ వైద్య విద్యా రంగంలో సీఎం జగన్‌ సంచలన నిర్ణయాలు తీసుకున్నారంటూ.. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు అర్ధసత్యాలు, అసత్యాలు అచ్చేశారు. గతేడాది ప్రారంభించిన కాలేజీల పరిస్థితి ఇలా ఉండగా.. 2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా 5, 2025-26లో మరో 7 కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రారంభించనున్నట్టు గొప్పలకు పోయారు. ఈ ఏడాది ప్రారంభించాల్సిన మెడికల్‌ కాలేజీల్లో భవన నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. కర్నూలు జిల్లా ఆదోని కాలేజీలో 15 శాతం పనులే జరిగాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక్క భవన నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. అయినా ఈ ఏడాది ప్రారంభిస్తున్నట్టు డబ్బా కొట్టారు. ఇక 2025-26లో ప్రారంభిస్తామని చెబుతున్న కాలేజీల పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా వైద్య కళాశాల నిర్మాణానికి ఇంకా టెండర్లు కూడా పిలవలేదు. పలు చోట్ల కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. గడువులో పూర్తయ్యే పరిస్థితే లేదు. అయినా వాస్తవాలు వక్రీకరించి జగన్‌ రోతపత్రికలో అసత్యాలు వండి వార్చారు.

2025-26లో ప్రారంభించాల్సిన వాటి పరిస్థితి ఇదీ

కొంత పునాది.. కొన్ని పిల్లర్లు

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మెడికల్‌ కళాశాల భవన నిర్మాణాలకు రెండున్నరేళ్ల కిందట శంకుస్థాపన చేశారు. 2023 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని, 2024లో అడ్మిషన్లు ప్రారంభిస్తామని భూమి పూజ సందర్భంగా సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఏడాదిన్నర పాటు టెండర్ల పేరుతో కాలయాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించలేదు. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా ఇంకా భూమి చదును పనులు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా 8శాతం పనులే జరిగినట్లు తెలుస్తోంది. మెడికల్‌ కళాశాలను 2025-26 నాటికి ప్రారంభిస్తామని చెబుతు న్నా, సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

నత్తనడకన నిర్మాణ పనులు

పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 2021 మే 30న సీఎం జగన్‌ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో మెడికల్‌ కళాశాల, ఆసుపత్రి పూర్తి చేస్తామని గొప్పలు చెప్పారు. ఈ ఏడాది ఆఖరుకి పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నా.. 30 శాతం పనులకే మూడేళ్లు గడిస్తే, మిగిలిన 70 శాతం పనులకు ఇంకెన్నేళ్లు పడుతుందో?

ఎప్పటికి పూర్తవుతుందో?

మూడేళ్లలో బాపట్ల మెడికల్‌ కళాశాల నిర్మాణం పూర్తి చేస్తామని 2021 మే 31న చెప్పారు. పనులు మొదలు పెట్టింది మాత్రం ఆరు నెలల క్రితమే. ఇంకా పిల్లర్ల దశలోనే పనులు జరుగుతున్నాయి. శంకుస్థాపన చేసిన తర్వాత రెండేళ్ల పాటు పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపిస్తుండంతో 2025-26కల్లా మెడికల్‌ కళాశాలలో తరగతులు ప్రారంభిస్తామని అంటున్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే నిర్మాణం పూర్తి కావడానికే మరో మూడేళ్లు పట్టే అవకాశముంది. సకల హంగులు పూర్తి చేసుకుని మెడికల్‌ కళాశాల పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేసరికి 2027 దాటడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిర్మాణాలు పూర్తికావడం డౌటే

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలో సమనస గ్రామంలో చేపట్టిన వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో ఆశించిన మేర పురోగతి లేదు. 32 భవనాలు నిర్మించాల్సి ఉండగా, ప్రస్తుతం 17 భవనాలు మాత్రమే నిర్మించడానికి కాంట్రాక్టు సంస్థ చర్యలు చేపట్టింది. వైద్య కళాశాల నిర్మాణ పనులను 2025 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ఆచరణ సాధ్యం కాని పరిస్థితుల్లో ఉన్నాయి.

ఒక్క అడుగూ పడలేదు..

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో మెడికల్‌ కళాశాల నిర్మాణం పనులు ఒక్క అడుగూ ముందుకు పడలేదు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే వర్చువల్‌గా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడాదికి రైతులకు సొమ్ములు చెల్లించి వైద్య విధాన పరిషత్‌కు భూములను అప్పగించారు. 2022 నవంబరులో జగన్‌ హడావుడిగా పనులు ప్రారంభించారు. ఇప్పటిదాకా ఒక్క భవనం కూడా నిర్మించలేదు. కళాశాల కోసం సేకరించిన భూమిని కూడా ఇప్పటిదాకా పూడ్చలేదు.

కాగితాలకే పరిమితం

పార్వతీపురం మన్యం జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. కానీ ఆ గొప్పలు కాగితాలకే పరిమితమయ్యాయి. పార్వతీపురం పట్టణానికి సమీపంలో నిర్మాణం చేపట్టాలని అధికారులు స్థల పరిశీలన చేశారు. కానీ నేటికీ ఆ పనులకు సంబంధించి టెండర్లు పిలవలేదు.

కా‘లేజీ’ పనులు

రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మూడున్నర ఎకరాల స్థలంలో కాలేజీ తాత్కాలిక భవనం నిర్మించి గతేడాది తరగతులు ప్రారంభించారు. చాలా భవనాలు ఇంకా పునాదుల్లోనే ఉన్నాయి. పూర్తి కావడానికి కనీసం రెండేళ్లు పడుతుందని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు చెబుతున్నారు. బోధనాసుపత్రి పనులు ఇంకా ఆరంభమే కాలేదు. తాత్కాలిక హాస్టళ్లు ఏర్పాటు చేశారు. సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.

తాత్కాలికంగా ఏర్పాటు

ఏలూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను అరకొర సౌకర్యాల నడుమ నిర్వహిస్తున్నారు. ఎన్‌ఎంసీకి తప్పుడు సమాచారం ఇచ్చి 2023 ఏప్రిల్‌ 26న అనుమతి పొందారు. ఏలూరు పాతబస్టాండ్‌ సమీపంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో తాత్కాలిక భవనంలో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. తరగతులు ప్రారంభమై ఐదు నెలలు అయినా ల్యాబ్‌లో ప్రాక్టికల్స్‌ తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. కాలేజీ భవనాలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. పూర్తిస్థాయిలో నిర్మాణం కావాలంటే మరో మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు.

అన్నీ సమస్యలే

విజయనగరంలో నూ తనంగా వైద్య కళాశాలను అందుబాటులోకి తీసుకువచ్చామని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అక్కడ చూస్తే అన్నీ సమస్యలే. అనేక విభాగాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. విద్యార్థుల వసతి గృహాల భవనాలను ఇప్పటికీ పూర్తి చేయలేదు. 2021 మేలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. తరగతులు నిర్వహించే బ్లాక్‌ పూర్తి చేశారు. ఇందులోనే ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. బోధనాసుపత్రి నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

కనీస వసతుల్లేకుండానే..

కృష్ణా జిల్లా మచిలీపట్నం మెడికల్‌ కళాశాలను కనీస వసతులు లేకుండానే ప్రారంభించారు. కేవలం మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతి గదులు, హాస్టల్‌ రూములు మాత్రమే పూర్తి చేసి గత ఏడాది సెప్టెంబరులో రిబ్బన్‌ కత్తిరించేశారు. కళాశాలకు వెళ్లాలంటే రైల్వేట్రాక్‌ను దాటి వెళ్లాలి. కనీసం ఫ్లైఓవర్‌ నిర్మించాలన్న ఆలోచన కూడా లేకుండా క్లాసులు మొదలు పెట్టేశారు. ఇంకా 30 భవనాల నిర్మాణం చేయాల్సి ఉంది. కళాశాల ప్రాంగణంలో రహదారులు, డ్రైనేజీ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక్క రహదారి మినహా మిగిలిన రోడ్ల పనులు చేయలేదు. కళాశాలలో తాగునీటి వసతి లేదు. ఓపీడీ బ్లాక్‌, ఐపీడీ బ్లాక్‌ల నిర్మాణం 30 శాతం పనులు కూడా పూర్తికాలేదు. వీటి నిర్మాణం పూర్తయితేనే వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.

అసంపూర్తి భవనాల్లో బోధన

నంద్యాల వైద్య కళాశాల పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని, ఇక సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలే తరువాయి అంటూ జగన్‌ ప్రభుత్వ గొప్పలు చెబుతోంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే అంతా బూటకమే. వైద్య కళాశాల భవనాలు ఇంకా పూర్తి కాలేదు. కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులకు అవసరమైన వసతులను సమకూర్చి తరగతులను నిర్వహిస్తున్నారు. బోధనకు అవసరమైన భవనాలను పూర్తి చేయకపోతే తరగతులు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చేదిలేదంటూ గతేడాది మార్చిలో ఎన్‌ఎంసీ తేల్చి చేప్పడంతో.. ప్రభుత్వం హడావుడిగా సగం సగం పనులు చేపట్టి అనుమతులు తెచ్చుకుని అడ్మిషన్లను చేపట్టింది. విద్యార్థులకు అవసరమైన హాస్టల్‌ భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇవి అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది.

2024-25లో ప్రారంభించాల్సిన కాలేజీల పరిస్థితి ఇదీ జరిగింది 15 శాతం పనులే

కర్నూలు జిల్లా ఆదోని వైద్య కళాశాలకు 2021 మే 31న సీఎం జగన్‌ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నర తరువాత 30 నెలల్లో పూర్తి చేసేలా 2022 డిసెంబరు 26న కాంట్రాక్ట్‌ సంస్థ ఒప్పందం చేసుకుని పనులు చేపట్టింది. 13 నెలలు గడిచినా 15 శాతం పనులు మాత్రమే జరిగాయి. నిర్మాణ పనులు పునాదులు దాటి పిల్లర్ల దశలో ఉన్నాయి. గడువులో మిగిలిన 85 శాతం పనులు పూర్తి చేయడం సాధ్యమయ్యేలా కనపడటం లేదు.

ఒక్కటీ పూర్తి కాలేదు

ప్రకాశం జిల్లా మార్కాపురం మెడికల్‌ కాలేజీలో ఒక్క భవన నిర్మాణం కూడా పూర్తికాలేదు. మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేస్తామని 2021 మే 21న జగన్‌ ప్రకటించారు. టెండర్ల అవార్డు ప్రకారం 2024 సెప్టెంబరు ఆఖరుకు పూర్తికావాలి. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2024-25 నుంచి మెడికల్‌ కాలేజీని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. యుద్ధప్రాతిపదికన పనులు చేసినా పూర్తి చేయడానికి మరో రెండేళ్లు పట్టడం ఖాయం.

Updated Date - Feb 06 , 2024 | 04:27 AM