Share News

‘స్వాగతం’లో నరకం చూపారు!

ABN , Publish Date - Mar 06 , 2024 | 04:00 AM

సీఎం జగన్‌ విశాఖ వస్తున్నారంటేనే మహిళా సంఘాల సభ్యులు హడలిపోతున్నారు. ప్ల కార్డులు పట్టుకుని సీఎంకు దారిపొడవునా స్వాగతం పలికే బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అధికారులు అప్పగిస్తున్నారు.

‘స్వాగతం’లో నరకం చూపారు!

జగన్‌ వచ్చేదారిలో మండుటెండలో డ్వాక్రాలు

‘రావాలి.. పూలు చల్లాలి’ అంటూ ఆదేశాలు

ఆటోలో తెచ్చి రోడ్డు పక్కన నిలబెట్టిన అధికారులు

గంట, రెండు గంటల ముందే నిలువుకాళ్లపై...

ఎప్పుడు సీఎం విశాఖ వచ్చినా మహిళలకు అవస్థలే

విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ విశాఖ వస్తున్నారంటేనే మహిళా సంఘాల సభ్యులు హడలిపోతున్నారు. ప్ల కార్డులు పట్టుకుని సీఎంకు దారిపొడవునా స్వాగతం పలికే బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అధికారులు అప్పగిస్తున్నారు. ‘రావాలి.. పూలు చల్లాలి’ అంటూ ఒత్తిడి చేసి మరీ డ్వాక్రాలను మండుటెండలో రోడ్డు పక్క నిలబెట్టేస్తున్నారు. మంగళవారం జగన్‌ విశాఖ పర్యటనలో ఆయనకు స్వాగతం చెప్పడానికి నిలబెట్టినవారికి శోష వచ్చినంత పనైంది. రుషికొండ ఐటీ పార్కులోని హిల్‌ నంబర్‌ 3పై హెలికాప్టర్‌ దిగిన జగన్‌, అక్కడ నుంచి రాడిసన్‌ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు. ‘విజన్‌ విశాఖ’ పేరుతో పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న అనంతరం తిరిగి పీఎం పాలెంలోని ‘వి’ కన్వెన్షన్‌కు వెళ్లి అక్కడ ‘భవిత’ పేరుతో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయా మార్గాల్లో దారిపొడవునా సీఎంకు ప్లకార్డులతో స్వాగతం పలికేందుకు భీమిలి నియోజక వర్గానికి చెందిన మహిళలను తరలించారు. ప్రతి రీసోర్స్‌ పర్సన్‌ తమ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులను నిర్దేశించిన ప్రాంతానికి తీసుకువెళ్లాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రతి ఆర్పీ తమ పరిధిలోని మహిళా సంఘాల్లోని సభ్యులను ఆటోల్లో తీసుకొని వెళ్లారు. వారికి నిర్దేశించిన ప్రాంతానికి సభ్యులంతా వచ్చిన తర్వాత గ్రూపు ఫొటో తీసి అధికారులకు పంపించారు. అనంతరం వారిని సీఎం వచ్చే మార్గంలో ఫుట్‌పాత్‌పై నిలబెట్టి, వారి చేతికి ప్లకార్డులను అందజేశారు. అలాగే మరికొందరు మహిళలకు బంతి పూలు ఇచ్చి...సీఎం వచ్చినప్పుడు కారుపై విసరాలని ఆదేశించారు. సీఎం రావడానికి గంట, రెండు గంటల ముందే రోడ్డుపై నిలబెట్టడంతో ఎండ తీవ్రతకు మహిళలంతా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సీఎం నగరానికి వచ్చిన ప్రతీసారి తమకు ఇదేం శిక్ష అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తంచేయడం విశేషం.

అప్పుడూ ఇదే నరకం

సీఎం రావడానికి రెండు, మూడు గంటల ముందే తీసుకొచ్చి మండుటెండలో నిలబెట్టేస్తుండడంతో నరకయాతన అనుభవించాల్సి వస్తోందని మహిళలు గగ్గోలు పెడుతున్నారు. కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి శారదా పీఠానికి వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌ నుంచి చినముషిడివాడ వరకూ మహిళలను రోడ్డు పొడవునా నిలబెట్టి ప్లకార్డులతో స్వాగతం పలికించిన విషయాన్ని డ్వాక్రాలు గుర్తు చేసుకున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 04:02 AM