Share News

అచ్చెన్నపై చార్జిషీటుకు.. గవర్నర్‌ అనుమతి తీసుకున్నారా?

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:27 AM

అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 19 ప్రకారం.. ఒక ప్రజాప్రతినిధిపై చార్జిషీటు దాఖలు చేయాలంటే.. గవర్నర్‌ అనుమతి తప్పనిసరని విజయవాడ ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.

అచ్చెన్నపై చార్జిషీటుకు.. గవర్నర్‌ అనుమతి తీసుకున్నారా?

సెక్షన్‌ 19 ప్రకారం అది తప్పనిసరి

ఈఎస్‌ఐ కేసులో ఏసీబీ కోర్టు స్పష్టీకరణ

అనుమతి అక్కర్లేదన్న ప్రభుత్వ న్యాయవాదులు

అలా సుప్రీంకోర్టు తీర్పులుంటే

సమర్పించాలని న్యాయాధికారి ఆదేశం

విజయవాడ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 19 ప్రకారం.. ఒక ప్రజాప్రతినిధిపై చార్జిషీటు దాఖలు చేయాలంటే.. గవర్నర్‌ అనుమతి తప్పనిసరని విజయవాడ ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ సీఆర్‌పీసీ సెక్షన్‌ 197ని వర్తింపజేసినా ఈ విధంగా అనుమతి తీసుకోవాలి కదా అని ఏసీబీ అధికారులను ప్రశ్నించింది. ఈఎ్‌సఐ కార్పొరేషన్‌లో 2014-19 మధ్యకాలంలో రూ.900 కోట్ల విలువైన వైద్యపరికరాలు, మందుల కొనుగోళ్లలో రూ.150 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు నెల కిందట ఏసీబీ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీనికి నంబర్‌ కేటాయించే సమయంలో న్యాయాధికారి బి.హిమబిందు గవర్నర్‌ అనుమతి గురించి ప్రస్తావించారు. దీనిపై గురువారం విచారణ జరిగింది. చార్జిషీటు దాఖలుకు గవర్నరు అనుమతి అవసరంలేదని ఏసీబీ తరఫున హైకోర్టు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దుష్యంత్‌రెడ్డి తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(1)(ఈ)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని కోర్టుకు అందజేశారు. దీని ప్రకారం కేసు నమోదు చేసినప్పటి నుంచి ట్రయల్‌ జరిగే క్రమంలో ఎప్పుడైనా గవర్నర్‌ అనుమతి తీసుకోవచ్చని చెప్పారు. ఇది ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారానికి సంబంధించింది కదా అని న్యాయాధికారి ప్రశ్నించారు. సెక్షన్‌ 19 ప్రకారమైనా.. సీఆర్‌పీసీ సెక్షన్‌ 197 ప్రకారమైనా.. చార్జిషీటు దాఖలు చేయడానికి గవర్నర్‌ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు ఏవైనా తీర్పులిస్తే ఆ కాపీలను కోర్టుకు అందజేయాలని ఆమె ఆదేశించారు. అనంతరం విచారణను ఈ నెల ఆరో తేదీకి వాయిదా వేశారు.

Updated Date - Feb 02 , 2024 | 07:04 AM