Share News

రాజీనామా చేయాల్సిందే!

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:52 AM

నిన్న మొన్నటి వరకు అధికార వైసీపీకి హీరోలుగా ఉన్న వలంటీర్లను ఇప్పుడు ఆ పార్టీ నేతలే జీరోలు చేస్తున్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం వారిని పావులుగా వాడుకుంంటూ ఇరకాటంలో పెడుతున్నారు.

రాజీనామా చేయాల్సిందే!

వలంటీర్లపై వైసీపీ నేతల నుంచి పెరుగుతున్న తీవ్ర ఒత్తిడి

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 59 మంది మూకుమ్మడి రాజీనామా

ఇష్టం లేకపోయినా గత్యంతరంలేక తప్పుకొంటున్న వైనం

ప్రత్తిపాడు, ఏప్రిల్‌ 4: నిన్న మొన్నటి వరకు అధికార వైసీపీకి హీరోలుగా ఉన్న వలంటీర్లను ఇప్పుడు ఆ పార్టీ నేతలే జీరోలు చేస్తున్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం వారిని పావులుగా వాడుకుంంటూ ఇరకాటంలో పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీని బూచిగా చూపిస్తూ వలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకుల కనుసన్నల్లో గ్రామాల్లో రాజీనామాల కుతంత్రానికి తెరతీశారు. ఇందుకు వలంటీర్ల గ్రూపుల్లో డైరెక్టుగా మెసేజ్‌లు పెడుతూ వలంటీర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అంతే కాకుండా పార్టీ అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చాయో ఏమో కాని స్థానిక నాయకులు సైతం వలంటీర్లతో రాజీనామాలు చేయించే పనిలో పడ్డారు. ‘మళ్లీ మన పార్టీయే వస్తుంది.. అప్పుడు మిమ్మల్నే వలంటీర్లుగా నియమిస్తాం.. ముందు మీరు రాజీనామా చేయండి’ అంటూ హుకుం జారీ చేస్తున్నారు. స్థానిక నాయకుల ఒత్తిడి తట్టుకోలేక వలంటీర్లు రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల కేంద్రంలో 65 మంది వలంటీర్లు ఉండగా అందులో 59 మంది వలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అదే విధంగా వట్టిచెరుకూరు మండలంలోని గారపాడు, కుర్నూతల గ్రామాల్లో కొందరు వలంటీర్లు రాజీనామా చేశారు. ఇదే రీతిలో అన్ని గ్రామాల్లో వలంటీర్లతో రాజీనామా చేయించే పనిలో వైసీపీ నాయకులు నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగానే పెదనందిపాడు మండలంలో వలంటీర్లకు పెట్టిన మెసేజ్‌ ఒకటి బయటికొచ్చింది. ‘వలంటీర్లందరూ రాజీనామా చేయాలని పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. అందరూ రాజీనామా చేసి వాట్సా్‌పలో మీ రాజీనామా లెటర్‌ పెట్టండి’ అంటూ మెసేజ్‌ పెట్టారు. దీంతో ఏమి చేయాలో అర్థంకాక ఎవరికి చెప్పుకోవాలో తెలియక వైసీపీ పెద్దల దెబ్బకు వలంటీర్లు విలవిల్లాడుతున్నారు.

Updated Date - Apr 05 , 2024 | 07:43 AM