Share News

నా అనుకున్న వాళ్లను నాశనం చేశాడు!

ABN , Publish Date - Apr 03 , 2024 | 04:24 AM

జగన్మోహన్‌రెడ్డి నా అన్న.. నా రక్తం.. అన్నంటే నాకు ద్వేషం లేదు. ఎన్నికల్లో నన్ను చెల్లి కాదు బిడ్డ అన్నాడు.

నా అనుకున్న వాళ్లను నాశనం చేశాడు!

సీఎం జగన్‌పై వైఎస్‌ షర్మిల ఫైర్‌ నా పోటీ చిన్నాన్న కోరిక

-షర్మిల

వివేకాను హత్య చేసిన వాళ్లకు ఈరోజు వరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు తప్పించుకుని తిరుగుతూనే ఉన్నారు. అన్ని సాక్ష్యాలూ ఉన్నా, ఎన్ని వాంగ్మూలాలు ఉన్నా.. జగన్‌ వారిని రక్షించడమే కాకుండా అవినాశ్‌రెడ్డికే టికెట్‌ ఇవ్వడం తట్టుకోలేకపోయా.

చిన్నాన్న చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలన్నదే. నా వద్దకు వచ్చి దాదాపు రెండు గంటలపాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని ప్రాధేయపడ్డారు. ఎందుకు అంతగా అడుగుతున్నారో ఆరోజు నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు అర్థమవుతోంది.

చిన్నాన్నను చంపినవాళ్లకే ఎంపీ టికెట్‌ ఇచ్చాడు

ఆయన హత్యను రాజకీయానికి వాడుకున్నారు

ఈ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది

సొంత చిన్నాన్నకే న్యాయం జరగలేదు

ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది?

ఎన్నికలప్పుడు చెల్లి కాదు.. బిడ్డవన్నాడు

కానీ ముఖ్యమంత్రి అయ్యాక మారిపోయాడు

రాజన్న రాజ్యం తెస్తానని రాక్షస రాజ్యం తెచ్చాడు

అన్న జగన్‌పై షర్మిల తీవ్ర ఆగ్రహం

5 లోక్‌సభ, 114 అసెంబ్లీ అభ్యర్థులతో

కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల

హంతకుడు, హత్య చేయించిన వాళ్లు

చట్టసభల్లోకి వెళ్లకూడదు

అందుకే కడప నుంచి పోటీ చేస్తున్నా

ఇది వివేకానందరెడ్డి ఆఖరి కోరిక: షర్మిల

కడప/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ‘జగన్మోహన్‌రెడ్డి నా అన్న.. నా రక్తం.. అన్నంటే నాకు ద్వేషం లేదు. ఎన్నికల్లో నన్ను చెల్లి కాదు బిడ్డ అన్నాడు.. ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడు.. ముఖ్యమంత్రి జగన్‌ ఎవరో నాకు పరిచయం లేడు. ఈ సీఎం నా అనుకున్న వాళ్లందరినీ నాశనం చేశాడు..’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడని.. చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపిన వాళ్లకే కడప ఎంపీ టికెట్‌ ఇచ్చాడని.. ఇది తట్టుకోలేకపోయానని తెలిపారు. ‘హత్య చేసిన వాళ్లను, చేయించిన వాళ్లను తప్పిస్తున్నారు. ఎంపీని వెనకేసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. వివేకా హత్యను రాజకీయానికి వాడుకున్నారు. సొంత చిన్నాన్నకే న్యాయం జరగలేదంటే ప్రజలకు ఏం జరుగుతుంది? చిన్నాన్న కోరిక మేరకు కడప ఎంపీగా పోటీ చేస్తున్నా’ అని ప్రకటించారు. మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో తల్లి వైఎస్‌ విజయలక్ష్మి, కూతురు అంజలి, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, జేడీ శీలం, మీడియా చైర్మన్‌ తులసిరెడ్డితో కలిసి వైఎ్‌సకు నివాళులు అర్పించి ప్రార్థనలు చేశారు. 114 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఐదు ఎంపీ అభ్యర్థులతో కూడిన కాంగ్రెస్‌ తొలి జాబితాను ఘాట్‌పై ఉంచారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ హంతకులను ఈ ఐదేళ్లూ వెనకేసుకొచ్చారని ఆక్షేపించారు. ఘోరమని తెలిసినా.. ప్రజలు హర్షించరని తెలిసినా.. ఎంత అహంకారం కాకపోతే మళ్లీ అదే అవినాశ్‌రెడ్డికి ఇస్తారని నిలదీశారు. ‘రాజకీయ లబ్ధి కోసం వివేకాను హత్య చేస్తే అదే హంతకులకు జగనన్న అండగా నిలబడ్డాడు. మరి రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా నేను ఏం చేయాలి? ఆయన తమ్ముడికే న్యాయం చేయలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి బిడ్డ సునీత న్యాయం కోసం ఈరోజు కోర్టులు, గడపగడపా తిరుగుతోంది. అసలు కనికరం లేదా? వారినే హంతకులు అంటున్నారే.. హృదయం లేదా? ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాశ్‌ను నిలబెట్టారు కాబట్టి.. ఇది హత్యా రాజకీయం కాబట్టి.. ఒక హంతకుడు, హత్య చేయించిన వాళ్లు చట్టసభల్లోకి వెళ్లకూడదనే నేను పోటీచేస్తున్నా’ అని స్పష్టం చేశారు.

ఒక్క చాన్సిస్తే..

రాజశేఖర్‌రెడ్డి కొడుకై ఉండి, ఆయన ఆశయాలను నిలబెడతానని ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను జగనన్న కోరితే జనం అవకాశమిచ్చారని.. కానీ రాక్షస రాజ్యం తెచ్చాడని షర్మిల ధ్వజమెత్తారు. ‘ఒక్క చాన్సిస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. స్వప్రయోజనాల కోసం దానిని బీజేపీకి తాకట్టుపెట్టాడు. పోలవరం నిర్మిస్తానన్నాడు.. బీజేపీతో కుమ్మక్కయ్యాడు. ఆ పార్టీకి బానిసగా మారాడు. వారు ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ మద్దతిచ్చాడు. మణిపూర్‌ విషయంలో బీజేపీని వ్యతిరేకించలేదు. ఒక్క చాన్స్‌ ఇవ్వండి రాజధాని కడతానని.. మద్యనిషేధమని మహిళలను, పేదవాళ్లకు ఇళ్లు అని పేదలను.. జాబులని నిరుద్యోగులను మోసం చేశాడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. ఎక్కడ చూసినా డ్రగ్సే. ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయబోతున్న ఎమ్మెల్యేలు, ఎంపీల అభ్యర్థులం ఇడుపులపాయలో రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద ఆయన ఆశీస్సుల కోసం వచ్చాం. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ నాయకుడు. ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తన ఆఖరి నిమిషం వరకు కాంగ్రెసే దేశంలో అధికారంలో ఉండాలి.. అప్పుడే దేశ ప్రజలకు రక్షణ ఉంటుందని అన్నారు. ఆఖరి కోరిక కూడా రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలన్నదే. రాజశేఖర్‌రెడ్డి బతికిఉంటే ఆ కోరికను నిజం చేసేవారు. 114 అసెంబ్లీ, 5 లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాం. మిగతా పేర్లు త్వరలో విడుదల చేస్తాం. రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా చెబుతున్నా.. కాంగ్రె్‌సను ఆశీర్వదించండి... రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలనను ఆయన బిడ్డగా నేను తీసుకొస్తా’ అని తెలిపారు.

హోదా కోసం ఇద్దరూ ఉద్యమం చేయలేదు

ప్రజలు ఐదేళ్లు చంద్రబాబుకు, మరో ఐదేళ్లు జగన్‌కు అవకాశం ఇచ్చారని.. కానీ వీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ పనిచేయలేదని షర్మిల ఆరోపించారు. ‘ హోదా కోసం ఇద్దరూ ఉద్యమించలేదు. పదేళ్లుగా రాష్ట్రంలో ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు. హోదా వచ్చి ఉంటే ఒక్కో నియోజకవర్గంలో కనీసం వంద పరిశ్రమలైనా వచ్చేవి. రాష్ట్రం అతి దీన పరిస్థితుల్లో ఉందంటే దానికి కారణం చంద్రబాబు, జగనే. అందుచేత ప్రజలంతా ఆలోచించాలి’ అని కోరారు.

సిటింగ్‌లు, సీనియర్లకు చాన్సు

కాంగ్రెస్‌ తొలి జాబితాలో.. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ గూటికి చేరిన ఎమ్మెల్యేలు ఆర్థర్‌ (నందికొట్కూరు-ఎస్సీ), ఎలీజా (చింతలపూడి-ఎస్సీ)కు చోటు దక్కింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్‌కు శింగనమల (ఎస్సీ), వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలీకి గుంటూరు తూర్పు కేటాయించారు. అదేవిధంగా.. కడప లోక్‌సభ స్థానం నుంచి షర్మిల, కాకినాడ-ఎంఎం పల్లంరాజు, రాజమండ్రి-గిడుగు రుద్రరాజు, బాపట్ల (ఎస్సీ)-జేడీ శీలం, కర్నూలు నుంచి పీజీ రాంపుల్లయ్య యాదవ్‌ పేర్లను అధిష్ఠానం ప్రకటించింది.

Updated Date - Apr 03 , 2024 | 04:24 AM