Share News

తుపాకీ గురిపెట్టి ఒప్పుకోమన్నారు

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:52 AM

సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు అరెస్టు చేసిన వేముల సతీ్‌షకుమార్‌ ఆదివారం నెల్లూరు సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

తుపాకీ గురిపెట్టి ఒప్పుకోమన్నారు

2 లక్షలు డబ్బులిస్తామన్నారు.. నిద్రపోతుంటే తీసుకెళ్లారు

సీఎం జగన్‌పై దాడి జరిగిన ప్రాంతానికే వెళ్లలేదు

గులకరాయి కేసులో నిందితుడు సతీష్‌ వెల్లడి

నెల్లూరు జైలు నుంచి బెయిల్‌పై విడుదల

కోడికత్తి-2 చేయాలనుకున్నారు: న్యాయవాది సలీం

నెల్లూరు(క్రైం), జూన్‌ 2: సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు అరెస్టు చేసిన వేముల సతీ్‌షకుమార్‌ ఆదివారం నెల్లూరు సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో డిఫెన్స్‌ లాయర్‌గా ఉన్న అబ్దుల్‌ సలీం ఆదివారం జైలు వద్దకు చేరుకుని బెయిల్‌ పత్రాలను అధికారులకు అందించారు. ఆ తర్వాత సతీష్‌ను జైలు నుంచి విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన సతీష్‌ మీడియాతో మాట్లాడారు. సీఎంపై దాడి జరిగిన విషయమే తనకు తెలియదని, రూ.300 ఇస్తామంటే కొద్ది సేపు సీఎం పర్యటనకు వెళ్లి అక్కడ నుంచి ఇంటికి వచ్చేశానని తెలిపారు. ‘ఇంటిలో నిద్రపోతున్న నన్ను లేపి గంజాయి తాగావంటూ ఏవేవో మాటలు మా తల్లిదండ్రులకు చెప్పి నన్ను బయటకు తీసుకువెళ్లారు. ఎక్కడెక్కడికో తీసుకువెళ్లి తుపాకీ గురిపెట్టి కేసు ఒప్పుకోవాలని పోలీసులు బెదిరించారు. రూ.2 లక్షలు ఇస్తాం... కేసు ఒప్పుకోవాలని ఆశపెట్టారు. దాడి చేసిన వారిని పట్టుకోకుండా పనులు చేసుకునే మమ్మల్ని పట్టుకుంటే మేము ఏమి చేయగలం’ అని సతీష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కోడికత్తి కేసులాగా తన కుమారుడు ఏళ్ల తరబడి జైలులోనే మగ్గిపోతాడేమో అని కుంగిపోయిన సతీష్‌ తల్లిదండ్రులు కుమారుడు బెయిల్‌పై విడుదల కావడం చూసి ఆనందంతో సతీ్‌షను హత్తుకున్నారు.

కోడికత్తి-2 చేయాలని ప్లాన్‌ చేశారు

జగన్‌పై జరిగిన గులకరాయి దాడిని కోడికత్తి-2 కేసులా చేయాలని ప్లాన్‌ చేశారని న్యాయవాది అబ్దుల్‌ సలీం ఆరోపించారు. కానీ అది కుదరలేదన్నారు. జైలు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కేసులో ముద్దాయికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలనూ పోలీసులు కోర్టుకు అందించలేదన్నారు. బెయిల్‌ వచ్చిన తర్వాత కూడా పోలీసులు బెయిల్‌ రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారని తెలిపారు. అయితే అక్కడ ఫిటిషన్‌ను రద్దు చేశారని సలీం పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల వద్ద గులకరాయి లేదు.. క్యాడ్‌బాల్‌ లేదు... హెయిర్‌ గన్‌ లేదు... అన్నీ కూడా పోలీసులు ఊహించి పెట్టుకున్నవేనని చెప్పారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే గులకరాయి కేసులో సీఎం జగన్‌ విక్టిమ్‌ నెంబర్‌ 1గా ఉన్నారని, ఆయన పోలీసు స్టేషన్‌కు వచ్చి వాగ్మూలం ఇవ్వాల్సి ఉందని, సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ జరిగిన ప్రాంతానికి వచ్చి ఎలా జరిగిందో పోలీసులకు వివరించాల్సి ఉందని సలీం అన్నారు. అయితే అలాంటివి ఏమీ జరగలేదన్నారు. ఈ ఆంశాలను కోర్టు దృష్టికి తీసుకు వెళ్లామని పేర్కొన్నారు.

అన్యాయంగా ఇరికించారు

గులకరాయి కేసుతో నా కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యమంత్రి వచ్చిన రోజు ప్లకార్డు పట్టుకొని నిల్చొని తిరిగి ఇంటికి వచ్చేశాడు. పుట్టినరోజు కావడంతో నా దగ్గరే రూ.500 తీసుకొని వెళ్లి కేక్‌ తెచ్చుకొని రాత్రి 12 సమయంలో మా గూడెంలో ఆర్చి దగ్గర కేక్‌ కట్‌ చేసుకున్నాడు. కేక్‌ కట్‌చేశాడన్న సాకు చూపించి నా కుమారుడిని ఈ కేసులో ఇరికించారు. నా కొడుక్కి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు.

- దుర్గారావు, సతీష్‌ తండ్రి

Updated Date - Jun 03 , 2024 | 03:54 AM