కష్టకాలం
ABN , Publish Date - Sep 03 , 2024 | 04:21 AM
కృష్ణానదికి భారీ వరద ఓవైపు, బుడమేరు ఉగ్రరూపం మరోవైపు, ఎన్టీఆర్ జిల్లాను కన్నీటి కడలిలో ముంచేశాయి.
ముంపులోనే 2 లక్షల మంది
ఎక్కడికక్కడ ఊపందుకున్న సహాయక చర్యలు
విజయవాడ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదికి భారీ వరద ఓవైపు, బుడమేరు ఉగ్రరూపం మరోవైపు, ఎన్టీఆర్ జిల్లాను కన్నీటి కడలిలో ముంచేశాయి. రెండురోజులుగా వణికిస్తున్న వరద ఉధృతికి సుమారు 2.70 లక్షల మంది ముంపుబారిన పడగా, సోమవారం నాటికి 70 వేల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. మరో రెండు లక్షల మంది ఇంకా ముంపులోనే ఉన్నారు. వారికి ఆహారం, తాగునీరు అందించే ప్రక్రియ నడుస్తోంది. కృష్ణానదికి 11.40 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడ నగరంలోని భవానీపురం, బ్యారేజీ దిగువన ఉన్న రామలింగేశ్వరనగర్ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కృష్ణానది వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి వరద బయటకు వచ్చి బెర్మ్ పార్కును ముంచేసింది. జాతీయరహదారి మీదుగా భవానీపురంలోకి వరద ప్రవేశించడంతో ఆ ప్రాంతంలో మూడు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. మరోవైపు రామలింగేశ్వరనగర్ ప్రాంతంలో కృష్ణానదిలోకి కలిసే ఔట్‌ఫాల్ డ్రైన్ల నుంచి వరద నీరు ఎగతన్నడంతో ఆ ప్రాంతంలో నాలుగు అడుగులుపైగా వరద వచ్చేసింది. మరోవైపు బుడమేరు వరద సోమవారం రెండో రోజూ కొనసాగింది. సహాయక చర్యలు పూర్తిస్థాయిలో అందడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది. చంద్రబాబు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సమస్త యంత్రాంగాన్ని రంగంలోకి దింపి పరుగులు పెట్టిస్తున్నా.. ఇంకా వేలాదిమంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
బుడమేరు డైవర్షన్ చానల్ కుదేలు
విజయవాడ దుఖ:దాయనిగా పేరున్న బుడమేరుకు వరద వస్తే దాని పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలతోపాటు విజయవాడ పల్లపు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకుండదు. గడిచిన 40 ఏళ్లలో బుడమేరుకు ఈ స్థాయిలో వరద వచ్చింది లేదు. అయితే శని, ఆదివారాల్లో బుడమేరుకు 35 వేల క్యూసెక్కుల మేర భారీ వరద వచ్చి చేరింది. ఇలా వస్తున్న వరదను బుడమేరు డైవర్షన్ చానల్ (బీడీసీ) ద్వారా మళ్లించడంతో ఎడమ వైపు ఉన్న కట్టకు కవులూరు - శాంతినగర్ గ్రామాల మధ్య మూడు చోట్ల గండ్లు పడ్డాయి. కుడి వైపు కట్టకు ఏడు చోట్లకు పైగా గండ్లు పడ్డాయి. దీంతో కృష్ణానదికి చేరాల్సిన వరద మొత్తం విజయవాడ వైపు వచ్చేసింది. డైవర్షన్ చానల్ ద్వారా కృష్ణా నదికి చేరిన బుడమేరు వరద సైతం కృష్ణా వరద ఉధృతితో వెనక్కి తన్నడంతో గండ్ల నుంచి మరింత ఎక్కువగా బుడమేరు వరద విజయవాడను ముంచెత్తింది. మరోవైపు ఊహించని వరద బుడమేరును తాకడంతో వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ వరద మొత్తం కవులూరు, ఈలప్రోలు, పైడూరుపాడు, కొత్తూరు తాడేపల్లి, భవానీపురం, గొల్లపూడి, జక్కంపూడి, రాయనపాడు గ్రామాలతోపాటు విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతాన్ని ముంచెత్తింది. అధికారుల ప్రణాళిక లోపంతో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయకపోవడంతో లక్షలాది మంది భారీగా ముంపు ప్రభావానికి గురయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీడీసీ కట్టల బలోపేతానికి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. అంతకుముందు 2016లో టీడీపీ ప్రభుత్వం... కట్టలపై జంగిల్ క్లియర్ చేసి గ్రావెల్‌తో కట్టలను బలోపేతం చేశారు. ఆ తర్వాత పట్టించుకున్నది లేదు.

జాతీయ రహదారిపై అవస్థలు..
ఆదివారం మునేరు ఉధృతితో నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి వరద రావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు స్తంభించాయి. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. సోమవారం సాయంత్రానికి మునేరు శాంతించడంతో రాత్రి నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయరహదారిపై ఉన్న వంతెన అప్రోచ్ రోడ్డు వరద ఉధృతికి కోసుకుపోయింది. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను, విజయవాడ వైపు వచ్చే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించినప్పటికీ లారీలు, భారీ వాహనాల సిబ్బంది, బస్సుల్లోని ప్రయాణికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.తినడానికి తిండి, కనీసం గొంతు తడుపుకొనేందుకు మంచినీళ్లు సైతం దొరక్క అల్లాడిపోవాల్సి వచ్చింది. వరద మధ్యలో మెరక ప్రాంతంలో 40కి పైగా వాహనాలు ఇరుక్కుపోయాయి. ఆదివారం బయటకు తీసుకురావటానికి వీలుపడలేదు. క్రేన్ సాయంతో జనాలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వరద ఉధృతికి ఆరుకార్లు కొట్టుకుపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
ఇబ్రహీంపట్నం రింగ్‌ను తాకిన కృష్ణమ్మ
కృష్ణానదికి వస్తున్న వరదతో ఇబ్రహీంపట్నం మండలంలోని ఏటిపట్టు గ్రామాలతోపాటు విజయవాడ - హైదరాబాద్ పక్కన ఉన్న గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దాములూరు, చిలుకూరు దొనబండ, కొటికలపూడి, మూలపాడు, జూపూడి, కిలేశపురం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఫెర్రీ మొత్తం నీట మునిగింది. ఇబ్రహీంపట్నం రింగ్‌కు కేవలం 10 అడుగుల దూరం వరకు వరద వచ్చి ఆగింది. మూలపాడు, కేతనకొండ, పశ్చిమ ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరుకుంది. వరద ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ప్రజలు జాతీయ రహదారిపైకి చేరుకుని వంటలు చేసుకోవడం కనిపించింది. వందల మంది నిరాశ్రయులతో జాతీయరహదారి నిండిపోయింది.