Share News

సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తా

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:53 AM

సనాతన ధర్మానికి హాని కలిగితే ఎటువంటి పరిస్థితిలోనూ ఊరుకునేది లేదని, ప్రాణాలు ఇచ్చేందుకైనా తాను సిద్ధమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ‘

సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తా

చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఆ ధర్మానికి హానిపై మౌనం సరికాదు

లౌకికవాదం అనేది వన్‌వే కాదు టూ వే

దానికి భంగం కలిగితే కచ్చితంగా నిలదీస్తా

మదమెక్కి మాట్లాడుతున్న పొన్నవోలు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం

ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దుర్గ గుడి మెట్లు కడిగిన జనసేనాని

విజయవాడ(వన్‌టౌన్‌), సెప్టెంబరు 24: సనాతన ధర్మానికి హాని కలిగితే ఎటువంటి పరిస్థితిలోనూ ఊరుకునేది లేదని, ప్రాణాలు ఇచ్చేందుకైనా తాను సిద్ధమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ‘‘చేతులెత్తి నమస్కరిస్తున్నా.. సనాతన ధర్మానికి హాని జరిగితే మౌనంగా ఉండటం మంచిది కాదు’’ అని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అన్నారు. తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంలో వెంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి క్షమాపణలు కోరుతూ ఆయన 11 రోజుల ప్రాయశ్చిత దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్థానం గుడి మెట్ల మార్గాన్ని నీళ్లు పోసి కడిగి శుభ్రం చేశారు. పసుపు రాసి కుంకుమ అద్దారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం ఆయనకు వేద పండితులు, అర్చకులు ఆశీస్సులు అందచేశారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై హిందువులందరూ కలిసికట్టుగా మాట్లాడాలి. దీనిపై మౌనం మంచిది కాదు. వైసీపీ వాళ్ల మాటలు మరింత వేదన కలిగిస్తున్నాయి. తప్పును ఒప్పుకోకుండా బుకాయింపులతో కాలక్షేపం చేస్తున్నారు. తప్పు జరిగినప్పుడు ప్రాయశ్చితం చేసుకుంటామని చెప్పాలి. అంతేకానీ ఇష్టానుసారం మాట్లాడటమేమిటి? దుర్గగుడిలో వెండిరథం సింహాల ప్రతిమలు మాయమైతే అప్పట్లో వైసీపీ నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు నాడు క్రైస్తవులో, మరొకరో చేయలేదు. చేతులకు తాళ్లు కట్టుకుని బొట్టుపెట్టుకునే హిందువులే మాట్లాడారు’’ అన్నారు.


11111.jpg

నాడు వందల ఆలయాల ధ్వంసం..

వైసీపీ హయాంలో వందల ఆలయాలను ధ్వంసం చేశారని, దేవతల విగ్రహాలను అపవిత్రం చేశారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రామతీర్థంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేస్తే సంయమనం పాటించామన్నారు. ‘‘భారతదేశంలో సెక్యులరిజం వన్‌ వే కాదు..రెండువైపుల నుంచీ ఉండాలి. ఇతర మతాల ఆచారాలకు, సంప్రదాయాలకు విఘాతం కలిగితే ఎలా స్పందిస్తున్నారో.. హిందువుల మనోభావాలకు, ఆచారాలకు, సంప్రదాయాలకు, ధర్మాలకు విఘాతం కలిగితే అంతే స్థాయిలో స్పందించాలి. దేశంలో అన్ని మతాలకు సమాన హక్కులు ఉన్నాయి. తిరుమల ఘటన వంటిది ఏ మసీదులోనో, చర్చిలోనో జరిగితే వైసీపీ నాయకులు ఇలానే మాట్లాడతారా?’’ అని ప్రశ్నించారు.

పొన్నవోలూ.. జాగ్రత్త!

మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పందికొవ్వు చాలా ఎక్కువ ధర ఉంటుందని, తక్కువ ధర గల నెయ్యిలో ఎలా కలుపుతారని పొన్నవోలు అంటున్నారు. భక్తుల మనోభావాలను మరింత దెబ్బకొట్టేలా ఆయన మాటలున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటే రికార్డులు తనకు పంపించాలంటున్నారు. మరో మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుమలలో పెద్ద యాక్టింగ్‌ చేశారు. ఇంత పెద్ద అపచారం జరిగితే అప్పటి ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారు?’’ అని పవన్‌ నిలదీశారు.

ప్రకా్‌షరాజ్‌, కార్తి గుర్తుంచుకోండి

నటుడు ప్రకా్‌షరాజ్‌ సున్నిత అంశాల విషయంలో తెలుసుకుని మాట్లాడాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రకా్‌షరాజ్‌ తనకు మంచి మిత్రుడని, అతనిపై ఎంతో గౌరవం ఉందని, అయితే సనాతన ఽధర్మ పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడటం కూడా తప్పే అని ప్రకాష్‌ రాజ్‌ చెబితే ఎట్లా అని ప్రశ్నించారు. లడ్డూ విషయంలో జోకులు వేయడం సరికాదని తమిళ నటుడు కార్తిని ఉద్దేశించి అన్నారు. ‘‘సినీ ఫంక్షన్‌లో లడ్డూ సున్నిత అంశం అంటూ (కార్తి) సరదాగా మాట్లాడారు. అలా అనొద్దు. నేను నటులను గౌరవిస్తా. మీరు ఒకటికి వందసార్లు ఆలోచించుకుని మాట్లాడండి’’ అని అన్నారు. ఇదే తప్పు ఓ మసీదుకు, చర్చికి జరిగితే ఇలానే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ‘‘ఇదేనా మీరు చెబుతున్న లౌకిక వాద ధర్మం? సనాతన ధర్మం పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. తోటి హిందువులను సాటి హిందువులే తూలనాడటం మానుకోవాలి’’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


పల్లె పల్లెకు ప్రాయశ్చిత్త దీక్ష!

కార్యాచరణ సిద్ధంచేసిన జనసేన

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష లక్ష్యాన్ని పల్లెపల్లెకు తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. జనసేనాని పిలుపుపై వీర మహిళలు, జనసైనికులు, క్రియాశీలక సభ్యులు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆయన దీక్ష 9వ రోజుకు చేరుకున్నప్పటి నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేపడతారు. అందులోభాగంగా ఈ నెల 30వ తేదీ సాయంత్రం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తారు. అక్టోబరు 1వ తేదీన ప్రతి ఒక్కరూ ’’ఓం నమో నారాయణాయ’’ అనే మంత్రాన్ని సామూహికంగా ఆలయాలు, యోగా కేంద్రాలు, నివాసాల్లో పఠిస్తారు. 2వ తేదీన నగర సంకీర్తన కార్యక్రమాలు చేపడతారు. దీక్ష పరిసమాప్తం అయ్యే చివరి రోజు 3వ తేదీన ఆలయాల్లో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.

Updated Date - Sep 25 , 2024 | 04:53 AM